logo

షాకిచ్చారు..

విద్యుత్తు అధికారులకు ఏపీఈఆర్‌సీ షాక్‌ ఇచ్చింది.. విద్యుత్తు శాఖ పౌరపట్టిక ప్రకారం వినియోగదారులకు సేవలందించడంలో అలసత్వం ప్రదర్శించిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు(ఏఈ), క్షేత్రస్థాయి అధికారులకు అపరాధ రుసుం విధించింది.

Updated : 24 May 2024 05:35 IST

సేవలందించని ఇంజినీర్లకు జరిమానా
ఏఈలకు ఏపీఈఆర్‌సీ ఝలక్‌
న్యూస్‌టుడే, చిత్తూరు(మిట్టూరు)

విద్యుత్తు అధికారులకు ఏపీఈఆర్‌సీ షాక్‌ ఇచ్చింది.. విద్యుత్తు శాఖ పౌరపట్టిక ప్రకారం వినియోగదారులకు సేవలందించడంలో అలసత్వం ప్రదర్శించిన అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు(ఏఈ), క్షేత్రస్థాయి అధికారులకు అపరాధ రుసుం విధించింది.. రుసుం మొత్తాన్ని సంబంధిత ఇంజినీర్లు, అధికారుల వేతనాల నుంచి కోత విధించాలని ప్రతిపాదిస్తూ ఉత్తర్వులిచ్చింది.. ఉద్యోగుల నుంచి వసూలు చేసిన మొత్తాన్ని వెంటనే సంబంధిత వినియోగదారులకు చెల్లించాలని ఆదేశించింది.. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి మార్చి 31 వరకు మూడు నెలల్లో సేవలు అందించని ఇంజినీర్లకు రూ.23,14,550 అపరాధ రుసుం విధించారు.

ఇలా చేసినందుకే..

ఉమ్మడి చిత్తూరు జిల్లా విద్యుత్తు శాఖ తిరుపతి సర్కిల్‌ పరిధిలో ఎనిమిది డివిజన్లు ఉన్నాయి. వీటి పరిధిలో అన్ని రకాలకు సంబంధించి సుమారు 19.52లక్షల సర్వీసులు ఉన్నాయి. సర్కిల్‌ 99 సెక్షన్‌ కార్యాలయాలు ఉన్నాయి. నూతన సర్వీసులు జారీలో జాప్యం, ఫ్యూజ్‌ ఆఫ్‌ కాల్స్‌ ద్వారా ప్రస్తావనకు వచ్చిన సమస్యలు, పనుల అంచనా విలువ(ఎస్టిమెంట్లు)లకు వినియోగదారుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు అందాయి. వీటిని సకాలంలో పరిష్కరించాల్సిన బాధ్యత సంబంధిత ఇంజినీర్లదే. అయితే ఈ విషయంలో వారు తీవ్ర నిర్లక్ష్యం వహించారు. అంచనాలు సిద్ధంలో జాప్యం, విద్యుత్తు స్తంభాలు, లైన్లు, స్తంభాలు, మీటర్ల మార్పు, అధిక బిల్లింగ్‌ తదితర సమస్యలు పౌరపట్టిక ప్రకారం వారు పరిష్కరించలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఇలా అలసత్వం ప్రదర్శించిన 2,341 సర్వీసులకు సంబంధించి రూ.123,14,550 అపరాధ రుసుం విధించారు.

పెరుగుతోన్న సేవాలోపాలు..

మూడేళ్ల నుంచి సకాలంలో సేవలందించని వారికి ఏపీఈఆర్‌సీ అపరాధ రుసం విధిస్తోంది. అయినా ఇంజినీర్లలో ఆశించిన మేర మార్పు రాలేదు. కొందరు అపరాధ రుసుం నుంచి తప్పించుకునేందుకు సీనియారిటీ జాబితాలో దరఖాస్తులు తొలగిస్తున్నారు. గడువు దాటిన దరఖాస్తులు పక్కన పెట్టేస్తున్నారు. సేవా లోపం సమస్యలు నానాటికీ పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఫలితంగా వినియోగదారులు అవస్థ పడుతున్నారు.


సకాలంలో సేవలందించేలా చర్యలు..

పౌరపట్టిక నిబంధనలకు అనుగుణంగా వినియోగదారులకు సకాలంలో సేవలందించేలా చర్యలు తీసుకుంటాం. సకాలంలో సేవలందించని అధికారులకు ఏపీఈఆర్‌సీ అపరాధ రుసుం విధిస్తుంది.

కృష్ణారెడ్డి, ఎస్‌ఈ, తిరుపతి సర్కిల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని