logo

ఈ-శ్రమ్‌ రిజిస్ట్రేషన్లు ఐదు లక్షలపైనే

 దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికుల వివరాలు సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు నుంచి ఈ-శ్రమ్‌ పేరిట ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు సంభవించినప్పుడు కార్మికులకు ఆర్థిక సాయం

Published : 28 May 2022 04:47 IST

వీరవాసరంలో వివరాలు నమోదు చేయించుకుంటున్న కార్మికులు (పాత చిత్రం)

వీరవాసరం, న్యూస్‌టుడే: దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికుల వివరాలు సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం గతేడాది ఆగస్టు నుంచి ఈ-శ్రమ్‌ పేరిట ప్రత్యేక ఆన్‌లైన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు సంభవించినప్పుడు కార్మికులకు ఆర్థిక సాయం వర్తింప చేసేందుకు ఇది ఉపయోగపడనుంది. దీనిలో నమోదైన కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం, ఉపాధి కల్పన, సామాజిక భద్రతకు కల్పించనున్నారు.

కార్మిక శాఖ లెక్కల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 7.50 లక్షల మంది అసంఘటిత రంగ కార్మికులు ఉన్నారు. వీరిలో 5,39,655 మంది ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో తమ పేర్లు నమోదు చేయించుకున్నారు. కామన్‌ సర్వీసు సెంటర్ల ద్వారా 3,23,972 మంది, సెల్ప్‌ రిజిస్ట్రేషన్‌ ద్వారా 2,15,654 మంది వివరాలు నమోదైనట్లు అధికారులు చెబుతున్నారు. కామన్‌ సర్వీసు సెంటర్లు, గ్రామీణ తపాలా కార్యాలయాలు, సచివాలయాల వద్ద నమోదు ప్రక్రియ చేస్తున్నారు. దీనికి ఎటువంటి రుసుము చెల్లించాల్సినవసరం లేదు. వయసు 18 నుంచి 59 సంవత్సరాల మద్యలో ఉండాలి. ప్రైవేటు ఇంటర్‌నెట్‌ సెంటర్ల వద్ద మాత్రం సర్వీసు ఛార్జి, కార్డు లామినేషన్‌కు రూ.50 నుంచి రూ.100 వసూలు చేస్తున్నారు. అర్హులు ఆధార్‌, మనుగడలో ఉన్న బ్యాంకు ఖాతా నంబర్‌, చరవాణి నంబర్‌తో నమోదు కేంద్రాల్లో సంప్రదించవచ్ఛు www.eshram.gov.in వెబ్‌సైట్‌ ద్వారా స్వయంగా దరఖాస్తు చేసుకోవచ్ఛు

సాయం ఇలా.. దీనిలో పేర్లు నమోదు చేయించుకున్న కార్మికులకు 12 అంకెల గుర్తింపు సంఖ్యను ఇస్తారు. కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినా, అంగవైకల్యం పొందినా ప్రధాన మంత్రి సురక్ష యోజన ద్వారా రూ. 2 లక్షల ఆర్థిక సాయం బాధిత కుటుంబానికి అందతుంది. భవిష్యత్తులో కార్మికులకు అవసరమైన నైపుణ్య శిక్షణ, కేంద్రం అమలు చేసే వివిధ సంక్షేమ పథకాలకు ఈ పోర్టల్‌లో వివరాలను ప్రాతిపదికగా తీసుకుంటారు.

ముందుకు రావాలి

ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో పేర్ల నమోదుకు కార్మికులు ముందుకు రావాలి. గ్రామ స్థాయిలో అవసరమైతే సచివాలయాల వద్ద ప్రత్యేక కౌంటర్ల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్నాం’అని కార్మిక శాఖ సహాయ అధికారి కె.శివనాగమల్లేశ్వరరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని