logo

నిధుల్లేక.. వసతి గృహలు వెలవెల

పలమనేరు పట్టణంలోని సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహంలో 10 మరుగుదొడ్లు మరమ్మతులకు నోచుకోలేదు. నీటి సరఫరా పైపులైన్లు పాడైపోయాయి. ఇక బేసిన్లు విరిగిపోయాయి. విద్యార్థులు వాటిని ఉపయోగించుకునే వీలు లేదు.

Updated : 01 Apr 2023 05:29 IST

సమస్యలతో అవస్థలు పడుతున్న విద్యార్థులు

పలమనేరు పట్టణంలోని సాంఘిక సంక్షేమశాఖ బాలుర వసతి గృహంలో 10 మరుగుదొడ్లు మరమ్మతులకు నోచుకోలేదు. నీటి సరఫరా పైపులైన్లు పాడైపోయాయి. ఇక బేసిన్లు విరిగిపోయాయి. విద్యార్థులు వాటిని ఉపయోగించుకునే వీలు లేదు. దాంతో అధికారులు గదులకు తాళాలు వేశారు. ఇక్కడ 200 మంది విద్యార్థులకు ఉన్న 11 మరుగుదొడ్లలో 10 పాడయ్యాయి. అయితే విధిలేక వాటిలోనే ఒక మోస్తరుగా ఉన్న రెండుమూడింటిలో ఏదోలా వారు అవస్థలు పడి సర్దుకుంటున్నారు.

పలమనేరు, న్యూస్‌టుడే: ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు అందకపోవడంతో వసతి గృహాలు వెలవెలబోతున్నాయి. కనీసం మరుగుదొడ్ల మరమ్మతుకు కూడా సొమ్ములు లేక అధికారులు అవస్థలు పడుతున్నారు. ఫలితంగా వసతి గృహాల్లోని విద్యార్థులు సమస్యలతో అల్లాడిపోతున్నారు. నియోజకవర్గం పరిధిలోని 10 సంక్షేమ హాస్టళ్లలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.

రెండేళ్లుగా ఇదే పరిస్థితి

రెండేళ్ల నుంచి సాంఘిక సంక్షేమశాఖకు రావాల్సిన నిధులు ప్రభుత్వం నుంచి విడుదల కాలేదు. ఫలితంగా అధికారులు సంక్షేమ హాస్టళ్లలో కనీస మరమ్మతులు కూడా చేపట్టలేకపోతున్నారు. స్టేషనరీకి సంబంధించి నిధులు లేకపోవడంతో కార్యాలయానికి అవసరమైన పేపర్లు, పుస్తకాలు కొనుగోలు చేయడంలేదు. ఇక చిన్న చిన్న మరమ్మతులు చేసుకోడానికి కూడా నిధులు రావడంలేదు. దాంతో విద్యుత్‌ దీపాలు, కొళాయిలను కూడా అమర్చుకోలేకపోతున్నారు.

ఎంతెంత రావాలంటే

పలమనేరు సాంఘిక సంక్షేమశాఖ కార్యాలయం పరిధిలోని 10 సంక్షేమ హాస్టళ్లకు సంబంధించి స్టేషనరీకి రావాల్సిన రూ.34,350, మైనర్‌ రిపేర్లకు సంబంధించి రూ.44,180 రెండేళ్ల నుంచి రావడంలేదు. ఇక కాస్మొటిక్‌ ఛార్జీలు గత ఏడాది అక్టోబరు వరకు మాత్రమే వచ్చాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూ.89,375 రావాల్సి ఉంది. ఇలా విద్యార్థుల అవసరాల కోసం రావాల్సిన నిధులు కూడా ప్రభుత్వం నుంచి రాలేదు. దాంతో సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు సంక్షేమానికి కాస్త దూరంగా ఉన్నారు. ఒక్క భోజనం మాత్రం పెడుతున్నారు తప్పా మరే వసతి కల్పించడానికి అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయడం లేదు.


నిధులు వస్తాయి

అన్ని బిల్లులకు సంబంధించి సబ్‌ట్రెజరీలో ఆమోదం వచ్చింది. త్వరలోనే నిధులు విడుదల కానున్నాయి.

షకీల, సాంఘిక సంక్షేమశాఖ అధికారి, పలమనేరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని