logo

పండగ ఉత్సాహం ఆవిరి.. హైదరాబాద్‌కు టికెట్‌ ధర ఏకంగా రూ.5,123!

తెలుగింటి పెద్ద పండగ సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చినవారు తిరుగు ప్రయాణమవుతున్నారు. ఆర్టీసీ బస్సులు తగినన్ని అందుబాటులో లేకపోవడం, ప్రైవేట్‌ ఆపరేటర్లు భారీగా ధరలు పెంచి వసూలు చేస్తుండటంతో హైదరాబాద్‌ వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారికి ఖర్చు తడిసిమోపెడవుతోంది.

Updated : 18 Jan 2024 10:18 IST

చాలని ఆర్టీసీ బస్సులు.. ప్రైవేట్‌ ఆపరేటర్ల ఇష్టారాజ్యం

ఈనాడు, రాజమహేంద్రవరం; న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం: తెలుగింటి పెద్ద పండగ సంక్రాంతికి స్వస్థలాలకు వచ్చినవారు తిరుగు ప్రయాణమవుతున్నారు. ఆర్టీసీ బస్సులు తగినన్ని అందుబాటులో లేకపోవడం, ప్రైవేట్‌ ఆపరేటర్లు భారీగా ధరలు పెంచి వసూలు చేస్తుండటంతో హైదరాబాద్‌ వంటి దూర ప్రాంతాలకు వెళ్లేవారికి ఖర్చు తడిసిమోపెడవుతోంది. నాలుగు రోజులు సరదాగా గడిపిన ఉత్సాహమంతా ఇట్టే ఆవిరవుతోంది. జిల్లా కేంద్రాలు రాజమహేంద్రవరం, అమలాపురం, కాకినాడ నుంచి హైదరాబాద్‌ వెళ్లేవారు అధికంగా ఉండటంతో పెద్ద ఎత్తున టిక్కెట్‌ధరలు పెంచేశారు. నాన్‌ ఏసీ బస్సుల్లో సైతం దాదాపు ఏసీ బస్సుల ఛార్జీలు తీసుకుంటున్నారు. స్లీపర్‌, సిట్టింగ్‌కు వ్యత్యాసం లేదన్నట్లుగా ధరలు ఉన్నాయి.


ఆర్టీసీ తీరిది..

  • రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌కు ఈనెల 17న 22 ఆర్టీసీ బస్సులు నడపగా వీటిలో 7 ప్రత్యేక సర్వీసులు. 18వ తేదీ వరకు టిక్కెట్లన్నీ అయిపోయాయి. ఇవికాక విశాఖపట్నంకు అదనంగా పది బస్సులు నడిపారు.
  • అమలాపురం నుంచి హైదరాబాద్‌కు 23 సర్వీసులు నడుపుతున్నారు. వీటిలో 12 ప్రత్యేక బస్సులు. 18వ తేదీ వరకు సీట్లు నిండుకున్నాయి.
  • కాకినాడ నుంచి 15 తిప్పుతుండగా 18వ తేదీన కేవలం 40 సీట్లు మాత్రం ఖాళీ చూపిస్తున్నారు.


ప్రైవేటులో ఇలా..

రాజమహేంద్రవరం నుంచి హైదరాబాద్‌ తదితర దూర ప్రాంతాలకు వెళ్లేందుకు సగటున 30 ప్రైవేట్‌ బస్సులు ఉంటే.. సంక్రాంతి సమయంలో రోజుకు 60 నుంచి 70 వెళ్తున్నాయి. వీటిలో అనుమతులు ఎన్నింటికి ఉన్నాయో చెప్పనవసరం లేదు. తిరుగు ప్రయాణాల నేపథ్యంలో ఆదివారం వరకు ధరలు హెచ్చుగా ఉంటాయని ఆపరేటర్లు చెబుతున్నారు. ఒకవైపు నిండుగా వెళ్లి, మరోవైపు ఖాళీగా రావాల్సి ఉండటంతో డబుల్‌ ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.


రైలెక్కే పరిస్థితి ఉందా..

హైదరాబాద్‌, తిరుపతి, బెంగళూరు, చెన్నై వెళ్లే ప్రయాణికులతో రైళ్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ముందుగా రిజర్వేషన్‌ చేయించుకున్న ప్రయాణికులు కూడా రైళ్లలో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జన్మభూమి, రత్నాచల్‌లోని రిజర్వేషన్‌ బోగీల్లోకి జనరల్‌ ప్రయాణికులు ప్రవేశిస్తున్నా పట్టించుకునేవారు లేరంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ దృష్ట్యా బుధవారం రెండు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6.05 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరే ప్రత్యేక రైలు(07254) గురువారం ఉదయం 5.30 గంటలకు కాకినాడ చేరుకోనుంది. మరొకటి బుధవారం రాత్రి 7 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి గురువారం ఉదయం 7.10 గంటలకు కాకినాడ వస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. సికింద్రాబాద్‌ వెళ్లే ప్రత్యేక రైలు గురువారం రాత్రి 9 గంటలకు కాకినాడలో బయలుదేరి శుక్రవారం ఉదయం 8.50 గంటలకు చేరుకోనుంది.

బాబోయ్‌ నిరీక్షణ జాబితా: 18న రాజమహేంద్రవరం నుంచి సికింద్రాబాద్‌ వెళ్లే ఏ రైలు చూసినా కిక్కిరిసి ఉన్నాయి. టిక్కెట్‌ ప్రియంగా ఉండే వందేభారత్‌ ఛైర్‌కార్‌కు సైతం ఈనెల 22 వరకు వెయిటింగ్‌ లిస్ట్‌ కొనసాగుతోంది. గౌతమీ ఎక్స్‌ప్రెస్‌కైతే 18న స్లీపర్‌ క్లాస్‌ 244, 19న 145, 20న 232 మందితో నిరీక్షణ జాబితా ఉంది. గోదావరికైతే వచ్చే అయిదురోజులు 300 మార్కు దాటేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని