logo

వక్క.. లాభాలు పక్కా

ఉద్యోగం వదులుకుని వ్యవసాయం చేపట్టిన ఆ యువకుడు ఇప్పుడు వక్క(పోక) సాగుతో లాభాలు గడిస్తున్నారు. అంబాజీపేటకు చెందిన 36 ఏళ్ల దొమ్మేటి అశోక్‌కుమార్‌  ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. దానికి రాజీనామా చేసి తండ్రి  చేస్తున్న వ్యవసాయంపై దృష్టి సారించారు.

Published : 10 Aug 2022 06:13 IST

న్యూస్‌టుడే, అంబాజీపేట: ఉద్యోగం వదులుకుని వ్యవసాయం చేపట్టిన ఆ యువకుడు ఇప్పుడు వక్క(పోక) సాగుతో లాభాలు గడిస్తున్నారు. అంబాజీపేటకు చెందిన 36 ఏళ్ల దొమ్మేటి అశోక్‌కుమార్‌  ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడిగా పని చేసేవారు. దానికి రాజీనామా చేసి తండ్రి  చేస్తున్న వ్యవసాయంపై దృష్టి సారించారు. సొంతంగా ఉన్న ఎకరం పొలంతో పాటు మరో 22 ఎకరాలను కౌలుకు తీసుకున్నారు. కొబ్బరిలో అంతర పంటగా వక్క సాగు చేపట్టారు. ఎకరానికి ఏడాదికి రూ.1.50 లక్షల చొప్పున 23 ఎకరాలకు ఏటా సుమారు రూ.34.50 లక్షల ఆదాయం వస్తోంది.

45 ఏళ్ల వరకు దిగుబడి..
మొక్కలు నాటిన తరువాత నాలుగేళ్లకు కాపునకు వస్తాయి. అనంతరం 45 ఏళ్ల వరకు ఏటా దిగుబడి వస్తుంది.  ఎకరా కొబ్బరితోటలో 400 నుంచి 600 వరకు వక్క మొక్కలను నాటుతారు.

మొక్కలను పరిశీలిస్తున్న  అశోక్‌కుమార్‌

నర్సరీ ఏర్పాటు
23 ఎకరాల కొబ్బరితోటలోని రెండు ఎకరాల్లో వక్క నర్సరీ ఏర్పాటు చేశారు. విత్తనం పశ్చిమ్‌ బంగా నుంచి తీసుకువచ్చారు. మొహిత్‌నగర్‌ రకం విత్తనం కోసం ప్రత్యేకంగా బెడ్లు ఏర్పాటు చేసి నాటారు. 45 రోజుల తర్వాత ఆ రకం విత్తనం నుంచి మొక్కలు వస్తాయి. 6 నెలల తర్వాత పాలిథిన్‌ సంచుల్లో మట్టి, కొబ్బరిపొట్టు, వర్మీకంపోస్టు వేసి మొక్కలను ఆ సంచుల్లో ఉంచి మరో 6 నెలలకు నాటేందుకు సిద్ధం చేస్తారు. మంగళ, సుమంగళ, మొహిత్‌నగర్‌, శ్రీమంగళ, స్వర్ణమంగళ వంటి హైబ్రీడు రకాలు ప్రాచుర్యం పొందాయి. ఇవి ఈ ప్రాంతానికి అనుకూలం. దేశవాళీ రకాలకు వస్తే రుద్రాషి, మోతి, కోనలోకల్‌ రకాలను రైతులు పెంచుతున్నారు.

కర్షకుల కోసం ఇలా..
రైతులు వక్క పంట సాగు చేసి లాభాలు తీయాలి.  ఇందులో నా వంతు ప్రయత్నం చేస్తున్నా. బహిరంగ మార్కెట్‌లో నాణ్యమైన వక్కమొక్క ఒక్కోటి రూ.60 వరకు ధర పలుకుతోంది. నేను మాత్రం రూ.30కే రైతులకు విక్రయిస్తున్నా. -దొమ్మేటి అశోక్‌కుమార్‌, అంబాజీపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని