logo

అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి

అనపర్తి నియోజకవర్గంలో తెదేపా ఉనికి లేకుండా చేయాలనే దురుద్దేశంతో వైకాపా కుట్రకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు.

Published : 29 Mar 2024 05:14 IST

భాజపాకు కేటాయించడంతో కార్యకర్తల ఆత్మహత్యాయత్నం

దూకుడు చర్యలు వద్దని కార్యకర్తలను అభ్యర్థిస్తున్న మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి

ఈనాడు, రాజమహేంద్రవరం, న్యూస్‌టుడే, అనపర్తి గ్రామీణం: అనపర్తి నియోజకవర్గంలో తెదేపా ఉనికి లేకుండా చేయాలనే దురుద్దేశంతో వైకాపా కుట్రకు తెరలేపిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇందుకోసం రూ.18 కోట్ల నుంచి రూ.20 కోట్లు చేతులు మారినట్లు సమాచారం ఉందన్నారు. అనపర్తి స్థానాన్ని భాజపాకు కేటాయించడంతో రామవరంలోని తన నివాసంలో గురువారం కార్యకర్తలతో సమావేశమయ్యారు. నియోజకవర్గంలో వైకాపా అరాచకాలను ఎదుర్కొంటూ పార్టీని విజయం దిశగా తీసుకెళుతున్నామని, ప్రస్తుతం తీసుకున్న నిర్ణయంపై అధినేత చంద్రబాబు, లోకేశ్‌ పునరాలోచన చేయాలని కోరారు. ఈ స్థానం నుంచి తెదేపా అభ్యర్థి బరిలో లేకపోతే ఆ ప్రభావం పార్లమెంట్‌ స్థానంపైనా ఉంటుందన్నారు. తనవద్ద ధనబలం లేకపోవడమే నేడు ఈ పరిస్థితికి కారణమని భావిస్తున్నట్లు కన్నీటి పర్యంతమయ్యారు.

42 ఏళ్లపాటు పార్టీ కోసం పడిన కష్టాన్ని, తనకు జరిగిన అన్యాయం గురించి అయిదు రోజుల పాటు కుటుంబ సభ్యులతో కలిసి గ్రామాల్లో పర్యటించి ప్రజలకు వివరిస్తామన్నారు. శుక్రవారం మధ్యాహ్నం మహేంద్రవాడ నుంచి పర్యటనకు శ్రీకారం చుడతామన్నారు. ప్రజలు, కార్యకర్తల అభిప్రాయం మేరకు భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని స్పష్టం చేశారు. సుఫారీ ఇచ్చి తనను హత్య చేసేందుకు వైకాపా నాయకులు కుట్ర చేశారన్నారు. తాను, తన కుటుంబం తీవ్రమైన ప్రమాదంలో ఉన్నామని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఆగ్రహంతో తెదేపా కరపత్రాలు దహనం చేశారు. నలుగురు కార్యకర్తలు శరీరంపై పెట్రోలు వేసుకోగా అక్కడ ఉన్న శ్రేణులు అడ్డుకున్నారు. మరొకరు భవనంపై నుంచి దూకేందుకు సిద్ధపడ్డారు. ఎవరూ ఆవేశానికి గురవ్వొద్దని రామకృష్ణారెడ్డి వారించారు.

చంద్రబాబు ఫోన్‌... సమస్య పరిష్కారానికి చంద్రబాబు నల్లమిల్లికి ఫోన్‌ చేశారు. దాదాపు 25 నిమిషాల పాటు జరిగిన సంభాషణలో తనకు జరిగిన అన్యాయం గురించి రామకృష్ణారెడ్డి వివరించారు. చంద్రబాబు స్పందిస్తూ ఆవేశంతో తొందరపాటు నిర్ణయాలు వద్దని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని