logo

ముగ్గురు సర్పంచుల చెక్‌ పవర్‌ రద్దు

సత్తెనపల్లి మండలంలో ముగ్గురు సర్పంచుల చెక్‌ పవర్‌ రద్దు చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయస్థానం ఉత్తర్వులను ధిక్కరించారనే కారణంతో దార్ల సంధ్య (కట్టమూరు), మద్దిగుంట్ల వెంకయ్య (గోరంట్ల)కు మూడు

Published : 22 Jan 2022 02:12 IST

గ్రామీణ సత్తెనపల్లి, న్యూస్‌టుడే : సత్తెనపల్లి మండలంలో ముగ్గురు సర్పంచుల చెక్‌ పవర్‌ రద్దు చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయస్థానం ఉత్తర్వులను ధిక్కరించారనే కారణంతో దార్ల సంధ్య (కట్టమూరు), మద్దిగుంట్ల వెంకయ్య (గోరంట్ల)కు మూడు నెలల పాటు చెక్‌ పవర్‌ రద్దు చేశారు. స్థానికంగా నివాసం ఉండటం లేదనే కారణంగా దీపాలదిన్నెపాలెం సర్పంచి వాసిరెడ్డి ఇందిర చెక్‌ పవర్‌ రద్దు చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం మ్యాచింగ్‌ కింద కట్టమూరులో రూ.34.89 లక్షలు, గోరంట్లలో రూ.16.98 లక్షలతో నాలుగేళ్ల కిందట కట్టమూరుకు చెందిన మందడి కాళీప్రసాద్‌ అభివృద్ధి పనులను చేశారు. ఇంజినీరింగ్‌ విభాగం పూర్తి నివేదికలను పంపినప్పటికీ నగదు మంజూరు చేయకుండా అధికారులు కాలయాపన చేశారు. కాళీప్రసాద్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా నగదు మంజూరు చేయాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని న్యాయస్థానం ఆదేశించింది. సంబంధిత చెక్కులపై ఆయా పంచాయతీల కార్యదర్శి అజీజుర్‌ రెహమాన్‌ సంతకం చేశారు. రాజకీయ కారణాల నేపథ్యంలో ఇద్దరు సర్పంచులు సంతకాలు చేయడానికి ముందుకు రాలేదు. జిల్లా పంచాయతీ అధికారి సూచించినప్పటికీ భీష్మించారు. కాళీప్రసాద్‌ తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేసినందున కట్టమూరు, గోరంట్ల సర్పంచుల చెక్‌ పవర్‌ రద్దు చేస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచుల స్థానంలో ఈవోపీఆర్డీకి అధికారాన్ని కట్టబెట్టారు. కార్యదర్శి, ఈవోపీఆర్డీ సంతకాలతో కూడిన చెక్కును కాళీప్రసాద్‌ అందుకుని మొత్తం రూ. 51.87 లక్షలు బ్యాంకు నుంచి ఉపసంహరించుకున్నారు. ఇదిలాఉండగా వైకాపా మద్దతుదారైన కట్టమూరు సర్పంచి దార్ల సంధ్య చెక్‌ పవర్‌ రద్దు కావడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని