logo

రైలులో సైకో వీరంగం

మసీదుసెంటర్‌: రైలులో ఓ సైకో వీరంగం సృష్టించాడు. బీరుసీసాతో భార్యాభర్తలపై దాడి చేశాడు. ఆర్పీఎఫ్‌ సిబ్బంది, ప్రయాణికులు అతికష్టం మీద అతడిని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

Published : 23 May 2024 04:53 IST

బీరుసీసాతో భార్యాభర్తలపై దాడి
గంజాయి, మద్యం మత్తులో హల్‌చల్‌

నిందితుడ్ని పట్టుకుంటున్న ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు

సాంబమూర్తినగర్‌ (కాకినాడ), మసీదుసెంటర్‌: రైలులో ఓ సైకో వీరంగం సృష్టించాడు. బీరుసీసాతో భార్యాభర్తలపై దాడి చేశాడు. ఆర్పీఎఫ్‌ సిబ్బంది, ప్రయాణికులు అతికష్టం మీద అతడిని పట్టుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాధితులు, రైలు ప్రయాణికుల వివరాల ప్రకారం.. ముంబయి వెళ్లే ఎల్‌టీటీ రైలు కాకినాడ పోర్టు స్టేషన్‌ నుంచి టౌన్‌ రైల్వేస్టేషన్‌కు బుధవారం ఉదయం 9.05 గంటలకు చేరుకుంది. 9.10 గంటలకు కదులుతున్న సమయంలో రైలు చివరి జనరల్‌ బోగీలో ఓ ఆగంతకుడు వీరంగం సృష్టించాడు. తనతో పాటు తెచ్చుకున్న బీరు బాటిల్‌ పగులగొట్టి ఎదురుగా ఉన్న తాడేపల్లిగూడెం వికాస్‌ కాలనీకి చెందిన ఎం.భవానీ పొట్టపై పొడవడంతో అక్కడే ఉన్న భర్త రవికుమార్‌ అడ్డుకున్నారు. అతనిపైనా దాడికి పాల్పడటంతో చేతికి తీవ్ర గాయమై రక్తస్రావమైంది. 

జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న భార్యాభర్తలు.. 

బోగీలో హాహాకారాలు..

ప్రయాణికుల కేకలు, అరుపులు విని టీటీ రైలు నిలుపుదల చేయించారు. ఆర్పీఎఫ్‌ సీఐ కొండయ్య, జీఆర్‌పీ ఎస్‌ఐ రవికుమార్‌ సిబ్బందితో ఆ బోగీలోకి చేరుకున్నారు. ఆర్పీఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుళ్లు చిట్టిబాబు, జి.సత్యనారాయణ, పాయింట్స్‌ మెన్‌ అతడిని పట్టుకున్నారు. చేతిలోని సీసా లాక్కొని రైలు నుంచి కిందకు దించగా వారిని ప్రతిఘటిస్తూ జేబులో ఉన్న మరో గాజుముక్కతో వారిపై దాడికి దిగాడు. దీంతో ప్రయాణికులు మూకుమ్మడిగా నిందితుడిపై దాడిచేశారు. మద్యం తాగి ఉన్నాడని కొందరు, గంజాయి మత్తులో ఉన్నాడని మరి కొందరు ప్రయాణికులు తెలిపారు. అప్పటికే అక్కడికి చేరుకున్న కాకినాడ వన్‌టౌన్, టూటౌన్‌ సీఐలు సైకోను స్టేషన్‌కు తరలించారు. 

అసోంలో భార్యతో గొడవపడి..

నిందితుడు అసోంకు చెందిన సత్య బర్మాన్‌గా గుర్తించారు. ఆధార్‌ ద్వారా వివరాలు సేకరించారు. భార్యాభర్తల మధ్య గొడవ కారణంగా స్వస్థలం నుంచి  భీమవరం వచ్చి కొంతకాలం ఉన్నట్లు సమాచారం. గతంలో అతడికి నేరచరిత్ర ఉన్నట్లు సమాచారం. మతి స్థితిమితం సరిగా లేదని, సైకోగా ప్రవర్తిస్తుంటాడని పోలీసులు పేర్కొన్నారు. కొద్దికాలం క్రితం నిందితుడు సత్య బర్మాన్‌ను పట్టుకుని ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లి విచారించినట్లు తెలసింది. 

బాధితులకు జీజీహెచ్‌లో చికిత్స

నిందితుడి చేతిలో గాయపడిన భార్యాభర్తలు భవానీ, రవికుమార్‌ కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. భవానీకి పొట్ట భాగంలో గాయాలయ్యాయి. రవికుమార్‌ చేతికి గాయమైంది. ఇద్దరికి చికిత్స అందిస్తున్నట్లు జీజీహెచ్‌ వైద్యులు తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని