logo

అమ్మఒడికి ఎన్నాళ్లీ నిరీక్షణ?

అమ్మఒడి పథకం నిధుల జమ కోసం లబ్ధిదారుల నిరీక్షణ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కి మూడు వారాలు దాటినా కొందరికి పూర్తిగా డబ్బులు అందకపోగా.. మరికొందరి ఖాతాల్లో కొంతమేర నగదు జమైంది.

Published : 22 Jul 2023 03:13 IST

కొందరి ఖాతాల్లో రూ.4 వేలు, రూ.9వేలు జమ  
లబ్ధిదారులకు ఆపసోపాలు

ఈనాడు, చిత్తూరు: అమ్మఒడి పథకం నిధుల జమ కోసం లబ్ధిదారుల నిరీక్షణ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి జగన్‌ బటన్‌ నొక్కి మూడు వారాలు దాటినా కొందరికి పూర్తిగా డబ్బులు అందకపోగా.. మరికొందరి ఖాతాల్లో కొంతమేర నగదు జమైంది. దీంతో మహిళలు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. తమ చిన్నారుల పేర్లు అర్హుల జాబితాలో ఉన్నా ఇంత జాప్యం జరగడానికి కారణాలేంటని ప్రశ్నిస్తున్నా వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది నుంచి సరైన సమాధానం రావడంలేదని అంటున్నారు. పలువురు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి పరిశీలిస్తున్నా ఫలితం లేదని చెబుతున్నారు.
జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదివే విద్యార్థుల సంఖ్య 2,44,706గా తేలింది. అమ్మఒడి పథకంలో ఒకే ఇంట్లో ఒకరినే అర్హులుగా చేయడంతో తుదిగా 1,52,542 మందిని లబ్ధిదారుల జాబితాలో చేరారు. వీరందరి తల్లుల ఖాతాల్లో రూ.228.81 కోట్లు జమ చేయాలని నిర్ణయించారు. గతనెల 28న నాలుగో విడత కార్యక్రమాన్ని ప్రారంభించారు.


* కుప్పం మండలంలోని ఓ విద్యార్థి తల్లి ఖాతాలో అమ్మఒడి పథకం కింద ఇప్పటివరకూ రూ.4వేలు జమయ్యాయి. మిగిలిన  రూ.9వేలు ఎప్పుడు వస్తాయని ఆమె పలుమార్లు వాలంటీర్‌ను అడిగినా సరైన సమాధానం చెప్పడం లేదని వాపోతున్నారు. బ్యాంకుకు వెళ్లినా నిధులు  పడలేదని చెప్పడంతో ఉసూరుమంటూ ఆమె ఇంటి బాట పట్టారు.


* పులిచెర్ల మండలంలో సైతం ఇలాగే మహిళలు రెండు- మూడు రోజులకోసారి ఉదయాన్నే బ్యాంకుకు వెళ్లడం నిరాశగా వెనుదిరగడం జరుగుతోంది. గ్రామాల నుంచి రూ.20- రూ.30 ఛార్జీలు పెట్టుకుని వస్తున్నా  ఎటువంటి ఉపయోగం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


కార్పొరేషన్లలో డబ్బులు లేక..

అమ్మఒడి పథకం డబ్బును ఆయా సామాజికవర్గాల కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారు. కొందరికి రూ.13వేలు పడగా.. మరికొందరికి రూ.4వేలు, రూ.9వేలు మాత్రమే జమయ్యాయి. పలువురికి ఒక్క రూపాయి కూడా జమ కాలేదు. కార్పొరేషన్ల ఖాతాల్లో నిధులు లేకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అందుకనే విడతల వారీగా చెల్లిస్తున్నారని అంటున్నారు. ఇలా రెండు దఫాలుగా కొందరి ఖాతాల్లో రూ.13వేలు జమ అయ్యాయని.. అర్హులందరికీ కార్పొరేషన్ల ద్వారా డబ్బులు అందిస్తారంటున్నారు. గతంలో వారం పది రోజుల్లో తల్లుల ఖాతాల్లో సొమ్ములు పడేవని, ఇప్పుడు 23 రోజులవుతున్నా జమ కాకపోవడంపై విద్యార్థుల తల్లులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


సచివాలయాల్లో ఆరా తీస్తూ..

బ్యాంకు ఖాతాల్లో డబ్బులు పడని వారు సచివాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అక్కడున్న సిబ్బంది చెల్లింపుల స్థితిని తెలుసుకునేందుకు వెబ్‌సైట్‌లోకి వెళ్తున్నా అది ఓపెన్‌ కావడంలేదు. మరికొందరికి ఎటువంటి రిమార్కులు చూపకపోయినా నగదు మాత్రం అందలేదు. దీంతో లబ్ధిదారుల్లో ఆందోళన పెరుగుతోంది. కనీసం డబ్బులు ఎప్పుడు అందిస్తారో చెబితే రోజుల తరబడి బ్యాంకుల వద్ద వేచి చూసే దుస్థితి తప్పుతుందని తల్లులు అంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు