logo

అవ్వాతాతల పింఛన్లపై జగన్నాటకం

ఏ బిడ్డ కన్నవారిని కష్టపెట్టాలనుకోడు. ఏ మనవడు అవ్వతాతల్ని మండుటెండలో నిల్చోబెట్టి మాడ్చాలని కోరుకోడు. ఏ సోదరుడు అక్కాచెల్లెమ్మలను ఇబ్బంది పెట్టాలని తలంచడు.నోరు తెరిస్తే మీ బిడ్డనంటూ దీర్ఘాలు తీసే సీఎం జగన్‌ మాత్రం అవ్వాతాతలు,

Updated : 01 May 2024 05:07 IST

బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని మొండిపట్టు
నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టేసే కుట్ర

ఏ బిడ్డ కన్నవారిని కష్టపెట్టాలనుకోడు. ఏ మనవడు అవ్వతాతల్ని మండుటెండలో నిల్చోబెట్టి మాడ్చాలని కోరుకోడు. ఏ సోదరుడు అక్కాచెల్లెమ్మలను ఇబ్బంది పెట్టాలని తలంచడు.నోరు తెరిస్తే మీ బిడ్డనంటూ దీర్ఘాలు తీసే సీఎం జగన్‌ మాత్రం అవ్వాతాతలు, అక్కాచెల్లెమ్మలను అష్టకష్టాలకు గురిచేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నారు. నా..నా..అంటూనే.. తాను ఆడే రాజకీయ చదరంగంలో పావులుగా మార్చుకుంటున్నారు. లబ్ధిదారుల ఇంటికెళ్లి చేతిలో పింఛను సొమ్ము పెట్టగలిగే అవకాశం ఉన్నా.. వారిని బ్యాంకుల చుట్టూ తిప్పి.. ఎండలో మాడ్చేసే కుట్రకు తెరతీశారు. ఇదంతా ప్రతిపక్షాలే చేశాయని నమ్మించే నాటకానికి వైకాపా తెర తీస్తోంది.

ఈనాడు డిజిటల్‌, అనంతపురం: ఉమ్మడి అనంత జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. 44 డిగ్రీలు దాటాయి. ఈ పరిస్థితుల్లో పింఛను సొమ్మును బ్యాంకు ఖాతాల్లోనే జమ చేస్తామంటూ జగన్‌ ప్రభుత్వం భీష్మించుకుని కూర్చుంది. ఎంతమంది ఎన్ని సలహాలు ఇచ్చినా..విమర్శలు చేసినా పెడచెవిన పెడుతున్నారు. తాను చెప్పినట్లుగా ఆడే అధికారుల్ని అడ్డం పెట్టుకుని అవ్వతాతలతో రాజకీయ క్రీడ ఆడుతున్నారు. ఇంటింటికీ పింఛన్లు పంచేందుకు సరిపడా సిబ్బంది లేరంటూ ప్రభుత్వ ఉన్నతాధికారులు చెబుతుండగా.. మరోవైపు ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అంటూ సీఎం జగన్‌ సెలవిస్తున్నారు. సెలవు (మే డే) రోజున బాం్యకు ఖాతాల్లో జమచేసి.. ఆ నెపాన్ని ప్రతిపక్షాలపైకి నెట్టేందుకు సిద్ధమయ్యారు.  లబ్ధిదారుల్లో 90 శాతానికి పైగా నిరాక్షరాస్యులే. వేలిముద్రలు వేయడం సరిగా తెలియని పరిస్థితి. వారు డబ్బు డ్రా చేసుకోవాలంటే మరొకరిపై ఆధారపడాల్సి ఉంటుంది. సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికీ పంపిణీ చేస్తే ఒక్కొక్కరికీ సగటున 54 మంది పింఛనుదారులు ఉంటారు. ఖాతాలు లేని వారికి ఇంటివద్దే ఇవ్వాలని నిర్ణయించారు. గ్రామంలో అలాంటి వారు కనీసం 30 శాతం మంది ఉంటారు. అదే చేత్తో మిగతా వారికి సొమ్ము ఇవ్వడానికి వీలున్నా... ఆ దిశగా యంత్రాంగం ఆలోచించడం లేదు.

అనంతపురం జిల్లాలో మొత్తం బ్యాంకులు 286
బ్యాంకులు లేని గ్రామాలు 595


నగదు విత్‌డ్రాపై అవగాహన ఉంటుందా?

ఉమ్మడి జిల్లాలోని చాలా గ్రామాల్లో బ్యాంకు సౌకర్యం లేదు. పక్కనున్న పంచాయతీకో.. లేదంటే మండల కేంద్రానికో వెళ్లాల్సిందే. కొన్ని గ్రామాల పింఛనుదారులు 20 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. పలు గ్రామాల నుంచి బ్యాంకు ఉన్న ఊరికి ఆటో సదుపాయం కూడా లేదు. కష్టపడి వెళ్లినా బ్యాంకింగ్‌ సేవలపై కనీస అవగాహన ఉండకపోవచ్చు. అలాంటి వారు నగదు ఎలా తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. కుమారులు ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళ్లగా ఇంటివద్ద ఒంటరిగా ఉన్న అవ్వతాతల పరిస్థితి మరీ దారుణంగా మారింది. అలాంటి వారికి ఎవరు సాయం చేస్తారనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి.


ఏ బ్యాంకుకు పోవాలా?

శింగనమల: మండలంలోని వెస్టునరసాపురానికి చెందిన ఆదినారాయణ రెండు కాళ్లపై నిలబడలేని స్థితి. ఈయనకు శింగనమల, గార్లదిన్నెలో బ్యాంకు ఖాతాలున్నాయి. పింఛను సొమ్ము ఏ బ్యాంకులో జమ చేశారన్నది ఎవరు చెబుతారు. సొమ్ము తీసుకొనేందుకు ఎక్కడికి వెళ్లాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నడవలేని స్థితిలో ఉన్నవారికి బ్యాంకుల్లో పింఛను తీసుకోవాలంటే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అంత దూరం వెళ్లలేను..
- మల్లమ్మ, చాపిరి, కళ్యాణదుర్గం మండలం

నా వయసు 78 ఏళ్లు. కళ్యాణదుర్గంలోని గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. పింఛన్‌ మొత్తం తీసుకోవాలంటే అక్కడికి వెళ్లే ఓపిక లేదు. ఏడు కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు ఇబ్బందిగానే ఉంటుంది. ద్విచక్ర వాహనంలో కూర్చోలేను. ఆటోల్లో ప్రయాణం చేయలేను. ఈ వయస్సులో ప్రభుత్వం ఇబ్బంది పెట్టడం భావ్యం కాదు.


మాలాంటి వారిపై కక్షనా?
- భాగ్యమ్మ, లింగమనహళ్లి

భర్త మరణించడంతో కుటుంబ బాధ్యతలన్నీ నేనే చూసుకోవాలి. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బ్యాంకుకు వెళ్లి పింఛన్‌ డబ్బు తీసుకోవాలి. ఆ రోజు కూలీ పనులు వదులుకోవాల్సిందే. ప్రభుత్వం మాలాంటి వారిపై కక్ష తీర్చుకోవడం తగదు. ఒంటరి మహిళలు బయటకు వెళ్లాలంటేనే ఇబ్బందిగా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని