logo

ఉచిత విద్య.. అంతా మిథ్య

రాజమహేంద్రవరానికి చెందిన కె.శ్రీనివాసరావు చిరుద్యోగి. ఇటీవల ఓ ప్రైవేటు పాఠశాలలో 25 శాతం రాయితీ సీట్ల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆయన కుమార్తెకు సీటు వచ్చింది. ఆనందంతో వెళ్లి అన్ని ధ్రువపత్రాలు సమర్పించాడు.

Published : 23 May 2024 05:21 IST

ప్రకటనలకే పరిమితమవుతున్న 25 శాతం రాయితీ
న్యూస్‌టుడే, శ్యామలాసెంటర్‌

రాజమహేంద్రవరానికి చెందిన కె.శ్రీనివాసరావు చిరుద్యోగి. ఇటీవల ఓ ప్రైవేటు పాఠశాలలో 25 శాతం రాయితీ సీట్ల భర్తీ ప్రక్రియలో భాగంగా ఆయన కుమార్తెకు సీటు వచ్చింది.  ఆనందంతో వెళ్లి అన్ని ధ్రువపత్రాలు సమర్పించాడు.  ఇక ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుందని సంబరపడ్డాడు. మరుసటి రోజు సదరు స్కూల్‌నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. మీ ఇంటిని ఒకసారి పరిశీలించాలని, కుటుంబీకుల ఉద్యోగ వివరాలు కావాలని చెప్పడంతో ఉలిక్కిపడ్డాడు. అన్నట్లుగానే వివరాలు తీసుకున్నారు. మా స్కూల్లో ఉచితంగా సీట్లు పొందిన వారినందరినీ కలిపి వేరే సెక్షన్‌లో వేస్తామని, వీరికి రెగ్యులర్‌ విద్యార్థుల మాదిరిగా సౌకర్యాలు ఉండవని చెప్పడంతో అతని ఆనందం ఆవిరైంది.

ఈ పరిస్థితి ఒక్క శ్రీనివాసరావుదే కాదు. జిల్లాలోని చాలామంది తల్లిదండ్రులకు ప్రైవేటు  విద్యాసంస్థల నుంచి ఎదురవుతున్న చేదు అనుభవాలివి.


విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఒకటో తరగతిలో 25 శాతం సీట్ల భర్తీ ప్రక్రియలో భాగంగా జిల్లాలో ఈ ఏడాది మార్చి 31 నాటికి 2,622 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 2,209 మంది వివిధ పాఠశాలలను ఎంపిక చేసుకున్నారు. తొలిదశలో 1,541 మంది విద్యార్థులు ఎంపికవ్వగా కేవలం 993 మంది మాత్రమే పిల్లలను చేర్పించారు. వాస్తవానికి  వీరందరూ ఈ నెల 10న ఆధార్, ఆదాయ, కుల ధ్రువపత్రాలు, పుట్టినతేదీ వివరాలు సమర్పించి ప్రవేశాలు  పొందాలని డీఎస్‌ఈఓ కె.వాసుదేవరావు సూచించారు. ఎంపికైన విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రైవేటు పాఠశాలల నుంచి రకరకాల ఒత్తిళ్లు, చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. ఓ పాఠశాల యాజమాన్యం మీ ఇంటి ఫొటో తీసుకోవాలి అంటే.. మరొకరు మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అక్కడికి వచ్చి చూస్తామంటున్నారు. మరికొందరైతే రెగ్యులర్‌ విద్యార్థుల మాదిరిగా పాఠాలు చెప్పమని, సౌకర్యాలు సైతం కల్పించమని తెగేసి చెబుతుండటం గమనార్హం.  మరికొన్ని కార్పొరేట్‌ స్కూళ్లయితే ప్రభుత్వం చెల్లించేంది కేవలం ట్యూషన్‌ ఫీజుకు మాత్రమే సరిపోతుందని, అదనంగా మరికొంత చెల్లించాలని  ఒత్తిడి చేస్తున్నాయి. దీంతో విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రభుత్వం కల్పించిన రాయితీని వినియోగించుకోవాలో.. లేక ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు చెప్పిన డబ్బులు కట్టి చదివించుకోవాలో దిక్కుతోచక పేద తల్లిదండ్రులు అయోమయ పరిస్థితిలో కొట్టుమిట్లాడుతున్నారు. 


అధికారుల ఆదేశాలు బేఖాతరు

పది రోజుల క్రితం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో రాజమహేంద్రవరంలో పాఠశాలల తనిఖీ అధికారి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. విద్యాహక్కు చట్ట ప్రకారం సీట్లు పొందిన వారికి ప్రవేశాలు ఇవ్వాలని సూచించారు. అయినప్పటికీ మార్పులేదు. ఈ సమావేశానికి పాఠశాల తరఫున తూతూమంత్రంగా ఎవరొ ఒకరిని పంపుతున్నారే తప్ప యాజమాన్యాలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. నిబంధనలు పాటించని వారిపై విద్యాశాఖ చర్యలు తీసుకున్న సందర్భాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని పలువురు బాహాటంగానే చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు తనిఖీలు చేపట్టి కొరడా ఝుళిపించాలని కోరుతున్నారు.


నేరుగా ఫిర్యాదు చేయండి..
-ఎస్‌.సుభాషిణి, అడిషనల్‌ ప్రాజెక్టు కోఆర్డినేటర్, సమగ్రశిక్ష  

ప్రభుత్వం ఎంపిక చేసిన తర్వాత ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మళ్లీ విద్యార్థుల ఇంటిని తనిఖీలు చేయడం వంటివి తగదు. అటువంటి సంఘటనలు ఎదురైతే నేరుగా వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. కఠిన చర్యలు తీసుకుంటాం. వేర్వేరు కారణాలతో ఎంపిక కాని విద్యార్థులకు రెండో దశలో మళ్లీ ప్రభుత్వం ప్రవేశాలు కల్పిస్తుంది. ఈ పథకాన్ని ప్రతిఒక్కరు సద్వినియోగం చేసుకోండి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు