logo
Published : 05 Dec 2021 01:43 IST

అజాత శత్రువు

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి  రోశయ్య మృతికి జిల్లావాసుల సంతాపం
వార్డు సభ్యుడి నుంచి అంచెలంచెలుగా ఉన్నత స్థానానికి ఎదిగి

మాటల మాంత్రికుడు, చమత్కారి, రాజకీయ దురంధరుడు, అజాత శత్రువు.. మంచితనానికి మారుపేరుగా కొణిజేటి రోశయ్య పేరుగడించారు. వేవ΄రులో పుట్టి పెరిగిన ఆయన పంచాయతీ వార్డు సభ్యునిగా ప్రస్థానం ప్రారంభించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. ఆర్థిక మంత్రిగా, వైద్య, ఆరోగ్య మంత్రిగా, ముఖ్యమంత్రిగా జిల్లాలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. తమిళనాడు రాష్ట్రానికి గవర్నరుగా నియమితులైనా గాని స్వస్థలంపై మక్కువతో జిల్లాలో పలు కార్యక్రమాలకు హాజరయ్యేవారు. శనివారం రోశయ్య మరణంతో జిల్లా వాసులు శోకసంద్రంలో మునిగిపోయారు. జిల్లాకు ఎప్పుడొచ్చినా ఎంతో ఆప్యాయతతో పలకరించేవారని, స్నేహితులు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. నిబద్ధత కలిగిన నాయకుడిని కోల్పోయామని ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సంతాపాన్ని వ్యక్తం చేశారు. రోశయ్య మృతికి సూచికగా గుంటూరు, తెనాలిలో వర్తక, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాయి.
నరసరావుపేటతో విడదీయరాని అనుబంధం

నరసరావుపేట పట్టణం,  న్యూస్‌టుడే: కొణిజేటి రోశయ్యకు నరసరావుపేటతో విడదీయరాని అనుబంధం ఉంది. మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్‌గా పని చేసిన సమయంలో పలుమార్లు ఆయన నరసరావుపేటలో జరిగిన కార్యక్రమాలకు హాజరయ్యారు. మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి రోశయ్యతో ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. వారిద్దరి మద్య ఉన్న అవగాహనతో 1998లో జరిగిన ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖలతో రోశయ్యకు ఎంతో అనుబంధం ఉంది. వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతేడాది రోశయ్య జన్మదిన వేడుకలు పట్టణంలో ఘనంగా నిర్వహించేవారు. 


వేవ΄రులో రోశయ్య నివాస గృహం 

సొంతూరికి కొంతైనా చేయాలని..
వేవ΄రు, న్యూస్‌టుడే:పుట్టిన గడ్డపై ప్రత్యేక అభిమానాన్ని చాటుకునే రోశయ్య తన మిత్రులు, సన్నిహితులతో అనేక విషయాలు పంచుకునేవారు. సరదాగా గడిపేవారు. చిన్నవారికి వ్యాపార మెలకువలు నేర్పి, ఆత్మీయతను చాటుకునేవారు. అలాగే పల్లెల అభివృద్ధికి చేతనిచ్చేవారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో మండలంలోని వివిధ అభివృద్ధి పనులకు రూ.7 కోట్ల నిధులు మంజూరు చేశారు. వాటితో వేవ΄రు, వరహాపురం, పెరవలి, జంపనిలో 68 సిమెంటు రోడ్లు రూపుదిద్దుకున్నాయి. వేవ΄రు - చావలి ప్రధాన రహదారిని అభివృద్ధి చేశారు. 1982లో ఆయన వైద్యారోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో వేవ΄రుకు ప్రాథమిక వైద్యశాలను మంజూరుచేసి, తాను ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దాన్ని 30 పడకల ఆస్పత్రిగా మార్చేందుకు నూతన భవనాన్ని నిర్మింపజేశారు. దీంతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. 


దుర్గి మిర్చియార్డు శంకుస్థాపన కార్యక్రమంలో వెండి నాగలి అందుకుంటూ..

బాపట్లలో  రోశయ్య  పేరిట డిగ్రీ కళాశాల

బాపట్ల, న్యూస్‌టుడే: తీర ప్రాంతంతో మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్యకు ప్రత్యేక అనుబంధం ఉంది. నిడుబ్రోలుకు చెందిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, రైతు నేత ఆచార్య ఎన్జీరంగా శిష్యుడిగా రాజకీయాల్లోకి ఆయన ప్రవేశించారు. ఈ ప్రాంతానికి చెందిన నేతలను పేరు పెట్టి ఆప్యాయంగా పిలిచేవారు. రోశయ్య కోడలు బాపట్ల వాసి. మంత్రి, సీఎం, గవర్నర్‌ హోదాలో పలుమార్లు భావపురిని సందర్శించారు. వియ్యంకుడు చీదెళ్ల సత్యనారాయణ ఇంటికి తరుచుగా వచ్చేవారు. బాపట్ల సూర్యలంక రోడ్డులో రోశయ్య పేరు మీద డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. వేల మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు.  
 సీఎం హోదాలో 2010 అక్టోబరులో వ్యవసాయ కళాశాలలో నిర్వహించిన రైతు సదస్సులో పాల్గొని అన్నదాతల అభ్యున్నతి కోసం తీసుకుంటున్న చర్యలు వివరించారు. బాపట్లలో రూ.పది కోట్లతో నిర్మించిన సెంట్రల్‌ లైటింగ్, మార్కెట్ యార్డు నుంచి పాతబస్టాండ్‌ వరకు విస్తరించిన రహదారిని ప్రారంభించారు. తమిళనాడు గవర్నర్‌ హోదాలో 2013 మే 27న నిర్వహించిన ప్రథమాంధ్ర మహాసభ శతాబ్ది ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. చారిత్రక టౌన్‌హాలులో తెలుగుతల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. మాజీ ఎమ్మెల్యే ముప్పలేని శేషగిరిరావు, రోశయ్య గుంటూరు కళాశాలలో సహ విదార్థులుగా ఉన్నారు. ఇక్కడి వచ్చినప్పుడు వారితో చర్చించేవారు.


నరసరావుపేటలో మాజీ మంత్రి కాసుతో..

‘ఆంధ్రా ప్యారిస్‌’ అల్లుడు
తెనాలి టౌన్, న్యూస్‌టుడే : వేవ΄రు బిడ్డ అయినప్పటికీ డివిజన్‌ కేంద్రంగా, చైతన్యానికి మారుపేరుగా ఉన్న తెనాలే కొణిజేటి రోశయ్యకు రాజకీయ వేదికైంది. వేవ΄రుతో పాటు ఇక్కడ కూడా ఆయన రైసుమిల్లులు నడిపారు. పట్టణానికి చెందిన శివలక్ష్మిని వివాహం చేసుకుని ‘ఆంధ్రా ప్యారిస్‌’ అల్లుడయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ ఆర్యవైశ్య మహాసభ ప్రస్థానంలో కీలక భూమిక పోషించారు. ఆర్యవైశ్య సంఘాలు, వాసవిత్‌ సేవా కార్యక్రమాలను ప్రోత్సహించేవారు. ఇప్పటివరకూ శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీకి గౌరవ అధ్యక్షునిగా కొనసాగారు. 2010లో నిర్వహించిన తెనాలి పురపాలక సంఘ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివాద రహితుడిగా, అందరూ బావుండాలని కోరుకునే కొణిజేటి అంటే అందరికీ అభిమానమేనని ప్రత్యర్థులూ చెప్పేవారు. ‘ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ పిలుపుతో శనివారం ఇక్కడి దుకాణాలు వ΄తబడ్డాయి.  
తెలుగువారికి గర్వకారణం 
రాజకీయాల్లో నాలుగు దశాబ్దాలకు పైగా రోశయ్యతో మంచి అనుబంధం ఉంది. విలువలతో కూడిన రాజకీయాలు చేశారు. ఆయన మంత్రివర్గంలో దేవాదాయ, రిజిస్ట్రేషన్లశాఖ మంత్రిగా పని చేశా. ఎప్పుడు వెళ్లినా అప్యాయంగా పలకరించేవారు. అభివృద్ధి పనులకు పెద్దఎత్తున నిధులు మంజూరు చేశారు. రోశయ్య ఏ పదవి చేపట్టినా వన్నె తెచ్చేలా పని చేశారు. తెలుగువారికి గర్వకారణంగా నిలిచారు. - గాదె వెంకటరెడ్డి, మాజీ మంత్రి
ప్రజలతో ఎలా మెలగాలో నేర్చుకున్నా 
రోశయ్యలో గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఆయనను చూసే ప్రజలతో ఎలా మెలగాలి, నేతలు, కార్యకర్తలతో ఆప్యాయంగా ఉండటాన్ని నేర్చుకున్నా. నీతి, నిజాయతీలకు మారుపేరుగా నిలిచారు. నమ్మిన సిద్ధాంతాల కోసం జీవితాంతం పని చేసిన గొప్ప రాజకీయవేత్త. నేటి తరం రాజకీయ నాయకులకు రోశయ్య ఆదర్శనీయుడు. స్ఫూర్తిప్రదాతగా నిలిచారు. - కోన రఘుపతి, ఉప సభాపతిబాపట్లలో కోన ప్రభాకరరావు శత జయంతి సంచికను ఆవిష్కరిస్తూ.. 

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని