logo

నోట్లతో ఎర.. వినకుంటే బెదిరింపు

పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌లో వైకాపా నాయకుల ప్రలోభాల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. పుట్టపర్తి ప్రభుత్వ పాఠశాల వద్ద వైకాపా నాయకులు మోహరించి బేరసారాలు సాగించారు. మండుటెండల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోయినా ఉద్యోగులు ఓపిగ్గా నిరీక్షించి ఓటు వేశారు.

Published : 08 May 2024 05:32 IST

ఉద్యోగులకు తంటాలు
కవ్వింపు చర్యలకు దిగిన అధికార పార్టీ నాయకులు

ఓటర్లతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి

పుట్టపర్తి, న్యూస్‌టుడే : పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌లో వైకాపా నాయకుల ప్రలోభాల పర్వం యథేచ్ఛగా కొనసాగింది. పుట్టపర్తి ప్రభుత్వ పాఠశాల వద్ద వైకాపా నాయకులు మోహరించి బేరసారాలు సాగించారు. మండుటెండల్లో కనీస సౌకర్యాలు కల్పించకపోయినా ఉద్యోగులు ఓపిగ్గా నిరీక్షించి ఓటు వేశారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి, ప్రలోభాలకు తలొగ్గిన కొందరు ఉద్యోగులు, సిబ్బంది పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు వేసినట్లు చరవాణుల్లో చిత్రీకరించి ఓటు వేసినట్లు బయటకు చూపించారు. తెదేపా అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి, ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి తమ అనుచరులతో పుట్టపర్తిలోని కేంద్రంలోకి వెళ్లడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఓటు వేసేందుకు బారులు తీరిన ఉద్యోగులను ఓటు వేయాలని ఎమ్మెల్యే కోరగా, తెదేపా అభ్యర్థి సింధూర, స్వతంత్ర అభ్యర్థి అబ్దుల్‌ అభ్యంతరం చెప్పారు. అక్కడికి చేరుకున్న ఆర్వో భాగ్యరేఖ ఇరువురూ బయటకు వెళ్లాలని కోరారు. పోలీసులు జోక్యం చేసుకుని అక్కడి నుంచి అభ్యర్థులతో పాటు నాయకులను బయటకు పంపివేశారు. పెనుకొండ కేంద్రంలోకి వైకాపా అభ్యర్థి ఉష వెళ్లాలని ప్రయత్నించగా.. తెదేపా అభ్యర్థి సవిత భర్త వెంకటేశ్వరరావు అడ్డుకున్నారు. కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ధర్మవరం కేంద్రం వద్ద వైకాపా నాయకులు తిష్ఠ వేసి డబ్బులు పంపిణీ చేశారు. కదిరి పోలింగ్‌ కేంద్రం వద్ద నోట్లు ఎరవేశారు. జిల్లా వ్యాప్తంగా అంగన్‌వాడీ కార్యకర్తలపై శతవిధాలుగా ఒత్తిడి చేసి, కొంత మేర ఓట్లు వేయించుకున్నారు.

జిల్లా వ్యాప్తంగా 6,108 ఓట్లు

జిల్లా వ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ ప్రక్రియ మంగళవారం చెదురుమదురు ఘటనల నడుమ జరిగింది. పుట్టపర్తి, కదిరి, ధర్మవరం నియోజకవర్గ కేంద్రాల్లో ఆలస్యంగా ప్రక్రియ ప్రారంభమైంది. ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 6,108 ఓట్లు పోలయ్యాయి. పుట్టపర్తి పాఠశాలలో జరుగుతున్న ఫెసిలిటేషన్‌ కేంద్రాన్ని కలెక్టర్‌ అరుణ్‌బాబు పరిశీలించారు. పుట్టపర్తిలో 1001, ధర్మవరంలో 1093, పెనుకొండలో 1118, హిందూపురంలో 332, కదిరిలో 799, మడకశిరలో 641, ఓట్లు వేశారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు తమ ఓటు హక్కును అత్యధికంగా వినియోగించుకోనున్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో 440 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు