logo

దమనకాండ.. జగన్‌ అండదండ

ఏమున్నది గర్వకారణం.. వైకాపా పాలన సమస్తం.. పరపీడన పరాయణత్వం అన్నట్లు సాగింది ఈ ఐదేళ్లు. జిల్లాలో లెక్కలేనన్ని అరాచకాలకు తెగబడ్డారు. ప్రతిపక్షాలు, సామాన్యులపై దమనకాండకు పాల్పడ్డారు. ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులు చేయించారు.

Published : 08 May 2024 06:03 IST

వైకాపా ఐదేళ్ల పాలనలో జిల్లాలో ప్రతిపక్షాలు, జనం విలవిల
ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులు
ఈనాడు, చిత్తూరు-న్యూస్‌టుడే, పుత్తూరు, శాంతిపురం, చిత్తూరు(జిల్లా పంచాయతీ)

ఏమున్నది గర్వకారణం.. వైకాపా పాలన సమస్తం.. పరపీడన పరాయణత్వం అన్నట్లు సాగింది ఈ ఐదేళ్లు. జిల్లాలో లెక్కలేనన్ని అరాచకాలకు తెగబడ్డారు. ప్రతిపక్షాలు, సామాన్యులపై దమనకాండకు పాల్పడ్డారు. ప్రశ్నిస్తే దాడులు, కేసులు, అరెస్టులు చేయించారు. అరాచకానికి అధికారం తోడవడంతో వైకాపాకు అడ్డులేకపోయింది. అధికార పార్టీ మూకల దమనకాండకు జగన్‌ అండదండ పుష్కలంగా ఉన్నాయనేందుకు నిదర్శనమే ఈ చిత్రాలు.


సుగాలిమిట్ట వద్ద శ్రీకాకుళం తెదేపా కార్యకర్తల చొక్కాలు విప్పిస్తున్న చెంగలాపురం సూరి (పాతచిత్రం)

  • గతేడాది అక్టోబరు 2న శ్రీకాకుళం జిల్లా నారువా గ్రామానికి చెందిన తెదేపా కార్యకర్తలు రామకృష్ణ, రామసూరి, ఆదినారాయణ, సుందరావు, రమేష్‌ చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సైకిల్‌ యాత్ర చేపట్టారు. అక్టోబరు 20న పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద అధికార పార్టీ కార్యకర్త చెంగలాపురం సూరి దుర్భాషలాడుతూ సైకిళ్లపై ఉన్న జెండాలు, శరీరంపై ఉన్న పసుపు దుస్తులు బలవంతంగా తొలగించారు.  

శివకుమార్‌ను రోడ్డు పక్కన పడేసిన దృశ్యం (పాతచిత్రం)

  • 2022 జులైలో పెద్దిరెడ్డి కుటుంబీకులు, వైకాపా కార్యకర్తల ఇసుక దోపిడీని ప్రశ్నించిన పులిచెర్ల మండలం చల్లావారిపల్లెకు చెందిన తెదేపా కార్యకర్త శివకుమార్‌ రెండు చేతులు విరగొట్టి రోడ్డు పక్కన పడేశారు.

  • తెదేపాలో క్రియాశీలకంగా ఉన్న  రాజారెడ్డిని 2022 ఏప్రిల్‌లో కిడ్నాప్‌ చేసి రెండు కాళ్లు విరిచేశారు.  

చదువుల తల్లిని బలి తీసుకొని..

పలమనేరు పట్టణంలో పదో తరగతి బాలిక మిస్బా బాగా చదువుతోందని.. తన కుమార్తెకు మంచి ర్యాంకు రావడంలేదని ప్రిన్సిపల్‌కు చెప్పి వైకాపా నాయకుడు ఆమెకు టీసీ ఇప్పించారు. అవమానంగా భావించిన మైనారిటీ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆమె తల్లిదండ్రులను ఆ తర్వాత వేధించారు.


పుంగనూరులో పెద్దిరెడ్డి రాజ్యాంగం  

గతేడాది ఆగస్టు 4న పుంగనూరు  మీదుగా రోడ్‌ షోకు అనుమతి ఇవ్వాలని తెదేపా నాయకులు కోరినా పోలీసులు స్పందించలేదు. ఆ సమయంలో భీమగానిపల్లె కూడలి వద్ద విపక్ష కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జికి దిగారు. దీన్ని సాకుగా చేపి ఏడు కేసులు నమోదు చేసి దాదాపు 600 మందిని నిందితులుగా పేర్కొని 300 మందిని అరెస్టు చేశారు. అప్పట్లో జరిగిన అల్లర్లలో సుమారు 10 మంది కార్యకర్తలు గాయపడ్డారు. పులిచెర్ల మండలానికి చెందిన ముల్లంగి వెంకటరమణ అనే నాయకుడి నోట్లో గుడ్డలు కుక్కి చిత్రహింసలు పెట్టారు.


కుప్పంలో చంద్రబాబునే అడ్డుకుని అరాచకం  

  • 2022 ఆగస్టులో తెదేపా అధినేత చంద్రబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను వైకాపా నేతలు ధ్వంసం చేశారు. నిర్వాహకుడు రవిచంద్రబాబును కొట్టారు.
  • గతేడాది జనవరిలో జీవో- 1ను అడ్డం పెట్టుకుని చంద్రబాబును సరిహద్దులోనే నిలిపేశారు. శాంతిపురం మండలం ఎస్‌.గొల్లపల్లి వద్ద తెదేపా కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జి చేశారు. మహిళలతోపాటు మరో 10 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనలపై మాజీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు మరికొందరిని దాదాపు నెల రోజులు జైలులో ఉంచారు.
  • బైరెడ్డిపల్లెలో ఇంటి స్థలంపై ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసేన మండల కార్యదర్శి మధు, ఆయన కుటుంబీకులపై అధికార పార్టీ నాయకులు దాడికి పాల్పడ్డారు.
  • ఏప్రిల్‌ 29న రామచంద్ర యాదవ్‌ మంత్రి సొంత ఊరు యర్రాతివారిపల్లెలో ప్రచారానికి వెళితే రాళ్లు, కర్రలతో దాడికి దిగారు. ప్రచార రథాలు, వాహనాలు ధ్వంసం చేశారు. సదుం స్టేషన్‌ ఎదుటే ప్రచార రథానికి వైకాపా కార్యకర్తలు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో దాదాపు 15 మందికి గాయాలయ్యాయి.
  • తెదేపా అధినేత చంద్రబాబు పర్యటనకు ర్యాలీగా వెళ్లిన బోయకొండ గంగమ్మ గుడి మాజీ ఛైర్మన్‌ ఎస్‌కే రమణారెడ్డి ఇంటి స్థలం ప్రహరీ, షెడ్లను రాత్రికి రాత్రే కూల్చేశారు. ఆ తర్వాత జైలుకు పంపారు.

రామచంద్రయాదవ్‌ ఇంటిపై కర్రలు, రాళ్లు, రాడ్లతో దాడి చేస్తున్న వైకాపా కార్యకర్తలు (పాతచిత్రం)

పుత్తూరులో ప్లెక్సీలు వివాదంతో షణ్ముగరెడ్డిపై దాడికి తెగబడుతున్న వైకాపా నాయకులు(దాచినచిత్రం)

పుంగనూరు మండలం భీమగానిపల్లె కూడలి వద్ద తెదేపా కార్యకర్తలపై పోలీసుల లాఠీఛార్జి (పాతచిత్రం)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు