logo

బూచోళ్లున్నారు జాగ్రత్త!

జిల్లాలో పిల్లల అపహరణ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లలను అపహరించి అమ్మకాలు సాగించే ముఠాలు నిరంతరం మాటు వేసి ఉంటున్నాయి.

Published : 02 Dec 2022 06:25 IST

నెహ్రూనగర్‌ (గుంటూరు), న్యూస్‌టుడే
 

* మంగళగిరి రూరల్‌ పరిధిలో ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని కారులో అపహరించుకెళ్లిన ఘటన అప్పట్లో సంచలనం రేపింది. వేరే జిల్లాలో ఆ బాలుడిని విక్రయించినట్లు పోలీసులు గుర్తించి కాపాడారు.


* బ్రాడీపేటలో ఓ బాలుడిని అపహరించుకెళ్లిన వ్యక్తి వేరే జిల్లాలో యాచకులకు విక్రయించినట్లు గుర్తించిన పోలీసులు బాలుడిని సంరక్షించారు.


* జీజీహెచ్‌లో నాలుగు రోజుల పసికందును పాలల్లో మత్తు పొడి కలిపి అపహరించుకెళ్లి ఓ ఇంట్లో బండరాళ్ల కింద దాచి పెట్టిన వైనం అప్పట్లో సంచలనం సృష్టించింది.


* జీజీహెచ్‌లో ప్రసవానికి వచ్చిన మహిళ అన్న కుమారుడిని చాక్లెట్లు ఇచ్చి అపహరించుకెళ్లడం చర్చనీయాంశమైంది.

బాలలను ముఠా నుంచి విడిపించి తల్లిదండ్రులకు అప్పగిస్తున్న

ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, ఏఎస్పీలు సుప్రజ, శ్రీనివాసరావు

జిల్లాలో పిల్లల అపహరణ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లలను అపహరించి అమ్మకాలు సాగించే ముఠాలు నిరంతరం మాటు వేసి ఉంటున్నాయి. కొవిడ్‌ అనంతరం అడ్డదారిలో డబ్బులు సంపాదించడానికి మానవ అక్రమ రవాణా ముఠాల ఆగడాలు మరింత పెచ్చుమీరాయనే వాదనలు వినిపిస్తున్నాయి. సంతానం లేని వాళ్లు సంవత్సరాలుగా ఎదురు చూసి ఇక పిల్లలు కలగరనే నిర్ధరణకు వచ్చాక బాల, బాలికలను పెంచుకోవాలని ఆశపడుతుంటారు. చట్టప్రకారం బాల, బాలికలను దత్తత తీసుకోవాలి. అందుకు ప్రభుత్వం పలు నిబంధనలు అమలు చేస్తోంది. వీటితో పనిలేకుండా మానవ అక్రమ రవాణా ముఠాలు సులువుగా పిల్లలను తెచ్చి ఇస్తామంటూ ఆశ చూపుతున్నాయి. ఈ ముఠాలో మహిళలు, పురుషులు, ఆసుపత్రుల్లో పనిచేసే ఆయాలు, నర్సులు ఇలా అనేకమంది భాగస్వాములుగా ఉంటున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అధికంగా ఆసుపత్రుల నుంచి శిశువులు, పిల్లల అపహరణలు చోటు చేసుకోవడం గమనార్హం.

బొమ్మలు, చాక్లెట్లు ఆశ చూపి...: అపహరణ ముఠాలు బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ఆలయాలు, ఆసుపత్రులు తదితర రద్దీ ప్రాంతాల్లో సంచరిస్తుంటాయి. ఒంటరిగా ఆడుకుంటున్న పిల్లలపై వారు కన్నేస్తారు. దూరం నుంచి ముసిముసి నవ్వులతో కవ్విస్తారు. ఆడుకునే బొమ్మలను చూపించడం, చాక్లెట్లు, బిస్కెట్లు ఆశ చూపిస్తారు. వారిని చుట్టుపక్కల ఎవరూ పట్టించుకోవడం లేదని నిర్ధరించుకొని దగ్గరకు వెళ్లి చాక్లెట్లు చేతిలో పెట్టి దర్జాగా అపహరించేస్తారు. ఇటీవల గుంటూరు సర్వజనాసుపత్రి(జీజీహెచ్‌)లో ఓ బాలుడికి చాక్లెట్టు ఇచ్చి మహిళ చేయి పట్టుకొని తీసుకువెళ్లడం విస్మయం కలిగించింది. ఆడుకునే బొమ్మలు, తినుబండారాలకు ఆకర్షితులై అక్రమ రవాణా చెరలో చిక్కుకుంటున్నామని పసి హృదయాలకు తెలియదు పాపం.

రూ.20 వేల నుంచి రూ.లక్షల్లో అమ్మకాలు! : ఈ ముఠాలు ముందుగానే పిల్లల విక్రయానికి బేరాలు కుదుర్చుకుంటారు. కొనుగోలు చేసే వారి ఆర్థిక స్థితిగతులు, పిల్లల కోసం వారు ఆరాట పడుతున్న పరిస్థితులను అంచనావేసి ఒక ధరను నిర్ణయిస్తారు. మగపిల్లలను కోరుకునే వారి నుంచి పెద్ద మొత్తంలోనే నగదు వసూలు చేస్తుంటారు. తొలుత అపహరించిన వ్యక్తి రూ.20 వేలతో అమ్మకాలు ప్రారంభిస్తే, ఆ పిల్లాడిని అనేక ముఠాలు, అందులోని సభ్యుల చేతులు మారుతూ రూ.లక్షల్లో విక్రయాలు సాగిస్తుంటారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఇటీవల జీజీహెచ్‌లో అపహరించిన ఆరేళ్ల బాలుడిని ముఠాలోని సభ్యులు వారి బంధువు అయిన ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం కనకాపురం గ్రామానికి చెందిన వ్యక్తికి రూ.20 వేలకు, గుంటూరు అరండల్‌పేటలో ఎత్తుకెళ్లిన నాలుగేళ్ల బాలుడిని రూ.30 వేలకు అమ్మినట్లు పోలీసుల తెలిపారు. మంగళగిరికి చెందిన ఓ బాలుడు అనేక జిల్లాలకు చెందిన నాలుగైదు ముఠాలు చేతులు మారి రూ.లక్షల్లో వసూలు చేసినట్లు గుర్తించారు.


తల్లిదండ్రుల అప్రమత్తత అవసరం

పిల్లలను ఆసుపత్రులు, బస్టాండ్‌, రైల్వేస్టేషన్‌, ఆలయాలు, రద్దీ ప్రాంతాల్లో ఒంటరిగా వదిలెయ్య కూడదు. ఇళ్లముందు, ఆసుపత్రుల ఆవరణలో ఆడుకుంటున్నారని చూసీ చూడనట్లు వ్యవహరిస్తే పొంచి ఉన్న నేరగాళ్లు అపహరించుకెళ్లిపోతున్నారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా వారిని కనిపెట్టుకొని ఉండాలి. కొత్తప్రదేశాల్లో గుర్తు తెలియని వ్యక్తులకు తమ పిల్లలను అప్పగించి చూస్తుండమని పురమాయించకూడదు. ఆసుపత్రుల్లో శిశువు దగ్గర తల్లి వారి బంధువు తప్పనిసరిగా ఉండాలి. పాఠశాలలకు పంపించేటప్పుడు ఆటోలు, ప్రైవేటు వాహనాల డ్రైవర్ల గురించి అన్ని వివరాలు తెలుసుకొని ఉండాలి. ముఖ్యంగా బయటకు వెళ్లిన చోట తెలియని వ్యక్తులు చాక్లెట్లు, బిస్కెట్లు, తినుబండారాలు, ఆటబొమ్మలు చూపిస్తే వాటిని తీసుకోవద్దని చెప్పాలి.


మానవ అక్రమ రవాణా నిరోధక వ్యవస్థ బలోపేతం చేస్తే...

మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం (యాంటీ హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ వింగ్‌)ను పోలీసుశాఖ అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేస్తుంది. అందులో తగిన సంఖ్యలో సిబ్బంది లేకపోవడం, వారికి సరైన భవనాలు, సదుపాయాలు కల్పించకపోవడం సమస్యగా మారుతోంది. పోలీసుశాఖలో సిబ్బంది కొరత వెంటాడుతున్న క్రమంలో కొత్తగా వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలను సమన్వయం చేసుకోవాలి. మహిళా కార్యదర్శుల (మహిళా పోలీసు) సహకారం తీసుకుంటే సిబ్బంది కొరతను అధిగమించవచ్చనే సూచనలు వస్తున్నాయి. వారు తమ పరిధిలోని ఇళ్లల్లో పిల్లల తల్లులు, కుటుంబ సభ్యులకు పిల్లలు తప్పిపోకుండా, అపహరణకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తుంటే అక్రమ రవాణా అరికట్టడానికి కొంతమేర వీలవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని