logo

అల్లర్లపై అప్రమత్తం

రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత సైతం పలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగే ప్రమాదం ఉందన్న నిఘావర్గాల హెచ్చరికలతో జిల్లా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది.

Published : 23 May 2024 01:59 IST

60 ప్రాంతాలు గుర్తించిన పోలీసులు
ముందస్తు చర్యలతోనే కట్టడి సాధ్యం

కూచివారిపల్లిలో మంగళవారం రాత్రి ఎస్పీ హర్షవర్ధన్‌ రాజు ఆకస్మిక తనిఖీ

ఈనాడు-తిరుపతి : రాష్ట్రంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత సైతం పలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగే ప్రమాదం ఉందన్న నిఘావర్గాల హెచ్చరికలతో జిల్లా పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. ఎన్నికల రోజుతోపాటు తర్వాత జరిగిన ఘర్షణల నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మొత్తం 60 ప్రాంతాలను సమస్యాత్మకంగా గుర్తించారు. ఇక్కడ ఇప్పటికే ఆయా గ్రామాల్లో కవాతు నిర్వహించడంతోపాటు కార్డెన్‌ సెర్చ్‌ చేపడుతున్నారు. అయితే గత అనుభవాలు, ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనలు దృష్టిలో ఉంచుకుని భద్రతపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తేనే ఘర్షణలు నిరోధించేందుకు ఆస్కారం ఉంది.

ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ప్రధానంగా నామినేషన్ల దాఖలు సమయంలోనే తిరుపతి ఆర్డీవో కార్యాలయం వద్ద వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య రాళ్ల దాడి జరిగింది. అక్కడ మొదలు ఎక్కడో ఒకచోట గొడవలు జరుగుతూనే ఉన్నాయి. అప్పట్లో పోలీస్‌ అధికారులు వాటిని తేలిగ్గా తీసుకున్నారు. సాధారణంగా జరిగేవిగానే భావించారు. అయితే ఆ ప్రభావం ఎన్నికల రోజుతోపాటు తర్వాత చూపించాయి. ఎన్నిక రోజున రామచంద్రాపురం మండలం బ్రాహ్మణకాల్వలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు ఏకంగా గాల్లోకి కాల్పులు జరిపారు. రామిరెడ్డిపల్లె, కూచువారిపల్లెల్లో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణులు విచక్షణారహితంగా దాడులకు తెగబడ్డారు. అప్పటికీ పోలీసులు సరైన చర్యలు చేపట్టలేదు. దీని ఫలితంగానే శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్‌రూంల పరిశీలన సమయంలో తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం జరిగింది. అప్పటి నుంచి జిల్లాలోని వివిధ ప్రాంతాలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. ఎప్పుడు ఘర్షణలు జరుగుతాయోనని పలు ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు.

చంద్రగిరిలో 30 గ్రామాలు

ఓట్ల లెక్కింపు తర్వాతా ఘర్షణలు చోటుచేసుకునే ఆస్కారం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించిన నేపథ్యంలో జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. మొత్తం 60 ప్రాంతాల్లో చంద్రగిరి నియోజకవర్గంలోనే 30 సమస్యాత్మక గ్రామాలున్నట్లు తేల్చారు. ఇప్పటికే కీలక నేతల కదలికలపై ఆంక్షలు విధించారు. చంద్రగిరి, వెంకటంపేట, రామిరెడ్డిపల్లె, కూచువారిపల్లె, ఎ.రంగంపేట గ్రామాల పరిధిలో కవాతు నిర్వహించారు. శ్రీసిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని తొండూరు, కోట పరిధిలోని ప్రకాష్‌నగర కాలనీ, ఎన్టీఆర్‌ కాలనీల్లో కార్డన్‌ సెర్చ్‌ చేపట్టారు. ప్రస్తుతం రెండు సీఆర్‌పీఎఫ్‌ కంపెనీలు, సీఐఎస్‌ఎఫ్‌ బలగాలు విధ]ుల్లో ఉన్నాయి. అవసరమైతే మరిన్ని బలగాలను తీసుకోవాల్సిన అవసరం ఉంది. రెండురోజుల కిందట దీనిపై ఎస్పీ హర్షవర్ధన్‌రాజు మాట్లాడుతూ జిల్లా పరిధిలో ఎన్నికల సమయంలో భద్రత సిబ్బందిని వివిధ ప్రాంతాల్లో నియమించామని, ఇప్పుడు అవసరంలేని ప్రాంతాల నుంచి వాళ్లను సమస్యాత్మకంగా ఉన్న చోట్ల నియమిస్తామని స్పష్టం చేశారు. బెండోవర్లు సైతం కొనసాగుతున్న నేపథ్యంలో మొత్తంగా ముందస్తు చర్యల ద్వారానే ఘర్షణలు నివారించవచ్చని, ఇందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని