logo

ఇసుకను ఎంతైనా మింగేసారు.. ఇసుమంతైనా సమస్య కనరు

ఒకపక్క మురుగు.. మరోవైపు ప్రాణాంతక ప్లాస్టిక్‌.. ఇంకోవైపు పారిశ్రామిక మలినాలు.. వీటికి తోడు తీరం వెంబడి ఉండే పల్లెల వ్యర్థాలు.. వెరసి గోదారమ్మ గొంతు గరళంతో నిండుతోంది.

Published : 08 May 2024 06:18 IST

కాలువ ద్వారా గోదావరిలో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థాలు

ఒకపక్క మురుగు.. మరోవైపు ప్రాణాంతక ప్లాస్టిక్‌.. ఇంకోవైపు పారిశ్రామిక మలినాలు.. వీటికి తోడు తీరం వెంబడి ఉండే పల్లెల వ్యర్థాలు.. వెరసి గోదారమ్మ గొంతు గరళంతో నిండుతోంది. నదీమతల్లి ఘోషపెడుతోంది. అయిదేళ్లు అధికారంలో ఉన్న వైకాపా ప్రభుత్వం ఈ సమస్యపై దృష్టిపెట్టింది లేదు. కేంద్రం నిధులు విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం తనవాట ఇవ్వడానికి ఏళ్లు పట్టింది. ఇచ్చిన తర్వాతా పనులు పట్టాలెక్కని దుస్థితి. ఇక్కడే పుట్టి పెరిగామని.. గొప్పగా అభివృద్ధి చేశామని చెప్పుకొంటున్న అధికార పార్టీ నేతలు నదీ కాలుష్య నియంత్రణకు కనీస చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు.

న్యూస్‌టుడే, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ

రసాయనాల విషం

నగరంలో పేపరు మిల్లు వ్యర్థాలు నేరుగా గోదావరిలో కలిపేస్తున్నారు. మిల్లులో వినియోగించిన రసాయనాలు నీటితో కలిపి కాలువ ద్వారా కోటిలింగాల రేవు దాటుకుని క్రైస్తవ శ్మశాన వాటిక పక్కన గోదావరిలో యథేచ్ఛగా నదిలోకి వదిలేస్తున్నారు. పక్కనే కూత వేటు దూరంలో తాగునీటి సేకరణ పంపింగ్‌ వ్యవస్థ ఉంది. ఏ రోజుకారోజు సేకరించిన నీటిని కేవలం మలినాలు లేకుండా శుద్ధి చేసి, క్లోరిన్‌ కలిపి పైపులు ద్వారా రాజమహేంద్రవరం వాసులకు అందించేస్తున్నారు. వాస్తవానికి మిల్లులో రసాయనాలు కలిసిన నీటిని పూర్తి స్థాయిలో శుభ్రం చేయాల్సి ఉన్నా అవేవీ పట్టించుకోవడం లేదు.

కేంద్రం స్పందించినా..

రాజమహేంద్రవరంలో శుద్ధిచేసిన మురుగు నీటిని గోదావరిలో కలిపేవిధంగా తలపెట్టిన నమామి గోదావరి ప్రాజెక్టు ఎక్కడవేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉంది. గంగానది తరహాలో కాలుష్యం నుంచి బయటపడేలా దీనికి రూపకల్పన చేశారు. భాజపా రూ.600 కోట్లకు ఆమోదం తెలిపింది. దీంట్లో మొదటి విడత రూ.100 కోట్లు విడుదలకు ఆమోద ముద్ర వేసింది. దీంట్లో 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. రెండేళ్ల పాటు తాత్సారం చేసిన రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది చివర్లో నిధులకు ఉత్తర్వులు విడుదల చేయడంతో ప్రాజెక్టుకు మున్సిపల్‌ మంత్రి శంకుస్థాపన చేశారు. పనులు ప్రారంభ దశలోనే ఉన్నాయి.

ప్రాజెక్టు ప్రతిపాదనలు పూర్తికాక..

నమామి గోదావరి ప్రాజెక్టు ద్వారా ఆవ ఛానల్‌లో 50 ఎంఎల్‌డీ ఎస్‌టీపీ ప్లాంటు నిర్మాణం చేస్తారు. ఇప్పటికే 30 ఎంఎల్‌డీ ప్లాంటు ఉండగా అది పాడైపోవడంతో దాన్ని బాగుచేయాల్సి ఉంది. ఈ రెండు వాడుకలోకి వస్తే శుద్ధిచేసిన మురుగు మాత్రమే నదిలో చేరుతోంది. తద్వారా నదీ కాలుష్యం అరికట్టవచ్చు. ఆ ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం, అధికార నేతలు చేయడం లేదు.

వ్యర్థాలన్నీ నదిలోకే..

రాజమహేంద్రవరం నగరంలో 98 వేల గృహాలున్నాయి. సుమారు ఐదున్నర లక్షల మంది జనాభా నివసిస్తున్నారు. రోజుకు 60 ఎంఎల్‌డీ మురుగు బయటకు వస్తోంది. ఆ నీరంతా నేరుగా నదిలో కలిపేస్తున్నారు. నల్లాఛానల్‌, ఆవ ఛానల్‌ మీదుగా కాలువల నుంచి మురుగు నదిలో చేరిపోతోంది. దీంతో నదిలో కాలుష్యం పెరిగిపోతోంది.

ప్లాస్టిక్‌ భూతం

రాజమహేంద్రవరంలో గత పుష్కరాలకు చంద్రబాబు హయాంలో ప్లాస్టిక్‌ నిషేధం ప్రకటించారు. తర్వాత వైకాపా పాలకులు పట్టించుకోకపోవడంతో ప్లాస్టిక్‌ వినియోగం, విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. వ్యర్థాలు కాలువల ద్వారా నేరుగా నదిలో కలుస్తున్నాయి. ప్లాస్టిక్‌ నీటిలో చేరడంతో బ్యాక్టీరియా పెరుగుతోంది. తిరిగి అదే నీటిని నగరవాసులకు తాగేందుకు వినియోగిస్తున్నారు. బ్యాక్టీరియా కారణంగా ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నామనే ఆందోళన వ్యక్తమవుతోంది. ప్లాస్టిక్‌ నిషేధం అమలు చేయాల్సిన నగరపాలక సంస్థ కళ్లుమూసుకుంటోంది.  

ఐదేళ్లలో ఏం చేసినట్టు..

ధాన్యాగార జిల్లాలుగా పేరొందిన ఉభయ గోదావరి జిల్లాల్లº గోదావరి ప్రక్షాళనకు నాయకులు ముందుకు రాకపోవడం గమనార్హం. కనీసం నదీ తీర ప్రాంతాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు కలవకుండా నిలువరించలేకపోయారు. మురుగు నదిలో కలవకుండా తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాల్సి ఉండగా ఆ వైపు కూడా ఆలోచనలు చేయలేదు. గతంలో గోదావరి పరివాహక ప్రాంతాలను ఆనుకొని పైపు లైన్‌ ద్వారా నీటిని ధవళేశ్వరం తర్వాత కలిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి ఉమ్మడి కార్యాచరణ ప్రకటించినప్పటికీ ఆచరణ సాధ్యం కాలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు