logo

నల్లమిల్లికి టికెట్‌ కేటాయించలేదని నిరసన

అనపర్తి నియోజకవర్గానికి బుధవారం రాత్రి భాజపా అభ్యర్థి పేరు ప్రకటించిన వెంటనే తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు.

Published : 28 Mar 2024 02:57 IST

నిప్పు అంటించుకోవడానికి ప్రయత్నించిన వారిని సముదాయిస్తున్న నల్లమిల్లి

బిక్కవోలు, అనపర్తి గ్రామీణం, న్యూస్‌టుడే: అనపర్తి నియోజకవర్గానికి బుధవారం రాత్రి భాజపా అభ్యర్థి పేరు ప్రకటించిన వెంటనే తెదేపా నాయకులు, కార్యకర్తలు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. తమ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి కాకుండా.. భాజపాకు కేటాయించటం, అభ్యర్థి పేరు వెలువడటంతో కార్యకర్తలు నిరసన తెలిపారు. ఈ క్రమంలో అనపర్తికి చెందిన లంకా సూరిబాబు, చినబుజ్జి పెట్రోలు తీసుకువచ్చి మీదపోసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశారు. దీంతో వెంటనే అక్కడకు చేరిన కార్యకర్తలు వారిని నిలువరించారు. మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దంటూ వారికి నచ్చచెప్పారు.

వైకాపాను సమర్థంగా ఎదుర్కొన్నా...

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనపర్తి నియోజకవర్గం తెదేపా కార్యకర్తల మనోభిప్రాయాలు దెబ్బతిన్నాయన్నది నిజమని చెప్పారు. అయిదేళ్లుగా వైకాపా దాష్ట్టీకాల్ని అంతా బలంగా ఎదుర్కొన్నామన్నారు. వైకాపా నా కుటుంబాన్ని ఎన్నో ఇబ్బందులు పెట్టిందని, తనపై 39 కేసులు నమోదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హత్యాయత్నం చేస్తామని బెదిరించినా మీ సాయంతో బయట ధైర్యంగా తిరిగానని తెలిపారు. కార్యకర్తల మీద 180 కేసులు పెడితే నాకు తోచినంతమేర కాపాడుకున్నానని నల్లమిల్లి అన్నారు. ఏం చేద్దామనేది ఆలోచిద్దాం.. ఆవేశంతో ఆత్మహత్యలకు ప్రయత్నించవద్దని శ్రేణులకు సూచించారు. అందరినీ కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గురువారం అందరం సమావేశమవుదామని, ప్రతి కార్యకర్త కాలర్‌ ఎగరేసుకునేలా కార్యాచరణ ప్రకటిస్తానని నల్లమిల్లి వారికి స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని