logo

ప్రశ్నిస్తే దాడి.. పోరాడితే కేసు

వైకాపా పాలనలో ఎవరైనా ప్రశ్నిస్తే దాడే.. పోరాడితే కేసే..పేదల నుంచి పెద్దల వరకు ఎదుర్కొన్న అణచివేత ఇది. విధ్వంసం నుంచి మొదలై.. వినాశనం వరకు అయిదేళ్ల పాలన సాగింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని నిలదీస్తే.. సామాన్యుడైనా, ప్రతిపక్ష నేతైనా నిర్బంధం, కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే.

Updated : 10 May 2024 06:03 IST

ప్రజా సమస్యలపై నిగ్గదీసిన ప్రతిపక్షాలపై కక్ష
వైకాపా తప్పులు ఎత్తిచూపిన ప్రతిఒక్కరూ బాధితులే
ఈనాడు, కాకినాడ

వైకాపా పాలనలో ఎవరైనా ప్రశ్నిస్తే దాడే.. పోరాడితే కేసే..పేదల నుంచి పెద్దల వరకు ఎదుర్కొన్న అణచివేత ఇది. విధ్వంసం నుంచి మొదలై.. వినాశనం వరకు అయిదేళ్ల పాలన సాగింది. ప్రజా సమస్యలను గాలికొదిలేసిన ప్రభుత్వాన్ని నిలదీస్తే.. సామాన్యుడైనా, ప్రతిపక్ష నేతైనా నిర్బంధం, కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే. ఉద్దేశపూర్వకంగా కేసులు బనాయించిన తీరు విమర్శలకు తావిచ్చింది. ప్రభుత్వ వైఫల్యాలు ఎత్తిచూపినా.. ప్రజల పక్షాన నిలబడి సమస్యలపై నిగ్గదీసినా.. సామాజిక మాధ్యమాల్లో మాట్లాడినా.. కేసులు బనాయిస్తూ పైశాచిక ఆనందం పొందారు. విపక్ష కార్యకర్త నుంచి ముఖ్య నేతల వరకు అందరూ బాధితులే.

గ్రావెల్‌ తరలింపుపై వివాదం..

మండపేట మండలం కేశవరం కొండలో అక్రమ తవ్వకాలపై వివాదం నెలకొంది. జగనన్న కాలనీల అభివృద్ధి పేరుతో గ్రావెల్‌ అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపిస్తూ ఈ కొండ పరిశీలనకు తెదేపా, జనసేన నేతలు సిద్ధమయ్యారు. దీంతో తెదేపా ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, జనసేన ఇన్‌ఛార్జి లీలాకృష్ణలను పోలీసులు అడ్డుకుని గృహ నిర్బంధం చేశారు. వారు బయటకు వచ్చేందుకు ప్రయత్నించగా అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు.


చంద్రబాబుతో సహా.. వెయ్యి మందిపై కేసులు

తెదేపా అధినేత చంద్రబాబు  అనపర్తి నియోజకవర్గంలో చేపట్టిన ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’.. అనుమతిచ్చిన పోలీసులు.. వైకాపా ఒత్తిళ్లతో ఆంక్షలు తెరమీదకు తెచ్చారు.

నపర్తిలో సభ జరిగే దేవీచౌక్‌ వద్దకు చంద్రబాబు రాకుండా అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసు బలగాలు.. బలభద్రాపురం వద్ద నిలువరించేందుకు విశ్వప్రయత్నాలు చేశాయి. వెనక్కి తగ్గితే ప్రజల్లో, పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపేది ఎవరని బాబు  ఆటంకాలు దాటుకుని అనపర్తి వరకు ఏడు కి.మీ కాలినడక వచ్చి అనుకున్న ప్రదేశంలోనే ప్రసంగించారు.

తెదేపా అధినేత చంద్రబాబు, మాజీ మంత్రులు చినరాజప్ప, కె.ఎస్‌.జవహర్‌, మాజీ ఎమ్మెల్యేలు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కొండబాబు, అయితాబత్తుల ఆనందరావు, తెదేపా నాయకులు జ్యోతుల నవీన్‌తోపాటు వెయ్యి మందికిపైగా తెదేపా కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదుచేశారు. 143, 353 రెడ్‌విత్‌ 149 ఐపీసీ..143, 353, 332 రెడ్‌విత్‌ 149 ఐపీసీ, 3పీడీపీపీఏ.. 188, 506 రెడ్‌విత్‌ 34 ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.


కాలుష్యం వద్దన్నందుకు హత్యాయత్నం కేసులు

కాలుష్యం వెదజల్లే పరిశ్రమ వద్దన్నందుకు తొండంగి మండలం కొత్తపాకలు గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

దివిస్‌ పరిశ్రమ వద్దంటూ స్థానికులు రిలే దీక్ష చేస్తుంటే ఆ టెంట్లు, కుర్చీలు పోలీసులు తొలగించారు. ఆగ్రహానికి గురైన ఆందోళనకారులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రశ్నించిన వారిని అరెస్టు చేసి వ్యానుల్లోకి ఎక్కిస్తుండడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆందోళనకారులు దివిస్‌ ప్రాంగణంలోని దూసుకెళ్లారు. దీంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.

ఈ ఘటనలో 160 మందిపై హత్యాయత్నం కేసు నమోదుచేశారు. మారణాయుధాలతో ప్రాంగణంలోకి చొరబడ్డారని, ఆస్తులకు నిప్పుపెట్టి ధ్వంసం చేశారని, మహిళా సిబ్బందిపై అగౌరవంగా ప్రవర్తించారంటూ పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.


దూషించి.. దాడి చేయించి..

మూడు రాజధానులకు మద్దతుగా కాకినాడలో వైకాపా నేతలు ర్యాలీ చేపట్టారు. ఈ సభలో వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. అసభ్య పదజాలతో దూషించారు.
ద్వారంపూడి వ్యాఖ్యలను నిరసిస్తూ  ఎమ్మెల్యే నివాసం ముట్టడికి జనసైనికులు యత్నించారు. ఉద్రిక్తత చోటుచేసుకుంది. జనసేన ప్రదర్శనపై ఎమ్మెల్యే ద్వారంపూడి వర్గీయులు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. వైకాపా మూకల దాడిలో పదుల సంఖ్యలో జనసైనికులు గాయపడ్డారు.

అగ్రనేతలను దూషించిన వైకాపా ఎమ్మెల్యే జోలికి వెళ్లడానికి సాహసించని పోలీసులు.. జనసైనికులపైన మాత్రం కేసులు పెట్టారు.


తప్పుడు కేసులు నమోదు చేసి

కాకినాడలోని తెదేపా కార్యాలయంలో పార్టీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ మీడియా సమావేశం పెట్టారు. రేషను బియ్యాన్ని దోచుకుని ఆఫ్గానిస్థాన్‌లోని కంపెనీలకు ఎగుమతి చేసుకుంటున్నారని ఎమ్మెల్యే ద్వారంపూడిపై ఆరోపణలు చేశారు.  

ట్టాభి వ్యాఖ్యలపై ఆగ్రహించిన ద్వారంపూడి మద్దతుదారులు తెదేపా కార్యాలయాన్ని ముట్టడించారు. పట్టాభి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకోడానికి వచ్చిన తెదేపా నాయకులు జ్యోతుల నవీన్‌, కొండబాబుతో వాగ్వాదానికి దిగారు.

అప్పట్లో అధికారులకు ముందస్తు సమాచారం ఇచ్చి పోర్టు పరిశీలనకు వెళ్లినా.. అనుమతి లేకుండా ప్రవేశించారని కాకినాడ సీ పోర్టు అధికారి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేశారు. తెదేపా నేతలకు 41ఏ నోటీసులు ఇచ్చారు.


రైతు కోసం పోరాడితే అరెస్టు చేశారు...

తెదేపా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘రైతు కోసం తెలుగుదేశం’ నిర్వహించారు.

రైతులకు అందాల్సిన ఎరువులు, విత్తనాలు నల్ల బజారుకు తరలిపోతున్నాయని.. ధాన్యానికి మద్దతు ధర దక్కడంలేదని.. సకాలంలో ధాన్యం బిల్లుల చెల్లింపు ఊసేలేదని.. కౌలు రైతుల వేదన వైకాపా ప్రభుత్వానికి పట్టడంలేదని ఆందోళనలు, రాస్తారోకోలు చేశారు.

ఆందోళనను అడ్డుకున్న పోలీసులు పలువురు తెదేపా నాయకులను అరెస్టు చేశారు. అయిదు రోజులపాటు చేపట్టిన ఈ ఆందోళనలో పలువురు నేతలను గృహనిర్బంధం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు