logo

‘రోడ్డు వేయకుంటే ఎమ్మెల్యే ఇంటిని ముట్టడిస్తాం’

సెప్టెంబరు 1వ తేదీలోపు మంగళగిరి నుంచి అమరావతి వరకూ ఉన్న రోడ్డును పునర్‌ నిర్మాణం చేయకపోతే స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇంటిని ముట్టడిస్తామని ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు హెచ్చరించారు.

Published : 18 Aug 2022 06:04 IST


దీక్షకు మద్దతు తెలుపుతున్న కాంగ్రెస్‌ నాయకురాలు పద్మశ్రీ, సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు, రైతులు, మహిళలు

తుళ్లూరు గ్రామీణం, న్యూస్‌టుడే: సెప్టెంబరు 1వ తేదీలోపు మంగళగిరి నుంచి అమరావతి వరకూ ఉన్న రోడ్డును పునర్‌ నిర్మాణం చేయకపోతే స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఇంటిని ముట్టడిస్తామని ఆంధ్రప్రదేశ్‌ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు హెచ్చరించారు. రాజధాని ప్రాంతంలో రహదారుల నిర్మాణం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ పెదపరిమిలో ఆయన చేస్తున్న దీక్ష బుధవారంతో ముగిసింది. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకురాలు సుంకర పద్మశ్రీ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు తదితరులు బుధవారం మధ్యాహ్నం ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. రాజధాని గ్రామాలకు చెందిన రైతులు, మహిళలు దీక్ష చేస్తున్న ప్రాంతానికి వచ్చి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో వైకాపా నాయకులు రాజధాని అమరావతికి తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. అమరావతికి అనుకూలంగా న్యాయస్థానాలు తీర్పు ఇచ్చినా ప్రభుత్వం మొండిగా ముందుకుపోతోందని ఆరోపించారు. రాజధాని ప్రాంతం పిచ్చి మొక్కలతో నిండిపోయిందని, ప్రభుత్వం రహదారుల వంటి కనీస మౌలిక వసతులను కూడా కల్పించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. కార్యక్రమంలో అమరావతి ఐకాస నాయకులు పువ్వాడ సుధాకర్‌, నూతలపాటి రామారావు, అత్తిపట్ల బాలయ్య చౌదరి, కళ్లం రాజశేఖరరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని