logo

కానుకలు ఎత్తివేత.. సరకుల్లో కోత

తెదేపా ప్రభుత్వ హయాంలో పండగలు వస్తే పేదలంతా పిండివంటకాలతో సంతోషంగా గడిపేవారు. ఏటా సంక్రాంతి, రంజాన్‌, క్రిస్మస్‌కు కార్డుదారులందరికీ ఉచితంగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఏటా క్రమం తప్పకుండా తెదేపా సర్కారు అందించింది.

Updated : 02 May 2024 04:39 IST

కందిపప్పూ ఇవ్వని జగన్‌
ఐదేళ్లలో ప్రజాపంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తం
అనంతపురం (కళ్యాణదుర్గం రోడ్డు), న్యూస్‌టుడే

తెదేపా ప్రభుత్వ హయాంలో పండగలు వస్తే పేదలంతా పిండివంటకాలతో సంతోషంగా గడిపేవారు. ఏటా సంక్రాంతి, రంజాన్‌, క్రిస్మస్‌కు కార్డుదారులందరికీ ఉచితంగా నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఏటా క్రమం తప్పకుండా తెదేపా సర్కారు అందించింది. అప్పట్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 10,22,627 మంది కార్డుదారులు లబ్ధి పొందారు. సంక్రాంతి, క్రిస్మస్‌ కానుకలు కింద కందిపప్పు ఆర కిలో, పామాయిల్‌ ఆర లీటరు, గోధుమపిండి కిలో, శనగలు కిలో, బెల్లం అర కిలో, నెయ్యి 100 ఎంఎల్‌ చొప్పున పంపిణీ చేశారు. రంజాన్‌ తోఫా కింద గోధుమపండి 5 కిలోలు, చక్కెర 2 కిలోలు, సేమియాలు కిలో, నెయ్యి 100 ఎంఎల్‌ చొప్పున అందించారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పండగ కానుకలను ఎత్తేసింది. బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కొనుగోలు శక్తిలేని పేదలకు పండగలన్నీ దూరం చేశాడు జగన్‌. మరోవైపు ఐదేళ్లలో ఇతర సరకులు సక్రమంగా పంపిణీ చేసిందిలేదు.

కందిపప్పు ఏదీ?

గతంలో కార్డుదారులకు కిలో చొప్పున రాయితీతో కందిపప్పు పంపిణీ చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవ్వడం లేదు. ఏడాదిలో కనీసం రెండు నెలలు కూడా ఇవ్వడం లేదని కార్డుదారులు గగ్గోలు పెడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు కిలో రూ.160 పైమాటే. సుమారు ఎనిమిది నెలల నుంచి కందిపప్పు సరఫరా ఆపేశారు.

కరోనా కాలం నుంచి కేంద్ర ప్రభుత్వం కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేస్తోంది. రాష్ట్రం, కేంద్రానికి సంబంధించి నెలకు రెండు కోటాల బియ్యం కార్డుదారులకు పంపిణీ చేశారు. 1-15 వరకు ఒక కోటా, 15-30 తేదీ వరకు రెండో కోటా పంచేవారు. 2020-22 వరకు పంపిణీ చేశారు. తర్వాత రాష్ట్రం కోటా బియ్యం ఎత్తేసింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత బియ్యం మాత్రమే ఇప్పటికీ ఇస్తున్నారు. సుమారు 15 నెలల నుంచి కేంద్ర ప్రభుత్వ బియ్యం మాత్రమే అందిస్తున్నారు.

లబ్ధిదారులను మోసగిస్తూ..

వైకాపా ప్రభుత్వం రేషన్‌ దుకాణాల ద్వారా అందించే నిత్యావసరాలకు కోత విధించింది. నెలకొక సరకు పంపిణీ చేస్తున్నామని లబ్ధిదారులను మోసం చేస్తోంది. తెదేపా హయాంలో బియ్యం, కందిపప్పు, చక్కెర, గోధుమపిండి, పామాయిల్‌ పంపిణీ చేశారు. ప్రస్తుతం బియ్యం తప్ప ఏవీ ఇవ్వడం లేదు. రాగులు, జొన్నలు, రాగిపిండి, గోధుమపిండి ఇస్తామని చెప్పినా.. పంపిణీ చేయడం లేదు. 

ఇంటింటికీ రేషన్‌ ఉత్తిదే..

మూడేళ్ల కిందట ఇంటింటికీ రేషన్‌ పేరుతో ఎండీయూ వాహనాలను తీసుకొచ్చారు. ఉమ్మడి జిల్లాలో మొత్తం 806 వాహనాలు ఉన్నాయి. వాటి ద్వారా ప్రతి నెలా 1-15వ తేదీ వరకు ఇంటింటా సరకులు పంపిణీ చేయాలి. ఇలా ఎక్కడా సక్రమంగా సాగడం లేదు. ఎక్కడో ఒకచోట బండి నిలిపేస్తున్నారు. కార్డుదారులు నిరీక్షించాల్సిన పరిస్థితి. కొన్నిచోట్ల డీలర్లు వాహనదారులను బెదరించడంతో వెళ్లిపోయారు. మరికొన్నిచోట్ల వీఆర్వోల వేలిముద్ర వేసి దుకాణాల వద్ద డీలర్లే పంపిణీ చేస్తున్నారు.

ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో కార్డుదారులు 12,39,631
అనంతపురం జిల్లాలో 6,67,268
శ్రీసత్యసాయి జిల్లాలో 5,72,363


సన్నబియ్యం ఇస్తామని మోసం

తాడిమర్రి: రేషన్‌ దుకాణాల ద్వారా సన్న బియ్యం పంపిణీ చేస్తామని మోసం చేశారు. ఒక్క నెల కూడా ఆ బియ్యం పంపిణీ చేయక ఇచ్చిన హామీని తుంగలో తొక్కేశారు. కనీసం ఇతర సరకులైనా సక్రమంగా ఇస్తున్నారంటే వాటిలో కూడా పూర్తిగా కోతేశారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఉచిత బియ్యం తప్ప ఏదీ పంపిణీ చేయడం లేదు. ఎండీయూ వాహనాల కోనుగోలు కోసం రూ.1,600 కోట్లు ఖర్చుచేసి వాటిని మూలనపడేసి ప్రజాధనాన్ని వృథా చేశారు.

రాజశేఖర్‌, పిన్నదరి గ్రామం


కందిపప్పు కొనలేకున్నాం..

మడకశిర: పండగకు కూడా కంది పప్పు లేకుండా చేస్తున్నారు. గత ప్రభుత్వంలో పండగ కానుకలు వచ్చేవి. ప్రస్తుతం ఏమీ ఇవ్వడం లేదు. నా కుమారులు ఇద్దరు ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. నేను రోజూ కూలి పనికి వెళ్తాను. ప్రభుత్వం అందించే నిత్యావసరాలపైనే ఆధారపడి ఉన్నాను. బయట కందిపప్పు రూ.170 వరకు ఉంది. పొదుపుగా వాడుకుని కంది పప్పు లేకుండానే సాంబారు వండుకుని తింటున్నాం.

లక్ష్మమ్మ, ఆమిదాలగొంది, మడకశిర మండలం


వాహనం వస్తోంది.. సరకులేవీ?

పుట్టపర్తి: వైకాపా వచ్చాక ఇంటి వద్దకే రేషన్‌ వాహనాలు అన్నారు. వాహనం వస్తోంది.. కానీ, సరకులు మాత్రం లేవు. బియ్యం, జతగా అరకిలో చక్కెర మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఇది నెలకు సరిపోతుందా? గతంలో నిత్యావసర సరకులన్నీ సగం ధరలకే పంపిణీ చేసేవారు. నేడు జేబులకు చిల్లు తప్పడం లేదు. ఆరు నెలలుగా కందిపప్పు ఇవ్వలేదు. నిత్యావసర ధరలు పెరిగి ఆర్థిక ఇబ్బందులతో సతమతవుతున్నాం. 

లక్ష్మీదేవి, పుట్టపర్తి


సంక్రాంతి సంతోషంగా చేసుకొనేవాళ్లం

చెన్నేకొత్తపల్లి: కోడలి అకాల మరణంతో ఆమె ముగ్గురు చిన్నారులను చూసుకుంటున్నాను. కుమారుడు చిన్నాచితకా పనులకు వెళ్లి తెచ్చే కూలితో అరకొరగా కడుపునింపుకొనే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో సంక్రాంతి పండగ వచ్చిందంటే ఊరంతా ఎంతో సంతోషంగా పండగ జరుపుకొనేవారు. మా ఇంటిలో మాత్రం దిగాలుగా ఉండేవాళ్లం. తెదేపా అధికారంలోకి వచ్చాక చంద్రన్న సంక్రాంతి కానుక ఇవ్వడంతో ఏటా ఇంటిల్లీపాదీ ఆనందంగా పండగ చేసుకునేవాళ్లం. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత వాటిని రద్దు చేసి మాలాంటి పేదోళ్ల కడుపులు కొట్టింది.

నీలమ్మ, ఎన్‌ఎస్‌ గేట్


కుటుంబ పోషణ భారం

టీకొట్టు నిర్వహిస్తున్న సావిత్రమ్మ

శింగనమల: గార్లదిన్నె ప్రధాన రోడ్డు పక్కన టీకొట్టు నిర్వహిస్తున్న సావిత్రమ్మకు భర్త, ఒక కుమారుడు ఉన్నారు. పదిహేనేళ్లుగా టీకొట్టుపై ఆధారపడ్డారు. భర్త కూలీ పనికి వెళితే ఈమె టీకొట్టుతో కుటుంబపోషణ చేస్తోంది. గతంలో కందిపప్పు, నూనె, చక్కెరతో పాటు గోధుమలు ఇచ్చేవారు. పండగలకు కానుకలు వచ్చేవి. ఈ సరకులు రాకపోడంతో ప్రతి నెలా నిత్యావసర సరకులు కొనలేకపోతున్నామని వాపోతున్నారు. ప్రభుత్వం చౌకదుకాణంలో సరకులు ఇస్తే ఖర్చు కొంత తగ్గుతుందని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు