logo

డబుల్‌ ఇంజిన్‌లా దూసుకెళ్తాం

‘కూటమి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో కళకళలాడుతోంది.. జగన్‌ మేనిఫెస్టో ఎత్తిపోయింది.. ఆ పార్టీకి డిపాజిట్లు రావు.. కేంద్రంలో మోదీ గ్యారెంటీ ఉంది.. ఇక్కడ ప్రజాగళం మేనిఫెస్టో, సూపర్‌-6లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.

Updated : 08 May 2024 07:15 IST

తిరుపతి పవిత్రను కాపాడుతాం
తెదేపా, జనసేన అధినేతలు నారా చంద్రబాబు, పవన్‌కల్యాణ్ ఉద్ఘాటన

ఈనాడు-తిరుపతి, ఈనాడు డిజిటల్‌, తిరుపతి: ‘కూటమి విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టో కళకళలాడుతోంది.. జగన్‌ మేనిఫెస్టో ఎత్తిపోయింది.. ఆ పార్టీకి డిపాజిట్లు రావు.. కేంద్రంలో మోదీ గ్యారెంటీ ఉంది.. ఇక్కడ ప్రజాగళం మేనిఫెస్టో, సూపర్‌-6లకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అక్కడ కేంద్రంలో మోదీ అధికారంలోకి రావడం ఖాయం. ఇక్కడ కూటమి కూడా అధికారంలోకి వస్తే డబుల్‌ ఇంజిన్‌ సర్కారు ఏర్పాటుతో ప్రజలకు న్యాయం జరుగుతుంది’ అని తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మంగళవారం తిరుపతిలో నిర్వహించిన ప్రజాగళం, వారాహి విజయభేరిలో ఆయన ప్రసంగించారు. ‘13న జరిగే కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ వధ తప్పదు. తిరుపతి నేను పుట్టిన స్థానం. పవన్‌కల్యాణ్‌కు తిరుపతి ఒక సెంటిమెంటు. అందరం కలిసి తిరుమల, తిరుపతిని పవిత్ర కేంద్రంగా నిలుపుతా’మని చంద్రబాబు స్పష్టం చేశారు.

  • రాష్ట్రంలోనూ దేశంలోనూ తిరుపతికి ఎంతో గుర్తింపు ఉంది.. దీని పవిత్రను కాపాడే బాధ్యత తమదని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. పవన్‌కల్యాణ్‌కు నెల్లూరు ఎలా తెలుసో తనకు తిరుపతిలోని గల్లీగల్లీ పరిచయమన్నారు. నాడు క్లెమోర్‌మైన్లు పేల్చినా స్వామి పునర్జన్మ ఇచ్చారని పేర్కొన్నారు. దాన్ని సార్థకం చేసుకుంటూ తిరుమలను కాపాడుకుంటూ వచ్చినట్లు వెల్లడించారు. ప్రజాగళం, వారాహి విజయభేరి బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ‘తిరుపతి ఫ్లైఓవర్‌కు శంకుస్థాపన చేసి ప్రారంభించింది మేమే. చంద్రగిరి బైపాస్‌ రోడ్డును నిర్మించాం. తెలుగుగంగ నీళ్లు తీసుకువచ్చాం. ఐఐటీ, ఐసర్‌ వంటి విద్యాసంస్థలను ఏర్పాటు చేశాం. తిరుపతిని చదువుల కేంద్రంగా తయారు చేసేందుకు ప్రముఖ సంస్థలన్నింటినీ తీసుకువచ్చాం’ అని చంద్రబాబు తెలిపారు.

ఆ డబ్బులు హుండీలో వేయండి

పవన్‌ మాట్లాడుతూ వైకాపా నాయకులు ఇచ్చే డబ్బులు తీసుకోండి.. అయితే ఆ డబ్బులు తిరిగి మీరంతా హుండీలో వేయండి.. అది స్వామివారి సొత్తు.. వడ్డీకాసులవాడి డబ్బులు.. వాటితో ఓట్లు కొనుక్కోవాలని చూస్తున్న భూమన కుటుంబాన్ని చిత్తుగా ఓడించండి అంటూ ఆవేశంగా పిలుపునిచ్చారు. రౌడీలు మనకొద్దు వారి కొమ్ములు విరిచేద్దాం.. తిరుపతి నుంచి తరిమేద్దాం అంటూ ఆవేశంగా మాట్లాడారు. తితిదే ఉద్యోగులకు ఇచ్చిన ఇంటి పట్టాలపై వేెంకటేశ్వర స్వామివారి ఫొటో బదులు జగన్‌మోహన్‌రెడ్డి ఫొటోలు వేయడమా? అంటూ దుయ్యబట్టారు.  ఎన్నికల్లో కూటమి గెలిచి అధికారంలోకి వస్తుందన్నారు. హలో తిరుపతి.. బైబై జగన్‌’ అంటూ పెద్దఎత్తున నినదించారు.

ఉమ్మడి కూటమి తిరుపతి శాసనసభ, లోక్‌సభ అభ్యర్థులు ఆరణి శ్రీనివాసులు, వరప్రసాద రావు

భారీ ర్యాలీ..

తెదేపా అధినేత నారా చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌లు మంగళం రోడ్డు నుంచి భారీ ర్యాలీగా సభాస్థలికి చేరుకున్నారు. గంటన్నరసేపు ర్యాలీ నిర్వహించారు. అధినేతలకు అడుగడుగునా ప్రజలు, అభిమానులు నీరాజనాలు పలికారు.


ప్రజలు ఆలోచించి ఓటెయ్యండి: పవన్‌ కల్యాణ్‌

‘నెలకు రూ.20లక్షలకు కోడిబొచ్చు అమ్ముకొనే కరుణాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు కావాలా? మోదీ, చంద్రబాబుల మద్దతుతో ప్రజల కోసం పోరాడే ఆరణి శ్రీనివాసులు కావాలా? ప్రజలు ఆలోచించుకోవాలి’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. తెదేపా అధినేత చంద్రబాబునాయుడుతో కలిసి రోడ్డుషో నిర్వహించారు. అనంతరం నాలుగుకాళ్ల మండపం వద్ద బహిరంగ సభలో మాట్లాడారు. తిరుపతిలో తండ్రీకొడుకులిద్దరు 10:30 నిష్పత్తిలో వాటాలు పంచుకుంటున్నారు. వారి ఆటలిక సాగవు. చంద్రబాబు చెప్పినట్లు రౌడీయిజంపై ఉక్కుపాదం మోపుతామని తెలిపారు. పెద్దిరెడ్డి, చెవిరెడ్డిలతో కలిసి కరుణాకర్‌రెడ్డి టీడీఆర్‌ బాండ్లలో రూ.200కోట్లు స్వాహా చేశారన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ‘తిరుమల లడ్డూ నాణ్యత తగ్గించారు. పరిమాణం తగ్గించారు. వైవీ సుబ్బారెడ్డి, కరుణాకర్‌రెడ్డిలు తిరుమల ఆధ్యాత్మిక కేంద్రమని గుర్తుంచుకోవాలి. దాన్ని రిసార్ట్‌లాగా చేశారు. తిరిగి ఆధ్యాత్మిక శోభ తెస్తాం’ అని పవన్‌కల్యాణ్‌ హామీ ఇచ్చారు.

సూపర్‌ సిక్స్‌ పథకాలతో మహిళలు

జనసైనికుల విజయోత్సాహం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు