logo

సరిహద్దు దాటుతున్న సంపద!

సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని దొరవారిసత్రం మండలం చందనంమూడి చెరువు, ఆనేపూడి, ఏకొళ్లు తదితర ప్రాంతాల్లో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. కొంత స్థానిక లేఔట్లకు వినియోగిస్తుండగా మరికొంత పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారు.

Published : 02 Jun 2023 02:19 IST

పక్క రాష్ట్రానికి అక్రమంగా తరలింపు
నామమాత్రంగానే అధికారుల తనిఖీలు

ఈనాడు-తిరుపతి, న్యూస్‌టుడే, సూళ్లూరుపేట:

దొరవారిసత్రం మండలం వడ్డికండ్రిగ పూలతోట వద్ద టిప్పర్లతో మట్టి తరలింపు

* సూళ్లూరుపేట నియోజకవర్గ పరిధిలోని దొరవారిసత్రం మండలం చందనంమూడి చెరువు, ఆనేపూడి, ఏకొళ్లు తదితర ప్రాంతాల్లో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. కొంత స్థానిక లేఔట్లకు వినియోగిస్తుండగా మరికొంత పక్క రాష్ట్రానికి తరలిస్తున్నారు.

* పెళ్లకూరు మండల పరిధిలోని సీఎన్‌పేట, శిరసనంబేడు, రోసనూరు, కానూరు తదితర ప్రాంతాల్లో మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు.

* ఓజిలి మండలం మాచవరం తదితర ప్రాంతాల్లో మట్టి అక్రమ రవాణా జరుగుతోంది. నాయుడుపేట మండలం పూడేరు పరిధిలో ఇదే పరిస్థితి.

* సత్యవేడు పరిధిలోని కన్నవరంలో మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పలుమార్లు స్థానికులు టిప్పర్లను అడ్డుకున్నా ప్రయోజనం మాత్రం లేకుండా పోయింది.
తిరుపతి జిల్లా పరిధిలోని సరిహద్దు మండలాల నుంచి రాష్ట్ర సంపద పక్క రాష్ట్రానికి తరలిపోతోంది. జిల్లా సరిహద్దు నుంచి యథేచ్ఛగా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు అడపాదడపా పట్టుకుంటున్నా అవి కేవలం నామమాత్రమేనన్న వాదనలు వినిపిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం స్థానికంగా అధికార పార్టీ నేతల అండదండలతోనే నడుస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తిరుపతి జిల్లాకు అనేక మండలాలు సరిహద్దు ప్రాంతాలుగా ఉన్నాయి. దీంతో ఇక్కడి సహజ సంపదను అక్రమార్కులు పక్క రాష్ట్రానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో నాగలాపురం ప్రాంతం నుంచి ఇసుకను పెద్ద ఎత్తున తరలించేవారు. అయితే దానిపై ఎన్‌జీటీ ఆగ్రహించడంతో తవ్వకాలు నిలిపివేశారు. ఇప్పుడు ఇసుక రవాణా స్థానంలో సరిహద్దు మండలాల నుంచి మట్టిని తరలిస్తున్నారు. చెరువులు, గుట్టలు, ప్రభుత్వ భూముల్లోనే వీటి తవ్వకాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాత్రిపూట తవ్వకాలు చేస్తున్నారు. సత్యవేడు, సూళ్లూరుపేట నియోజకవర్గాల పరిధిలోని పలు మండలాల నుంచి అక్రమ రవాణా సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో జేసీబీలతో తవ్వకాలు చేసి మరీ తరలిస్తున్నారు. దీనివల్ల ఆయా చెరువులు, ప్రాంతాల్లో గోతులు ఏర్పడుతున్నాయి. వర్షాకాలంలో ఇవి ప్రమాదకరంగా మారే ఆస్కారం ఉందని స్థానికులు వాపోతున్నారు.

స్థానిక నేతల అండ..

సాధారణంగా తమ ప్రాంతంలోని ఖనిజ సంపద ఇతర ప్రాంతాలకు తరలిపోతుంటే స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులు వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం స్థానికంగా ఉన్న నేతల అండదండలతో దందా జోరుగా సాగుతోంది. ముందుగా స్థానిక నేతలు కొన్ని ప్రాంతాలను గుర్తించి అక్కడ మట్టి తవ్వకాలకు అనధికారికంగా అనుమతులు ఇస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. తమకు అనుకూలంగా ఉన్న వ్యక్తులకు మాత్రమే అనుమతులు ఇస్తుంటారు. తద్వారా ఎక్కడా సమస్య రాకుం డా ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్కో టిప్పరు మట్టికి ధర నిర్ణయిస్తారు. దీని ప్రకారం స్థానిక నేతలు చెప్పిన ప్రాంతంలో తవ్వకాలు చేస్తూ మట్టిని తీసుకెళ్తున్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో అధికార యం త్రాంగం సైతం చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు.

చిన్నచిన్న రహదారుల నుంచి...

మట్టి అక్రమ రవాణాకు స్థానికంగా ఉన్న చిన్నచిన్న రహదారులను వినియోగిస్తున్నారు. ప్రధాన రహదారిపై వెళ్తే ఒకచోటు కాకుంటే మరో ప్రాంతంలోనైనా ఆటంకాలు ఎదురయ్యే ఆస్కారం ఉందని అక్రమార్కులు భావిస్తున్నారు. దీంతో తమిళనాడు ప్రాంతానికి వెళ్లే స్థానిక రహదారుల ద్వారానే మట్టిని తీసుకెళ్తున్నారు. దీనివల్ల ఎక్కువ టిప్పర్ల ద్వారా తరలించినా ఇతరుల కంట పడమన్న భావన అక్రమార్కుల్లో నెలకొంది. దీంతో మన రాష్ట్ర సంపదను అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నా అధికార యంత్రాంగం నియంత్రించడంలో విఫలమవుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎస్‌ఈబీ, స్థానిక రెవెన్యూ యంత్రాంగం, భూగర్భ గనుల శాఖ అధికారులు నామమాత్రంగానే దాడులు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.


ఏడీ మైనింగ్‌ ద్వారా చర్యలు తీసుకుంటాం

సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కడైనా అక్రమ రవాణా ఉంటే వెంటనే ఏడీ మైనింగ్‌ ద్వారా పరిశీలించి చర్యలు తీసుకుంటాం. ఇతర ప్రాంతాలకు అక్రమంగా తరలించకుండా అడ్డుకట్ట వేస్తాం.

వెంకటరమణారెడ్డి (కలెక్టర్‌)


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని