logo

నాడు బాదుడే బాదుడన్నాడు.. నేడు పన్నులు దండుకున్నాడు

చంద్రబాబు పాలనలో ప్రజలపై పన్నులు బాదుడే బాదుడు అంటూ.. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ నాటి తెదేపా ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు. ఆయన అధికారంలోకొచ్చాక.. నిస్సిగ్గుగా ఏటా ఆస్తి పన్ను పెంచి ప్రజలపై భారం మోపాడు.

Updated : 08 May 2024 07:25 IST

ఏటా ఆస్తి పన్ను పెంచి ప్రజలపై భారం మోపిన జగన్‌
రాయితీ, రీబేట్‌ ఇచ్చినా చెల్లించడానికి జనం వెనుకడుగు

అనంత నగరపాలక, హిందూపురం పట్టణం, న్యూస్‌టుడే: చంద్రబాబు పాలనలో ప్రజలపై పన్నులు బాదుడే బాదుడు అంటూ.. 2019 ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుడిగా జగన్‌ నాటి తెదేపా ప్రభుత్వంపై ఎద్దేవా చేశారు. ఆయన అధికారంలోకొచ్చాక.. నిస్సిగ్గుగా ఏటా ఆస్తి పన్ను పెంచి ప్రజలపై భారం మోపాడు. తెదేపా హయాంలో వార్షిక అద్దె విలువ (ఏఆర్‌వీ) ఆధారంగా ఐదేళ్లకోసారి నగరాలు, పురపాలికల్లో ఆస్తి పన్ను పెంచే విధానం అమల్లో ఉండేది. ఆ విధానం కొనసాగిస్తే ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో ఇచ్చిన సొమ్మును ఏదో ఒకరూపంలో వెనక్కి తీసుకోవడానికి అవకాశం ఉండదనే ఉద్దేశంతో జగన్‌ గత విధానానికి తెరదింపి ఆస్తి మూల ధన విలువ (సీవీ) ఆధారంగా ఏటా 15 శాతం చొప్పున పన్ను పెంచుతూ వెళ్లారు. సామాన్య,  మధ్య తరగతి, వ్యాపారులు, సంపన్నులు ఇలా అన్నివర్గాల ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరింత ఎక్కువ బకాయిలు రాబట్టుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం మార్చిలో ఏక కాలంలో మొత్తం చెల్లిస్తే వడ్డీ మాఫీ ప్రకటించడంతో పాటు ఏప్రిల్‌లో 5 శాతం రిబేటు ఇచ్చినా ప్రజలు పట్టించుకోవడం లేదు. గతేడాది కంటే ఈ సంవత్సరం పన్నులు తక్కువగా వసూళ్లు అయ్యాయి. ఆస్తి పన్ను కట్టేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు.

అంతా లోగుట్టే..

సాధారణంగా మార్చి 31వ తేదీతో ఆర్థిక సంవత్సరం ముగుస్తుంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవగానే ఆయా నివాసాలకు సంబంధించి ఆస్తి పన్ను వివరాలను ప్రజలకు నోటీసులు ఇస్తారు. ఈ సంవత్సరం ఎన్నికల ముందు కూడా 15 శాతం పన్నుల పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల నోటిషికేషన్‌ రావడంతో ప్రజల్లో మరింత వ్యతిరేకత వస్తుందనే భయంతో గుట్టుగా ఉంచారు. నోటీసులు తయారు చేసినా ప్రజలకు ఇవ్వలేదు. ప్రజలకు నోటీసులు ఇస్తే 5 శాతం రిబేటు ఇచ్చి 15 శాతం గుంజుతున్నారన్న వ్యతిరేకత బహిర్గతం కాకుండా జాగ్రత్త వహిస్తున్నారు.

జనం కట్టలేకపోతున్నారు..

స్థల, భవనాలకు మార్కెట్‌ విలువలను లెక్క కట్టి.. అందుకు అనుగుణంగా ఆస్తి పన్ను పెంచుతూపోతున్నారు. ప్రజలకు ఉన్న ఆస్తికి సంబంధించి, మార్కెట్‌ విలువలో 0.5 శాతం పన్ను ఉండేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకోసం ఏటా 15 శాతం పన్ను పెంపును నాలుగేళ్లుగా అమలు చేస్తున్నారు. దీంతో నాలుగేళ్ల కిందట రూ.1,000 ఆస్తి పన్ను చెల్లించేవారు ప్రస్తుత సంవత్సరంలో రూ.1,750 చెల్లించాల్సి వస్తోంది. దీనికి అదనంగా చెత్త పన్ను విధించి వసూలు చేస్తున్నారు. ఇలా ఏడాదికేడాది పన్ను పెరిగిపోతుండటంతో ప్రజలు ఆర్థిక భారంతో అల్లాడిపోతున్నారు. సామాన్యులు చెల్లించలేకపోతున్నారు.

కనీస సౌకర్యాలు కరవు.. పన్నుల దరువు

రాయదుర్గం: వైకాపా పాలనలో కనీస సౌకర్యాలు కల్పించటంలో మున్సిపల్‌ పాలక వర్గం విఫలమైనా పన్నులు మాత్రం ఏటా ఎడాపెడా పెంచుతోంది. రాయదుర్గం పట్టణంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు, మురుగు కాలవలు, తాగునీటి సరఫరా, వీధిదీపాలు వంటి మౌలిక వసతులు కూడా సక్రమంగా కల్పించలేని దుస్థితి నెలకొంది. పన్నులు చెల్లించకపోతే కుళాయి కనెక్షన్‌ తొలగిస్తామని గడ్డపారలతో వచ్చే మున్సిపల్‌ అధికారులు సౌకర్యాలు పెంచడంలో విఫలమయ్యారు. పట్టణంలో 11,289 ఇళ్లు ఉండగా ఏటా రూ.3.25 కోట్ల పన్నులు వసూలు చేయాల్సి ఉండగా గత ఏడాది వడ్డీ మాఫీ చేసినా 77 శాతం మేర మాత్రమే వసూలయ్యాయి. ఈ ఏడాది 5 శాతం రాయితీ ఇచ్చినా 45 శాతం మేర రూ.70 లక్షలు వసూలయ్యాయి. ఆర్థిక భారం కారణంగా ప్రజలు పన్నులు చెల్లించలేకపోతున్నారు.

ఏటా పెంపు: పట్టణంలోని గొంచికారి తిప్పేస్వామి లేఅవుట్‌లో నివసిస్తున్న పేర్మి సత్యసారాయణకు చెందిన అసెస్‌మెంట్‌ 1006006167 నంబరుకు 2022-23లో రూ.6,761 ఆస్తి పన్ను రాగా 2023 - 2024లో రూ.1,295 అధికంగా రూ.8,056 వచ్చింది. 2024-20025లో రూ.9,264 వచ్చింది. రూ.1,208 పెంచారు. కారణాలు తెలపకుండా రెండేళ్లుగా పెంచుతూనే ఉన్నారు.

ఇంటి పన్ను అద్దెలా చెల్లించాల్సి వస్తోంది..

కదిరి: పాన్‌సెంటర్‌ నిర్వహణతో కుటుంబం నెట్టుకొస్తున్నాను. కుటుంబ పోషణ, పిల్లల చదువు నా సంపాదనతోనే గడవాలి. సొంతిల్లు ఉన్నా పన్ను భారం తప్పడం లేదు. ఇంటి పన్ను మూడురెట్లు పెంచేశారు. గతంలో ఆర్నెళ్లకోసారి రూ.150 వసూలు చేసేవారు. ఇప్పుడది రూ.450కి పెంచేశారు. ఏడాదికి రూ.900, అంటే.. అదనపు భారం రూ.600 పడింది. దీనికితోడు నీటి పన్ను రూ.150 వస్తోంది. మాలాంటి సామాన్యులకు ఇంటి పన్నునే అద్దెలా చెల్లించాల్సి రావడం భారంగా మారింది.

సులేమాన్‌, కదిరి

ఇళ్ల యజమానులపై ఆర్థిక భారం

గుంతకల్లు: వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గుంతకల్లు మున్సిపాలిటీలో ఇంటి పన్నులు ఒకేసారి పెద్దఎత్తున పెంచడంతో కొందరు పన్నులు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపాలిటీలో పన్నులు చెల్లించే ఇళ్లు 29102 ఉన్నాయి. గత సంవత్సరం ఇంటి, నీటి పన్నుల రూపంలో మున్సిపాలిటీకి రూ.12 కోట్లు వసూలు కావాల్సి ఉండగా రూ.7.25 కోట్లు మాత్రమే వసూలయ్యాయి.

రెట్టింపు చేశారు

లాలూహుసేన్‌, కసాపురం రోడ్డు

గతంలో మేం ఇంటి పన్నును ప్రతి సంవత్సరం రూ.6 వేలు చెల్లించేవారం. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమాంతంగా పెంచారు. ఇప్పుడు పన్ను రూ.12 వేలు చెల్లించాల్సి వస్తోంది. చెల్లించలేకపోతే అధికారులు నోటీసులు ఇస్తూ ఇబ్బంది పెడుతున్నారు.పన్ను విధించే సమయంలో సాధ్యాసాధ్యాలు గుర్తించాలి.

విపరీతంగా పెంచారు

లక్ష్మీనారాయణ, విజయనగర్‌ కాలనీ

గతంలో రూ.350 చెల్లించేవారం. వైకాపా ప్రభుతం వచ్చిన తరువాత పన్ను మొత్తాన్ని రూ. 700 చేసింది. ఇలా విపరీతంగా పెంచితే పేదలం ఏవిధంగా చెల్లించగలం. పన్నులను పెంచే ముందు ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను సేకరించాలి. నిరుపేదల పరిస్థితిని అర్థం చేసుకుని పన్నులు విధించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు