logo

అన్నంపెట్టినా.. కడుపు మంటేనా!

హాట్‌ బాక్సుల్లో వేడివేడి పదార్థాలు ఆకలితో అక్కడికి అడుగుపెట్టేవారికి ఆహ్వానం పలికేవి. రూ.5 నామమాత్రంగా చెల్లించి అన్నదాతా.. సుఖీభవ అని దీవించి వెళ్లేవారు. ఇదీ తెదేపా హయాంలో అన్న క్యాంటీన్ల వద్ద నిత్యం కనిపించే పరిస్థితి.

Published : 10 May 2024 05:36 IST

అన్న క్యాంటీన్లు మూసేసిన జగన్‌ సర్కారు

హాట్‌ బాక్సుల్లో వేడివేడి పదార్థాలు ఆకలితో అక్కడికి అడుగుపెట్టేవారికి ఆహ్వానం పలికేవి. రూ.5 నామమాత్రంగా చెల్లించి అన్నదాతా.. సుఖీభవ అని దీవించి వెళ్లేవారు. ఇదీ తెదేపా హయాంలో అన్న క్యాంటీన్ల వద్ద నిత్యం కనిపించే పరిస్థితి. ఇందులో దినసరి కార్మికులు, చిరు వ్యాపారులు, పోటీపరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులూ అంతా ఉండేవారు. వైకాపా వచ్చిన తర్వాత వీరి నోటి దగ్గర కూడు లాగేసింది.  అన్న క్యాంటీన్లను మూసేసింది. పేరు మార్చైనా పేదలకు పట్టెడన్నం పెట్టమని సూచించినా పట్టించుకున్న పాపాన పోలేదు. బయట భోజనం కొనుగోలు చేయాలంటే వచ్చిన సంపాదనంతా పెట్టాల్సి వస్తోందని ఇప్పటికీ పలువురు పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెదేపా వస్తేనే మళ్లీ కడుపు నిండా కూడు దొరుకుతుందని ఆశగా చూస్తున్నారు.

కొవ్వూరు: బస్టాండు కూడలి వద్ద

న్యూస్‌టుడే, కొవ్వూరు పట్టణం: 2019కు ముందు నిత్యం ఉదయం 50 మంది అల్పాహారం, మధ్యాహ్నం 120 మంది వరకు భోజనాలు, సాయంత్రం 40 మంది భోజనాలు చేసేవారు. వైకాపా వచ్చాకా క్యాంటీన్‌ ఆపేసి భవనాన్ని నిరుపయోగంగా వదిలివేశారు. ఏడాదిన్నరగా ఈ భవనంలో మెప్మా విభాగ కార్యాలయం నడుస్తోంది. మహిళా స్వయం సహాయక సంఘాల సమావేశాలు పెట్టుకుంటున్నారు.


ప్రాంతం : పెద్దాపురం పట్టణం పురపాలక సంఘం సెంటర్‌

న్యూస్‌టుడే, పెద్దాపురం: ఇక్కడ ఉదయం టిఫిన్‌ 150 మంది, మధ్యాహ్నం భోజనం 250 మంది చేసేవారు. పేదలు, రోజువారీ కూలీలు, రిక్షా కార్మికులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పలువురి ఆకలి తీరేది. ప్రస్తుతం భవనం ఖాళీగా వదిలేశారు.


నిడదవోలు: పంగిడి రోడ్డు

న్యూస్‌టుడే, నిడదవోలు: నిత్యం 350 మంది భోజనాలు చేసేవారు. నిడదవోలు పట్టణంలో అన్నా క్యాంటీన్‌ను 2019 జనవరి 7న ఆనాటి సీఎం చంద్రబాబు ప్రారంభించారు. రిక్షా, ఆటో కార్మికులు, గ్రామాల నుంచి వైద్య సేవలు, వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు భోజనాలు చేసేవారు. ప్రస్తుతం ఏళ్లుగా నిరుపయోగంగా ఉంచిన భవనంలో వార్డు సచివాలయాన్ని ఏర్పాటు చేశారు.


ప్రాంతం: పిఠాపురం

న్యూస్‌టుడే, పిఠాపురం: పట్టణ ప్రాంతాలకు వివిధ పనులపై వచ్చేవారంతా ఆకలితో ఉండకూడదని రూ.5కే బాటసారులు, పర్యాటకులు, యాచకులు, ఆటో డ్రైవర్లు, వివిధ వృత్తులు చేసుకునేవారికి ఆహారం అందించారు. ప్రస్తుతం క్యాంటీన్‌ మూతపడి హోటళ్లకు వెళ్లి రూ.100 వరకూ ఆహారానికి ఖర్చు చేయాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. ముఖ్యంగా ఆసుపత్రుల్లో రోగులను చూసేందుకు వచ్చే కుటుంబ సభ్యులు, బందువులకు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఆహారం దొరికేది. భవనం చుట్టూ తుప్పలు మొలిచేశాయి. అద్దాలు చిదిగిపోయి, శిథిలమైంది. కొవిడ్‌ సమయంలో దీన్ని వ్యాక్సినేషన్‌ కేంద్రంగా ఉపయోగించారు.


అన్నం పెట్టకుండా చేశారు

- మాతా వీరబాబు, టైలర్‌, కోరుకొండ

కోరుకొండ:  రోజూ నగరానికి వెళ్లి పనిచేసుకునే కార్మికులకు అన్న క్యాంటీన్‌ భోజనం ఒక వరంగా ఉండేది. నేను రాజమహేంద్రవరంలో టైలర్‌గా పనిచేస్తున్నా. రోజూ కోరుకొండ నుంచి అక్కడికి వెళ్తున్నా. వైకాపా పాలన వచ్చాక క్యాంటీన్లు మూసేశారు. నాలాంటి కార్మికులు ఇతర ప్రాంతాలకు వెళితే బయట ఎక్కువ ధరకు భోజనం చేయాల్సి వస్తోంది. అన్న క్యాంటీన్లు ఉన్న సమయంలో తక్కువ ధరకు భోజనం పెట్టడంతో ఆర్థికంగా ఇబ్బంది ఉండేది కాదు.


అన్న క్యాంటీన్‌ నిర్వహించాలి

- పెనుగుర్తి అంజిబాబు, నిడదవోలు

పట్టణానికి నిత్యం అనేక మంది ఆసుపత్రి, వివిధ పనుల నిమిత్తం ఉదయాన్నే వచ్చేస్తుంటారు. పనుల నిమిత్తం అనేక మంది కార్మికులు కూడా వస్తుంటారు. వారు తెల్లారుజామునే రావడంతో భోజనాలకు ఇబ్బందులు పడుతున్నారు. అదే అన్న క్యాంటీన్‌ ఉంటే రూ.5కే భోజనం దొరికేది. తిరిగి క్యాంటీన్లను తెరిపిస్తే అనేక మంది పేద వర్గాలు, కార్మికులకు ఉపయుక్తంగా ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు