logo

హరికథను బతికించుకోవచ్చు

‘హరికథ తెలుగువారి సొంత ప్రాచీన కళాప్రక్రియ. అదేం సామాన్య కళ కాదు. సర్వకళా సమాహారం. సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటకం లాంటి ఎన్నెన్నో కళల్లో ప్రవేశముంటే తప్ప కథకుడు రంగస్థలంపై రాణించలేడు.

Published : 27 Jan 2023 04:47 IST

పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కోట సచ్చిదానందశాస్త్రి

గుంటూరు సాంస్కృతికం, న్యూస్‌టుడే: ‘హరికథ తెలుగువారి సొంత ప్రాచీన కళాప్రక్రియ. అదేం సామాన్య కళ కాదు. సర్వకళా సమాహారం. సంగీతం, సాహిత్యం, నృత్యం, నాటకం లాంటి ఎన్నెన్నో కళల్లో ప్రవేశముంటే తప్ప కథకుడు రంగస్థలంపై రాణించలేడు. ఆ ఒక్క హరికథను బతికించుకుంటే మన సంస్కృతితో పాటు సమాంతరంగా వస్తున్న అన్ని కళలు మనగలుగుతాయి. ఇప్పుడు గల్లీ నుంచి దిల్లీ వరకు మన కళ కళకళలాడుతూ ఎదిగిందని సంతోషంగా ఉంది. ఇక ఇప్పుడు దాన్ని బతికించుకోవల్సిన బాధ్యత మన చేతుల్లోనే ఉంది’.. అంటున్నారు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన కోట సచ్చిదానంద శాస్త్రి. ప్రస్తుతం గుంటూరులో నివాసం ఉంటున్న ఆయనను గురువారం ‘న్యూస్‌టుడే’ కలిసినప్పుడు హరికథ విషయంలో సామాజిక బాధ్యత ఎంత వరకు ఉందనే విషయాన్ని వివరించారు.
దేవాలయాల నిర్వాహకులు ముందుకు రావాలి: హరికథను బతికించుకోవడం ఏమంత కష్టం కాదన్నది నామాట. ఎలా అంటే మనకు దేవదాయ శాఖ పక్షాన ఎ, బి, సి విభాగాలుగా దేవాలయాలు రాష్ట్రంలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ఆలయాల్లో హరికథకుల జాబితా తీసుకుని ఒక వరుస క్రమంలో హరికథా గానాలను ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకోవచ్చు. ఇవేగాక విడిగా యాజమాన్యాలు, పీఠాల పరిధుల్లో నిర్వహణలో ఉన్న దేవాలయాలు కూడా కార్యక్రమాలను ఏర్పాటు చేయవచ్చు. దీంతో ఈ కళాకారులు వృత్తిపై మరింత శ్రద్ధ పెట్టి ప్రదర్శనలివ్వడానికి అవకాశముంటుంది.

మా తరంలో అలా జరిగింది

మేం కథలు చెప్పి డబ్బు సంపాదించామంటే ఆనాడు సమాజం ఆదరించబట్టే. రాజాలాగా బతికాం. సాంకేతికంగా వచ్చిన మార్పులు హరికథను వెనక్కు నెట్టాయి. హరికథలో ఉచ్ఛారణ భాషను, సాహిత్యాన్ని పరిచయం చేసేది ఆనాడు. కథలకొచ్చి ఏ పదం ఎలా పలకాలో తెలుసుకున్న వాళ్లు కోకొల్లలు. సంస్కృతిలోని విశేషాలను తరువాత తరం వాళ్లు నేర్చుకోగలుగుతుండే వారు. ఎన్నెన్నో విశేషాలు, సామెతలు, జాతీయాలు, పడికట్టు మాటలు ఇవన్నీ తెలుస్తుండేవి. ఎవరి దాకానో ఎందుకు నాకథ విని అక్కినేని నాగేశ్వరరావు లాంటి ప్రముఖులు నన్ను ఇంటికి పిలిపించుకుని ప్రశంసించి సత్కరించిన సందర్భాలు అనేకం. అలాగే నేను విదేశాల్లో కథాగానానికి వెళ్లినప్పుడు అక్కడున్న ప్రవాస భారతీయుల ఆదరణను నేనిప్పటికీ మరువలేను. సమాజం నన్నలా గౌరవించబట్టి కదా నేను నిలదొక్కుకుని ఇలా మాట్లాడగలుగుతున్నాను. అందుకే ప్రభుత్వం గుర్తించింది. ఇక ప్రజలు ఆ గుర్తింపును దక్కించుకోవాలని నా విన్నపం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని