logo

‘స్వతంత్ర’ కుతంత్రం..!

సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ పక్క ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తుంటే.. మరోపక్క స్వతంత్ర అభ్యర్థులు ఓట్లు చీల్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

Updated : 08 May 2024 07:30 IST

ఓటమి భయంతో కూటమి ఓట్లు చీల్చేందుకు అధికార పార్టీ పన్నాగం!

న్యూస్‌టుడే, అమలాపురం గ్రామీణం: సార్వత్రిక ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ పక్క ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తుంటే.. మరోపక్క స్వతంత్ర అభ్యర్థులు ఓట్లు చీల్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ప్రధానంగా అమలాపురం నియోజకవర్గంలోని స్వతంత్ర అభ్యర్థులకు వైకాపా నేతలు వెన్నుదన్నుగా నిలుస్తున్నారనే వాదన వినిపిస్తోంది. నామినేషన్లకు ముందే కొందరు స్వతంత్ర అభ్యర్థుల ఇళ్లకు వైకాపా నేతలు క్యూకట్టారు. నామినేషన్లనూ దగ్గరుండి మరీ దాఖలు చేయించారు.

య్యా.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచా. గుర్తు కూడా కేటాయించారు. ప్రచారం ఖర్చుకు నా దగ్గర డబ్బుల్లేవండీ. వాహనాల ఏర్పాటుకు రోజువారీగా ఖర్చవుతుంది. మీరే ఎంతో కొంత ఇస్తే కూటమి ఓట్లు చీల్చేందుకు ప్రయత్నిస్తా. మా గురించి ఓ సారి ఆలోచించండి.

చక్రం తిప్పుతున్న ‘కీ’లక నేత..

సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి బలం పెరుగుతుండటంతో ఓట్లు చీల్చేందుకు నియోజకవర్గానికి చెందిన కీలక ప్రజాప్రతినిధి చక్రం తిప్పుతున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కాకముందే ఈ కీలక ప్రజాప్రతినిధి ప్రస్తుతం బరిలో నిలిచిన ఓ స్వతంత్ర అభ్యర్థితో రహస్యంగా మాట్లాడారు. అప్పట్లోనే ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. మరికొందరు స్వతంత్ర అభ్యర్థులకు ఈ కీలక ప్రజాప్రతి‘నిధే’ ప్రచారానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పలువురు చెబుతున్నారు.

చోటా నాయకులతో బేరసారాలు..

స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసిన కొంతమందితో వైకాపాకు చెందిన చోటామోటా నాయకులు బేరసారాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. రాత్రి వేళల్లో స్వతంత్ర అభ్యర్థులను కలిసేందుకు కొందరు నాయకులను కీలక ప్రజాప్రతినిధి పంపడమేకాకుండా వారి ద్వారా నగదు అందించే ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. స్వతంత్ర అభ్యర్థుల ద్వారానే ఓట్లను చీల్చే అవకాశం ఉండటంతో వారిపైనే వైకాపా నేతల కళ్లుండటంతో ఆ దిశగానే ప్రయత్నాలు చేపడుతున్నట్లు విపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు.

పక్కా ప్రణాళిక ప్రకారమే కుట్ర..!

నియోజకవర్గంలో కూటమి బలంగా కనిపిస్తోంది. ప్రధాన సామాజిక వర్గాల్లో చాలావరకు వీరి వెంటే ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి ఓట్లు చీల్చేందుకు వైకాపా నేతలు ప్రయత్నాలు తీవ్రతరం చేస్తున్నారు. ఇందులో భాగంగానే స్వతంత్ర అభ్యర్థులకు వైకాపా నేతలు అండదండగా నిలుస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. అందుకు నగదు కూడా సమకూర్చుతున్నట్లు తెలుస్తోంది.

ప్రచారానికి  పెద్దపీట..

ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారానికి ఖర్చు అధికంగా చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. గతంలో స్వతంత్ర అభ్యర్థులు ఒకటో రెండో వాహనాలతో ప్రచారం మమ అనిపించేవారు. ఈ సారి వారి ప్రచారమే జోరుగా ఉంది. వారికి వాహనాల ఏర్పాటు, అభ్యర్థి వెంట వచ్చేవారి ఖర్చంతా భరించేందుకు అధికార పార్టీకి చెందిన వారు భరించనున్నట్లు తెలుస్తోంది. స్వతంత్ర అభ్యర్థులకు మరోలా లబ్ధి చేకూరుతుండడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు