logo

తొలిరోజు ఏడు నామినేషన్ల దాఖలు

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు.

Published : 19 Apr 2024 05:07 IST

భారీ ర్యాలీగా నామినేషన్‌ వేయడానికి బయలుదేరిన వాసు

రాజమహేంద్రవరం కలెక్టరేట్‌, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ, దేవీచౌక్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభంకాగా తొలిరోజు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏడు నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. రాజమహేంద్రవరం అర్బన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఇద్దరు, కొవ్వూరు నుంచి ఇద్దరు, నిడదవోలు నుంచి ఒకరు ఒక్కొక్క సెట్టు చొప్పున నామపత్రాలను రిటర్నింగ్‌ అధికారులకు సమర్పించగా గోపాలపురం నుంచి ఒక అభ్యర్థి రెండుసెట్లు అందించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్‌, రాజమహేంద్రవరం గ్రామీణం, రాజానగరం, అనపర్తి అసెంబ్లీ నియోజవర్గాల నుంచి తొలిరోజు నామపత్రాలు దాఖలు కాలేనట్లు  అధికారులు తెలిపారు.

ఘనంగా ఆదిరెడ్డి నామపత్రాల దాఖలు

కూటమి రాజమహేంద్రవరం అర్బన్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆదిరెడ్డి శ్రీనివాస్‌ గురువారం నామినేషన్‌ దాఖలు చేశారు. ముందుగా తిలక్‌రోడ్డులోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, నివాసంలో సర్వమత ప్రార్థనలు జరిగాయి. అక్కడి నుంచి భారీ ర్యాలీగా నగరపాలక సంస్థ కార్యాలయానికి చేరుకొన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ మేయర్‌ ఆదిరెడ్డి వీర్రాఘవమ్మ, నాయకులు గన్ని కృష్ణ, ఆర్యాపురం బ్యాంకు మాజీ ఛైర్మన్‌ చల్లా శంకరరావుతో కలిసి నామినేషన్‌ వేశారు. అనంతరం బయటకు వచ్చి అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని, ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు.

నేడు పురందేశ్వరి: కూటమి ఎంపీ అభ్యర్థి, భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి శుక్రవారం నామినేషన్‌ దాఖలు చేయనున్నారని ఆ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్‌ వెల్లడించారు. గురువారం పార్లమెంట్‌ ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మధ్యాహ్నం 1.10 గంటలకు జేఎన్‌ రోడ్డులోని నివాసం నుంచి ర్యాలీగా బయలుదేరి 2.20 గంటలకు కలెక్టర్‌ కార్యాలయంలో నామినేషన్‌ వేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమానికి జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, ఏపీ ఎన్నికల సహబాధ్యుడు సిద్ధార్థ్‌నాథ్‌సింగ్‌, సినీ నటి, భాజపా నాయకురాలు ఖుష్బు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని