logo

ఎనిమిదో అంతస్తు నుంచి జారిపడి దుర్మరణం

భార్యాబిడ్డలతో గడిపేందుకు విదేశం నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ వ్యక్తి అదే రోజు అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు. బాల్కనీలో మొక్కలకు నీళ్లు పోస్తూ ప్రమాదవశాత్తు భవనం ఎనిమిదో అంతస్తు నుంచి జారి కింద పడ్డాడు.

Published : 27 Jan 2023 04:47 IST

నిజాంపేట: భార్యాబిడ్డలతో గడిపేందుకు విదేశం నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఓ వ్యక్తి అదే రోజు అనూహ్యంగా మృత్యువాత పడ్డాడు. బాల్కనీలో మొక్కలకు నీళ్లు పోస్తూ ప్రమాదవశాత్తు భవనం ఎనిమిదో అంతస్తు నుంచి జారి కింద పడ్డాడు. బాచుపల్లి ఎస్సై సంధ్య తెలిపిన ప్రకారం.. ఏపీలోని బాపట్ల జిల్లా పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన ఆకుల వెంకటేష్‌(36) కుటుంబం కొన్నాళ్లుగా హైదరాబాద్‌లోని నిజాంపేట పరిధి ఆదిత్యా లాగూన్‌ సముదాయంలోని ఎనిమిదో అంతస్తులో నివాసం ఉంటున్నారు. ఇతనికి కృష్ణశ్రావణితో 2015లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు కల్యాణ్‌ సంతానం. వెంకటేష్‌ ఉద్యోగరిత్యా కువైట్‌లో ఉంటున్నాడు. సెలవులు ఉండటంతో కుటుంబాన్ని చూడటానికి బుధవారం ఉదయం 10.30 గంటలకు ఆయన నిజాంపేటకు వచ్చారు. సాయంత్రం 6 గంటల సమయంలో భార్య కుమారుడితో బయటకు వెళ్లడానికి నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో వెంకటేష్‌ బాల్కనీలోని మొక్కలకు నీళ్లు పోస్తుండగా.. భార్య గదిలోకి వెళ్లి కుమారుడిని తయారు చేస్తున్నారు. తిరిగి బాల్కనీకి వచ్చి చూసిన కృష్ణశ్రావణికి భర్త కన్పించలేదు. బాల్కనీ నుంచి భవనం కిందకు చూడగా నేలపై గాయాలతో కొట్టుమిట్టాడుతూ కన్పించాడు. వెంటనే కుటుంబీకులు అతణ్ని బాచుపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా కొన్ని గంటల్లో మృతిచెందాడు. బాచుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని