logo

రైతును నాశనం చేశారయ్యో!

డాలర్ల పంటను దయనీయ స్థితికి తెచ్చారు. మేత ధరలను నియంత్రించరు.. రొయ్య ధరలు పతనమైనా పట్టించుకోరు.. విద్యుత్తు రాయితీలోనూ కోతకోస్తారు.. ఇదీ వైకాపా సర్కారు పాలనలో ఆక్వా రైతు అవస్థ.

Published : 08 May 2024 06:35 IST

ఆక్వా రంగాన్ని అతలాకుతలం చేసిన వైకాపా  సర్కారు

ఎగుమతికి సిద్ధంగా రొయ్యలు

డాలర్ల పంటను దయనీయ స్థితికి తెచ్చారు. మేత ధరలను నియంత్రించరు.. రొయ్య ధరలు పతనమైనా పట్టించుకోరు.. విద్యుత్తు రాయితీలోనూ కోతకోస్తారు.. ఇదీ వైకాపా సర్కారు పాలనలో ఆక్వా రైతు అవస్థ. పెట్టుబడుల భారం.. ప్రభుత్వం నుంచి ఆసరా లేక కుదేలవుతున్న రైతులు  సాగును వదిలేస్తే.. ఈ రంగంపై ఆధారపడిన కుటుంబాలు రోడ్డున పడతాయి.

ఆక్వా సాగుకు యూనిట్‌ విద్యుత్తు ధర రూ.1.50కే అందిస్తాం... ఇది గత ఎన్నికలకు ముందు పాదయాత్రలో ప్రతిపక్షనాయకుడిగా జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ. ఈ అయిదేళ్లలో ఆక్వా రైతులకు ఎన్నో మెలికలు పెట్టి చివరకు కొన్నింటికి రాయితీ ఎత్తివేశారు.

ఆక్వా.. దేశానికి విదేశీ మారకద్రవ్యం తీసుకువచ్చే పంట. ఈ ఉత్పత్తుల్లో రాష్ట్రంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాది ప్రథమ స్థానం. రాష్ట్ర వృద్ధి రేటులో కీలక భూమిక పోషించే ఈ రంగం.. వైకాపా అధికారంలోకి వచ్చాక తిరోగమనం బాటపట్టింది. జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం చిన్నచూపు కారణంగా సంక్షోభంలో పడింది. సాగులో ఒడిదొడుకులకు రైతులు కుదేలవుతున్నారు. డాలర్ల పంటపై మోజుతో ఉప్పునీటి కయ్యలుగా మారిన వరి చేలను పూర్వస్థితికి తీసుకురావాలన్నా ఏళ్లు పడుతుంది.

ఈ పాపం పాలకులది కాదా..?

ఉమ్మడి జిల్లాలో 72 వేల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఏటా రూ.4,500 కోట్ల విలువైన 1.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ఆక్వా ఉత్పత్తుల దిగుబడి వస్తోంది. గతంలో ఆక్వా రైతులకు సమస్యలు ఏర్పడి ఈ రంగంపై ప్రతికూల ప్రభావం పడితే.. గత ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరించి.. పరిష్కారంపై దృష్టిసారించేవి. అవేమీ పట్టని ప్రస్తుత పాలకులు రైతులు ఎలా పోతే మాకేంటి అన్నట్లుగా.. వ్యవహరిస్తున్నారు.

న్యూస్‌టుడే, ముమ్మిడివరం అయిదేళ్లలో మేత ధరలు రెట్టింపు

గతంలో ఎకరాకు రూ.1.20 లక్షల వరకు మేతకు ఖర్చయితే.. ప్రస్తుతం రూ.2.50 లక్షలకు పెరిగింది.  దాణా తయారీలో ఉపయోగించే ఆల్గే ఆయిల్‌పై సుంకం పెరగడం వంటి కారణాలతో మేత తయారీకి భారీగా ఖర్చవుతోంది. రొయ్యలు, చేపల దాణా దిగుమతి సుంకాలు పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మేత ధరలు పెరిగిపోతున్నాయి.

అయిదేళ్ల క్రితం 25

కిలోల రొయ్యల మేత బస్తా.. రూ.1,250 నుంచి 1,450 మధ్య లభిస్తే.. ప్రస్తుతం బస్తా.. రూ.2,800కు చేరింది. బిల్లులో ట్రూఅప్‌ ఛార్జీల మాయ విద్యుత్తు రాయితీని యూనిట్‌కు రూ.1.50కే ఇస్తున్నామని చెబుతున్నా.. ట్రూఅప్‌ ఛార్జీల భారంతో రూ.4కు చేరుతోంది. చెరువులు సాగు చేయకుండా విరామం పాటించినా.. ట్రూఅప్‌ ఛార్జీలు రూ.6 నుంచి 9 వేలు వరకు చెల్లించాల్సిన దుస్థితి. విద్యుత్తు కనెక్షన్‌కు రాయితీ లేక గతంలో రూ.1.5 లక్షల ఖర్చు.. నేడు అది రూ.4 లక్షలు దాటింది.

ధరరాక దిగాలు

వెనామీ రొయ్యల ధరల్లో హెచ్చుతగ్గులు రైతులను ముంచుతున్నాయి. పంట చేతికొచ్చే సమయానికి వ్యాపారులు సిండికేట్‌గా మారి ధరలను తగ్గించేయడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రాసెసింగ్‌ సంస్థలు పది రోజులు కూడా ధరలను స్థిరంగా ఉంచని పరిస్థితి. చర్యలు చేపట్టాల్సిన ప్రభుత్వం దిక్కులు చూస్తోంది.

పూర్వ స్వరూపానికి తేగలమా..?

  • గతంలో టైగర్‌ రొయ్యల సాగు ఓ ఊపు ఊపింది. భారీ లాభాలతో రైతులు పచ్చని పొలాలను రొయ్యల చెరువులుగా మార్చి సాగు చేశారు. తర్వాత టైగర్‌ రొయ్యల సాగులో కోలుకోలేని దెబ్బతగలడంతో పూర్తిగా సాగు పక్కనపెట్టారు. ఆ చెరువులను పూర్వ స్థితికి తీసుకురాలేక బీడు భూములుగా వదిలేశారు.
  • తర్వాత వెనామీ రకం రొయ్యల సాగు లాభాలివ్వడంతో మళ్లీ రైతులు ఈ రంగంలోకి వచ్చారు. ప్రస్తుతం ఎదురవుతున్న ఇబ్బందులను తట్టుకోలేక సాగు వదిలేస్తే.. ఆయా చెరువులు వరి చేలుగా మార్చి పూర్వ స్వరూపానికి తేవాలంటే ఎన్నేళ్లు పడుతుందో అంతుచిక్కని ప్రశ్న.

అరువు దొరక్క అవస్థ

ఈ రంగంలో నష్టాల దృష్ట్యా  దుకాణదారులు అరువు ఇవ్వడం ఆపేశారు. దీంతో రైతులు   వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరగడం, ఇళ్లలోని బంగారం కుదువపెట్టుకుని పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితికి వచ్చింది.

విద్యుత్తు రాయితీకి మెలికలు

గత ప్రభుత్వ హయాంలో సాగు జరిగే ప్రాంతాలను జోన్‌లుగా చేసి యూనిట్‌ రూ.6 ఉన్న విద్యుత్తు ధరను 2014లో రూ.3.85 చేసి ఊతమిచ్చారు. తర్వాత యూనిట్‌ విద్యుత్తు రూ.2కే అందించి  మరింత ప్రోత్సహించారు. ప్రస్తుతం ప్రభుత్వంలో 5 ఎకరాల్లోపు సాగు చేస్తున్న రైతులకే విద్యుత్తు రాయితీ వర్తిస్తుందని ప్రకటించి.. వ్యతిరేకతను గుర్తించి దాన్ని 10 ఎకరాల వరకు సడలించారు. దీనికి సవాలక్ష నిబంధనలు. 10 హార్స్‌ పవర్‌ వినియోగించే రైతులకే రాయితీ వర్తిస్తుందని.. లీజు ఒప్పందం, లైసెన్సు, విద్యుత్తు మీటరు పత్రాలు, భూమి ఆన్‌లైన్‌ వంటి నిబంధనల్లో ఏ ఒక్కటి లేకపోయినా రాయితీ అందించడం లేదు.

ఉమ్మడి జిల్లాలో ఆక్వా చెరువులకు 8,100 వరకు విద్యుత్తు కనెక్షన్లు ఉంటే ప్రభుత్వ మెలికలతో 4,300 కనెక్షన్లకు మాత్రమే రాయితీ వర్తిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు