logo

పాతేస్తున్నా.. పట్టదుగా

రాజమహేంద్రవరం గ్రామీణంలో విలువైన ప్రభుత్వ భూములపై అక్రమార్కులు కన్నేశారు. ఖాళీగా కనిపిస్తే చాలు ఆక్రమించేస్తున్నారు. ఆపై అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.

Published : 04 Dec 2022 02:57 IST

న్యూస్‌టుడే, ధవళేశ్వరం

ఎర్రకొండ ఆక్రమిత ప్రాంతంలో నిర్మాణాలు

రాజమహేంద్రవరం గ్రామీణంలో విలువైన ప్రభుత్వ భూములపై అక్రమార్కులు కన్నేశారు. ఖాళీగా కనిపిస్తే చాలు ఆక్రమించేస్తున్నారు. ఆపై అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. కొందరు నాయకుల అండతోనే ఇవి కొనసాగిపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు హెచ్చరికలు చేస్తున్నా ఆక్రమణదారులు బెదరడం లేదు.

మచ్చుకు కొన్ని..

* ధవళేశ్వరం ఎర్రకొండ ప్రాంతంలో సర్వే నంబరు 47/ఏలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వాసుపత్రి, సచివాలయం పక్కన ఖాళీ స్థలం సుమారు 70 సెంట్లను ఆక్రమించి కొందరు నిర్మాణాలు చేపట్టారు. గతంలో పని చేసిన పంచాయతీ కార్యదర్శులు ఆయా నిర్మాణాలకు అనుమతులు సైతం ఇచ్చేశారు. ఇప్పుడు గ్రామ రెవెన్యూ అధికారి, పంచాయతీ కార్యదర్శి నిర్మాణాన్ని అడ్డుకుని హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.  అయినా ఆ నిర్మాణాన్ని తొలగించకుండా వదిలేయడం గమనార్హం. ఈ ప్రాంతంలో గజం రూ.7వేలు వరకు ఉంటుంది.

* ఎర్రకొండ మసీదు పక్కన 600 గజాల స్థలాన్ని కొందరు నాయకులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టగా రెవెన్యూ అధికారులు వాటిని తొలగించారు.

* ధవళేశ్వరం మెయిన్‌ రోడ్డులో సర్వే నంబరు 40/2 చినకొండ ప్రాంతంలో సుమారు 10 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించి వాటర్‌ సర్వీసింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేశారు. అప్పటి తహసీల్దారు వారికి నోటీసులు జారీ చేసి దస్త్రాలు తీసుకురమ్మని ఆదేశించారు. ఆ భూమి పంచాయతీ పరిధిలోనిది కావడంతో సంబంధిత అధికారులకు తెలియజేసినా వారు పట్టించుకో లేదు. ఇక్కడ గజం ధర రూ.15వేలకు పైగా పలుకుతోంది.

* ధవళేశ్వరం పంచాయతీ వెనుక సాంఘిక సంక్షేమశాఖ భూమి సర్వే నం. 131/1బిలో 17 ఎకరాలు పేదలకు ఇవ్వగా మిగిలిన ఖాళీ ప్లాట్లకు నకిలీ పట్టాలు సృష్టించి ఆక్రమించారు. రెవెన్యూ అధికారులను సంప్రదించకుండానే ఆక్రమిత స్థలాల్లో పంచాయతీ అధికారులు ఇంటి పన్నులు వేశారు.

* ఇండస్ట్రియల్‌ కాలనీ సర్వే నంబరు 320లో జలవనరుశాఖ స్థలం అయిదెకరాల భూమిని రామచంద్రాపురం, మండపేటకు చెందిన రాజకీయ నాయకుల అండదండలతో ఆక్రమించి రిజిష్ట్రేషన్లు సైతం చేసుకోవడం గమనార్హం.

ప్రభుత్వ భూమిలో యథేచ్ఛగా ఆక్రమణలు


కేసులు నమోదు చేస్తాం..

ప్రభుత్వ స్థలాలను గుర్తించి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తాం. చట్ట ప్రకారం ఆక్రమణదారులపై చర్యలు తీసుకుంటాం.

-పి.చిన్నారావు. తహసీల్దారు, రాజమహేంద్రవరం గ్రామీణం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని