logo

మాటల జ‘గన్‌’.. చేతల చూ‘ఫన్‌’

కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: ‘వైనాట్‌ కుప్పం అంటూ.. 2022 సెప్టెంబరు 23న ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జగన్‌ తన సొంత నియోజకవర్గం పులివెందుల్లా కుప్పాన్ని చూస్తానని హామీ ఇచ్చారు.

Published : 29 Apr 2024 03:25 IST

 కుప్పం ప్రజలపై కపట ప్రేమ
 రూ.66 కోట్ల పనుల్లో పురోగతి నిల్‌

 దుస్థితిలో ఉన్న దళవాయికొత్తపల్లె ఉద్యానవనం

 కుప్పం పట్టణం, న్యూస్‌టుడే: ‘వైనాట్‌ కుప్పం అంటూ.. 2022 సెప్టెంబరు 23న ప్రతిపక్ష నాయకుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జగన్‌ తన సొంత నియోజకవర్గం పులివెందుల్లా కుప్పాన్ని చూస్తానని హామీ ఇచ్చారు. అభివృద్ధి పనుల కోసం రూ.66 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించేశారు. అదే తడవుగా స్థానిక నాయకులు రంగంలోకి దిగి ప్రచార డప్పు మోగించారు.

అనుమతులంటూ పరిహాసం

ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించిన ఏడాది తర్వాత పనులకు పరిపాలన అనుమతులు రావడంతో అదే పదివేలంటూ వైకాపా నాయకులే గుత్తేదారులుగా మారారు. వార్డుల్లో సీసీ రహదారులు, కాల్వల నిర్మాణాలు ప్రారంభించారు. బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే వదిలేశారు. కాల్వలు సిమెంట్‌ ఇటుకలతో కట్టడంతో నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. సామాజిక భవనాల భూసేకరణే జరగలేదు. శ్మశనవాటిక, పార్కుల అభివృద్ధి, సెంట్రల్‌ లైటింగ్‌ పనులే ప్రారంభం కాలేదు. పురపాలిక అభివృద్ధికి కేటాయించిన పనులు విస్మరిస్తూ.. పురపాలిక భవనాన్ని ఆగమేఘాల మీద పూర్తి చేశారు. సెంట్రల్‌ ఏసీగా మార్చేసి.. ఎన్నికల ముందే భవనాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. ఇదీ జగన్‌ కల్లబొల్లి మాటల తీరు.

వాసుదేవారోడ్డులో సిమెంటు ఇటుకలతో నిర్మిస్తున్న మురుగు కాల్వ

కేటాయింపులిలా..

ప్రతిపాదించిన నిధుల్లో ఒక్కో వార్డుకు రూ.2 కోట్ల చొప్పున 25 వార్డులకు సీసీ రహదారులు, మురుగు కాల్వలు నిర్మించాలని ప్రతిపాదించారు. రూ.80 లక్షలతో నాలుగు సామాజిక భవనాలు (గాండ్ల, బలిజ, నాయీబ్రాహ్మణ, బ్రాహ్మణ), కుప్పం శ్మశాన వాటిక (ఎలక్ట్రిక్‌ బర్నింగ్‌ యూనిట్‌, ఆధునికీకరణ)కు రూ.1.60 కోట్లు, పట్టణంలోని రెండు పార్కులకు రూ.3 కోట్లు, ప్రధాన వీధుల్లో రూ.1.8 కోట్లతో సెంట్రల్‌ లైటింగ్‌, రూ.5 కోట్లతో పురపాలక కార్యాలయం నిర్మాణానికి కేటాయించారు. మిగిలిన నిధులతో చిన్న చిన్న పనులు చేస్తామని పేర్కొన్నారు.

పూర్తైన పురపాలిక నూతన భవనం, ప్రతి గదికి ఏసీలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని