logo

అనంతలో తెదేపా నాయకుడి అరెస్టు

అనంతపురం గ్రామీణం రామకృష్ణ కాలనీలో ఇరువర్గాల ఘర్షణ, తెదేపా నాయకుడు జయరాం నాయుడి అరెస్టు ఉద్రిక్తతకు దారితీసింది. ఓ వర్గాన్ని రెచ్చగొట్టి నగేశ్‌పై దాడి చేయించాడనే కారణంతో వన్‌టౌన్‌ పోలీసులు బుధవారం తెల్లవారు జామున జయరాం నాయుడిని అరెస్టు చేశారు.

Published : 02 May 2024 03:39 IST

రామకృష్ణకాలనీ దాడి ఘటనలో ప్రమేయం ఉందంటున్న పోలీసులు
త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ ఎదుట తెదేపా శ్రేణుల ఆందోళన

ఎన్నికల పరిశీలకుడికి ఫిర్యాదు చేస్తున్న, వెంకటశివుడు యాదవ్‌, దగ్గుపాటిప్రసాద్‌, అంబికా లక్ష్మీనారాయణ, తదితరులు

అనంత నేరవార్తలు, కళ్యాణదుర్గంరోడ్డు, న్యూస్‌టుడే: అనంతపురం గ్రామీణం రామకృష్ణ కాలనీలో ఇరువర్గాల ఘర్షణ, తెదేపా నాయకుడు జయరాం నాయుడి అరెస్టు ఉద్రిక్తతకు దారితీసింది. ఓ వర్గాన్ని రెచ్చగొట్టి నగేశ్‌పై దాడి చేయించాడనే కారణంతో వన్‌టౌన్‌ పోలీసులు బుధవారం తెల్లవారు జామున జయరాం నాయుడిని అరెస్టు చేశారు. ఆయనతోపాటు మరికొందరిపై దాడి, హత్యాయత్నం, అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అతడి అరెస్టు తెలుసుకున్న తెదేపా శ్రేణులు, నాయకులు పెద్ద ఎత్తున వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఉంచారన్న సమాచారంతో నాయకులంతా అక్కడికెళ్లి స్టేషన్‌ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతపురం అర్బన్‌ తెదేపా, జనసేన, భాజపా ఉమ్మడి అభ్యర్థి దగ్గుబాటి వెంకటప్రసాద్‌, తెదేపా జిల్లా అధ్యక్షుడు శివుడు యాదవ్‌, కార్పొరేటర్‌ హరిత, తెలుగు యువత రాష్ట్ర అధికార ప్రతినిధి లక్ష్మీనరసింహ, తదితరులు పోలీసుల ఏకపక్ష ధోరణిని నిరసిస్తూ ధర్నా చేశారు. డీఎస్పీ వీర రాఘవరెడ్డి, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జయరాం నాయుడిని ఎక్కడికి తీసుకెళ్లారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ఓటమి భయంతోనే: తెదేపా నాయకులు

ఈ అరెస్టుపై దగ్గుబాటి ప్రసాద్‌ మాట్లాడుతూ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి ఓటమి భయం పట్టుకుందని, అందుకే పోలీసులను అడ్డుపెట్టుకుని తెదేపా నాయకులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ వీరరాఘవరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. జయరాం నాయుడి భార్య సతీమణి హరిత మాట్లాడుతూ.. నెల క్రితం వరకు వైకాపా ఉన్నామని, అక్కడ పరిస్థితులు నచ్చక తెదేపా చేరామని..దీన్ని మనసులో ఉంచుకుని కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ఆమె అన్నారు. అర్బన్‌ డీఎస్పీ, వన్‌టౌన్‌ సీఐ రెడ్డెప్పలను ఇక్కడి నుంచి బదిలీ చేస్తే తప్ప ఎన్నికలు ప్రశాంతంగా జరిగే అవకాశం లేదన్నారు.

ఎన్నికల పరిశీలకుడికి ఫిర్యాదు

ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి తొత్తుగా వ్యవహరిస్తున్న డీఎస్పీ వీరరాఘవరెడ్డి, సీఐ రెడ్డెప్ప సస్పెండ్‌ చేయాలని తెదేపా నాయకులు డిమాండ్‌ చేశారు. దగ్గుబాటి ప్రసాద్‌, అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా తెదేపా అధ్యక్షుడు శివుడు యాదవ్‌ పార్టీ శ్రేణులతో కలిసి ఎన్నికల పరిశీలకులు రవికుమార్‌కు వినతిపత్రం అందజేశారు. రామకృష్ణ కాలనీలో వ్యక్తిగత కారణాలతో ఇరువర్గాల వారు గొడవ పడితే డీఎస్పీ ఉద్దేశపూర్వకంగా  అరెస్టు చేశారన్నారు. జయరాం నాయుడిని బుధవారం రాత్రి వరకూ త్రీటౌన్‌ స్టేషన్‌లో ఉంచారు. హత్యాయత్నం సెక్షను నమోదు కావడంతో జైలుకు తరలించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని