icon icon icon
icon icon icon

తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక

అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు.

Updated : 17 May 2024 09:40 IST

చేసేదిలేక హైదరాబాద్‌ వెళ్లిన కుటుంబసభ్యులు

తాడిపత్రి, న్యూస్‌టుడే: అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. జేసీ సోదరుల ఇంట్లోని పని మనుషులందర్నీ ఇప్పటికే అదుపులో తీసుకున్నారు. దీంతో జేసీ కుటుంబ సభ్యులు ఆకలితో అలమటించాల్సిన దుస్థితి నెలకొంది. తాడిపత్రి పట్టణంలోని వారి నివాసంలో.. నిత్యం వందల మందికి వారు భోజనాలు పెడతారు. అలాంటిది.. తాడిపత్రి పోలీసుల చర్యల కారణంగా వారికే భోజనం పెట్టేవారు కరవయ్యారు.

ఈనెల 14న తాడిపత్రిలో తెదేపా నాయకుడు సూర్యముని ఇంటిపై దాడి జరిగిన అనంతరం.. అక్కడ పెద్దఎత్తున ఘర్షణలు మొదలయ్యాయి. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకున్నారు. తాడిపత్రికి వచ్చిన రాజంపేట డీఎస్పీ చైతన్య.. జేసీ ఇంట్లో పని మనుషులందర్నీ అరెస్టు చేశారు. వారి ఇంటిని ఆధీనంలోకి తీసుకున్నారు. దివాకర్‌రెడ్డి భార్య విజయమ్మ, సోదరి సుజాతమ్మ కొద్దికాలంగా అనారోగ్యంతో మంచానికే పరిమితమయ్యారు. వీరికి సమయానికి మందులు, భోజనం అందించే సిబ్బందిని మంగళవారం తెల్లవారుజామున డీఎస్పీ అదుపులోకి తీసుకున్నారు. దీంతో తన తల్లి, మేనత్తల బాగోగులు చూసుకునేందుకు దివాకర్‌రెడ్డి తనయుడు పవన్‌కుమార్‌రెడ్డి గురువారం తాడిపత్రికి రాగా.. పోలీసులు ఆయనపై సైతం ఆంక్షలు విధించారు. ‘మీరు తాడిపత్రిలో ఉండకూడదు. ఉంటే గృహ నిర్బంధం చేస్తాం’ అని పోలీసులు హెచ్చరించారు. తనపై ఆంక్షలు విధించడం సరికాదని పవన్‌ వాదించినప్పటికీ.. పోలీసులు వినిపించుకోలేదు. చేసేదిలేక కుటుంబ సభ్యులను పవన్‌ హైదరాబాద్‌కు తీసుకువెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img