logo

నిశ్శబ్దాన్ని ఛేదించొచ్చు !

వినికిడి లోపం చాలా తీవ్రంగా ఉంటే దాన్ని అధిగమించేందుకు నేడు అందుబాటులో ఉన్న ఒకే ఒక్క సమర్థ విధానం కాక్లియర్‌ ఇంప్లాంట్‌. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చి ఎంతోమంది చిన్నారులను చెవిటి-మూగ అవస్థల నుంచి బయటపడేస్తున్న అద్భుత పరిజ్ఞానం ఇది.

Published : 17 Aug 2022 05:48 IST
చెవిటి, మూగ అవస్థలకు చెల్లు
జీజీహెచ్‌లో కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు
గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే

వినికిడి లోపం చాలా తీవ్రంగా ఉంటే దాన్ని అధిగమించేందుకు నేడు అందుబాటులో ఉన్న ఒకే ఒక్క సమర్థ విధానం కాక్లియర్‌ ఇంప్లాంట్‌. వైద్యరంగంలో విప్లవాత్మక మార్పు తెచ్చి ఎంతోమంది చిన్నారులను చెవిటి-మూగ అవస్థల నుంచి బయటపడేస్తున్న అద్భుత పరిజ్ఞానం ఇది. అత్యంత ఖరీదైన ఈ శస్త్రచికిత్సను సర్వజనాసుపత్రి చెవి, ముక్కు, గొంతు విభాగంలో ఉచితంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 20 మంది పిల్లలకు ఈ తరహా సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు.

తీవ్రమైన వినికిడి లోపం ఉన్న పిల్లలకు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ను మూడేళ్ల లోపు అమరిస్తే మంచి ఫలితముంటుందని నిపుణులైన వైద్యులు సూచిస్తున్నారు. ఎందుకంటే మాటలకు కారణమయ్యే మెదడులోని భాగాన్ని ఐదేళ్ల వరకూ ప్రేరేపించకపోతే ఆ భాగం ఇతర పనులను చేపడుతుంది. అందువల్ల వీరికి మాటలు స్పష్టంగా రావు. కాబట్టి వినికిడి లోపాన్ని త్వరగా గుర్తించడం.. లోపం తీవ్రంగా, అతి తీవ్రంగా ఉంటే ఇంప్లాంట్‌ను అమర్చడం ఎంతో అవసరమని వైద్యులు తెలుపుతున్నారు. తీవ్రమైన వినికిడి లోపంతో పుట్టిన బిడ్డలకు ఏడాది లోపే ఈ సర్జరీ చేసి ఇంప్లాంట్‌ అమర్చడం ఉత్తమమన్నారు. మూడేళ్ల లోపు అమర్చిన బిడ్డలతో పోలిస్తే ఏడాది లోపే అమర్చిన బిడ్డలకు మాటలు వచ్చే ప్రక్రియ మెరుగ్గా ఉంటున్నట్లు గుర్తించామన్నారు. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద ఉచితంగా సర్జరీలు చేస్తున్నారు. రెండు చెవులకూ కాక్లియర్‌ ఇంప్లాంట్‌ అమర్చేందుకు రూ.12 లక్షలు ఇస్తున్నారు. రెండు చెవులకూ అమరిస్తే ఫలితాలు మరింత బాగుంటాయన్నారు.

పిల్లలకు ఎంతో ప్రయోజనం

జీజీహెచ్‌లో నూతనంగా ఈ తరహా శస్త్రచికిత్సలు ప్రారంభించేందుకు వైద్యులు ఆసక్తి కనబర్చడంతో ఇక్కడ ప్రారంభించారు. దీనివల్ల వినికిడి లోపం ఉన్న పిల్లలకు ఎంతో మేలు జరుగుతోందని వైద్యులు తెలుపుతున్నారు. అత్యంత ఖరీదైన ఈ చికిత్స అందరికీ ఉచితంగా అందుబాటులోకి తెచ్చారు. ఈ ఆపరేషన్లతో చిన్నారులకు మేలు జరగడమే కాకుండా బోధనాసుపత్రి అయినందున శిక్షణలో ఉండే విద్యార్థి వైద్యులకు ఎంతో మేలు జరుగుతుందని, నవ్యాంధ్రలో ఎక్కువ మంది నిపుణులను తయారు చేయవచ్చని తెలుపుతున్నారు.

అందుబాటులో శస్త్రచికిత్స మందిరం

జీజీహెచ్‌లో మాడ్యులర్‌ ఆపరేషన్‌ థియేటర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇందులో ఇన్‌ఫెక్షన్‌ శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఈ శస్త్రచికిత్స మందిరంలోనే కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జరీలు చేస్తున్నారు. ఈ సర్జరీతో సాధారణంగా ఎలాంటి సమస్యలూ ఉండవు. ఒకటి రెండు రోజుల్లోనే ఇంటికి పంపేస్తారు. గాయం మానిన తర్వాత అప్పుడు బయటి యూనిట్‌ను అనుసంధానిస్తారు.

సాహి ట్రస్టు చేయూత

హైదరాబాద్‌కు చెందిన సాహి ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ విజయకుమార్‌ అపోలో ఆసుపత్రి సహకారంతో రూ.50 లక్షల విలువైన వైద్య పరికరాలను సర్వజనాసుపత్రి ఈఎన్‌టీ విభాగానికి అందజేశారు. అంతేగాకుండా కాక్లియర్‌ ఇంప్లాంట్‌ శస్త్రచికిత్సలు చేసేందుకు నిపుణులైన వైద్యుల బృందాన్ని పంపుతున్నారు. దీంతో సర్జరీలు విజయవంతంగా చేయగలుగుతున్నారు.  

ఏం చేయాలి?

ముందుగా పొరుగు రోగుల విభాగం రెండో నంబరు గదిలో పేర్లు నమోదు చేయించుకోవాలి. సోమవారం నుంచి శనివారం వరకు ఈఎన్‌టీ విభాగంలో వైద్యులు పరీక్షిస్తారు. అనంతరం నిపుణులైన కమిటీ సభ్యులు పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రభుత్వ ఆమోదం తీసుకుంటారు. అనుమతి వచ్చిన అనంతరం సర్జరీ ఎప్పుడు చేసేది తల్లిదండ్రులకు తెలియజేస్తారు. ఆధార్‌, ఆరోగ్యశ్రీ కార్డు తప్పకుండా తీసుకుని రావాల్సి ఉంటుంది. గతంలో నిర్వహించిన వైద్య పరీక్షల నివేదికలుంటే తీసుకురావాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని