logo

దస్త్రాల్లో దందా.. అదే వారి పంథా

కాకినాడ జిల్లా పరిశ్రమల శాఖలో చేయి తడిపితేనే దస్త్రం కదులుతుంది. లేదంటే కొర్రీలే.. కొవిడ్‌ తర్వాత సూక్ష్మ- చిన్న- మధ్య తరహా పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయాయి. ప్రభుత్వ ప్రోత్సాహం అందక అనేకం మూతపడ్డాయి.

Published : 24 May 2024 02:42 IST

పరిశ్రమల శాఖలో లంచావతారాలు
అనిశాకు జీఎం చిక్కడంతో తాజాగా చర్చ
ఈనాడు, కాకినాడ- న్యూస్‌టుడే, సర్పవరం జంక్షన్‌

 

అంతా మాటల్లోనే..

‘రాష్ట్రంలో పారదర్శక పారిశ్రామిక విధానాలను అనుసరిస్తున్నాం. పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చేవారికి ప్రభుత్వం సహకారం అందిస్తుంది.. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలో ఉన్న అవకాశాలను పారిశ్రామికవేత్తలకు వివరించండి.. పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నించండి.’

- విశాఖలో గ్లోబల్‌ సమ్మిట్‌ ఏర్పాట్లలో భాగంగా 2023 ఫిబ్రవరి 27న నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్‌


చేతల్లో ఇదీ సం‘గతి’

ఔత్సాహికులు ముందుకొస్తున్నా జిల్లా పరిశ్రమల శాఖ అధికారుల కొర్రీలతో అడుగులు ముందుకు పడలేదు. అనర్హులను అర్హులుగా చేర్చి రాయితీలు అందించే క్రమంలో రూ.కోట్లు వెనకేసుకోవడం.. అర్హులకు కొర్రీలు వేస్తూ లంచాలు గుంజుకోవడం సాధారణమైంది.

- పారిశ్రామిక రాయితీ దస్త్రంలో తప్పుగా పడిన తేదీని మార్చడానికి రూ.2 లక్షలు లంచం తీసుకుంటూ కాకినాడ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ మురళి బుధవారం అనిశాకు చిక్కారు. పరిశ్రమల శాఖ పనితీరుకు ఇది ఉదాహరణ.


రూ.5 లక్షలు ఇమ్మన్నారు

‘‘2021లో పరిశ్రమ మంజూరైంది. రాయితీ కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్నా.. దస్త్రంలో తేదీ తప్పుపడడంతో అది సరిచేస్తేనే రాయితీ వస్తుందన్నారు. రోజూ కార్యాలయానికి రమ్మని.. గంటల తరబడి కూర్చోబెట్టేవారు. 15 నెలలుగా తిరుగుతున్నా పనికాలేదు. రూ.5 లక్షలు ఇస్తేనే పని అవుతుందని కాకినాడ జిల్లా పరిశ్రమల అధికారి అన్నారు. రూ.2 లక్షలు ఇస్తే.. ఇది చాలదు మరో రూ.లక్షన్నర తెమ్మన్నారు. విసిగిపోయి అనిశాకు ఫిర్యాదు చేశాను.’’ 

- బాధిత పారిశ్రామికవేత్త ఆవేదన ఇది..  

కాకినాడ జిల్లా పరిశ్రమల శాఖలో చేయి తడిపితేనే దస్త్రం కదులుతుంది. లేదంటే కొర్రీలే.. కొవిడ్‌ తర్వాత సూక్ష్మ- చిన్న- మధ్య తరహా పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందుల్లోకి కూరుకుపోయాయి. ప్రభుత్వ ప్రోత్సాహం అందక అనేకం మూతపడ్డాయి. పారిశ్రామికవేత్తలకు రాయితీల మంజూరులోనూ తీవ్ర జాప్యమే.. దీనికీ లంచం ఇవ్వాల్సిందే. కడుపు మండి కొందరు వ్యవహారాన్ని బహిర్గతం చేస్తుంటే.. ఇంకొందరు భవిష్యత్తులో ఇబ్బంది పెడతారన్న భయంతో మిన్నకుండిపోతున్నారు.

మ్మడి జిల్లాలో 2020లో రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రాయితీ రూ.40.75 కోట్లు ..2021లో రూ.32.10 కోట్లు విడుదల చేశారు. 2022లో తూర్పుగోదావరి జిల్లాకు రూ.13.89 కోట్లు, కాకినాడ రూ.11.23 కోట్లు, కోనసీమకు రూ.12.67 కోట్లు మంజూరుచేశారు. 2023లో తూర్పునకు రూ.20.26 కోట్లు.. కాకినాడకు రూ.11.93 కోట్లు.. కోనసీమ జిల్లాలో రూ.11.66 కోట్లు మంజూరుచేసినట్లు వెల్లడించారు. అర్హులకు విడుదలలో వెనుకబాటే. ఒక్క కాకినాడ జిల్లాలోనే 2021-22లో చెల్లించాల్సిన రాయితీలు రూ.10 కోట్లు, 2022-23లో రూ.15 కోట్లు, 2023-24లో రూ.14.22 కోట్ల బకాయిలు ఉన్నాయి. కోనసీమలో 2022-23లో రాయితీ బకాయిలు 24.97 కోట్లు, 2023-24కు రూ.9.45 కోట్లు విడుదల కావాలి. దశల వారీగా వచ్చే నిధులకూ కిందిస్థాయిలో కొందరు అడ్డుతగులుతూ అందినకాడికి గుంజేస్తున్నారు.


ఎన్నెన్ని కొర్రీలో..

ర్పవరం సమీప ఏపీఐఐసీ ఆటోనగర్‌ పారిశ్రామిక ప్రాతంలో శ్రీముఖ ఐస్‌ పరిశ్రమ ఉంది. దీని యజమాని బీసీ కావడంతో 35 శాతం రాయితీ అందాలి. ఈ పరిశ్రమ 2021 జూన్‌ 21న మంజూరైతే.. దస్త్రాల్లో మే 21గా నమోదయ్యింది. ఈ తప్పిదాన్ని జిల్లా కమిటీ సమావేశం దృష్టిలో పెట్టి సరిచేసే వీలున్నా.. రాష్ట్రస్థాయిలో అనుమతి రావాల్సి ఉందని తాత్సారం చేస్తూ లంచం డిమాండ్‌ చేశారు. ఇదేమాదిరి పలువురు బాధితులు రాయితీ సొమ్ము, ఇతర పనుల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.


తెల్లవార్లూ విచారణ..

రూ.2 లక్షలు లంచం తీసుకుని పట్టుబడిన కాకినాడ జిల్లా పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ టి.మురళిని అనిశా అధికారులు బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు విచారించారు. ఆయన నివాసంలోనూ సోదాలు చేశారు. మరికొందరు అధికారులను సైతం అందుబాటులో ఉండాలని సూచించి వారి సమక్షంలోనే లోతుగా ఆరా తీశారు. బాధితుడి నుంచీ వివరాలు సేకరించారు. ఇంకా ఇటువంటి బాధితులు పలువురు ఉన్నట్లు అనిశా దృష్టికి వచ్చింది. రాజమహేంద్రవరంలోని అనిశా న్యాయస్థానానికి జీఎం మురళిని తరలించగా జూన్‌ 5 వరకు రిమాండ్‌ విధించింది.


ఇచ్చిందే కొంచెం.. దానికీ లంచం

హజ సంపదకు, ప్రకృతి సిద్ధ వనరులకు పెట్టింది పేరు ఉమ్మడి తూర్పుగోదావరి. 161 కి.మీ సుదీర్ఘ సాగర తీరం.. 5,344.15 కి.మీ పొడవున రహదారులు..23 స్టేషన్లను కలుపుతూ రైలు మార్గం.. మధురపూడి విమానాశ్రయం.. ఇన్ని సౌకర్యాలున్నా పారిశ్రామికంగా ప్రగతి లేదు. మొత్తంగా సూక్ష్మ- చిన్న- మధ్యతరహా పరిశ్రమలు 8,796 ఉంటే.. భారీ, మెగా పరిశ్రమలు 65 ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని