logo

దేవాలయాల ఆస్తుల పరిరక్షణకు చర్యలు

దేవాదాయ శాఖకు చెందిన ఆలయాల ఆస్తులను పరిరక్షించాలని ఆ శాఖ అదనపు కమిషనర్‌ (ఏడీసీ) రామచంద్రమోహన్‌ అన్నారు.

Published : 07 Feb 2023 06:02 IST

మాట్లాడుతున్న ఆర్జేసీ చంద్రశేఖర్‌ ఆజాద్‌, ఏడీసీ రామచంద్రమోహన్‌, డీసీ చంద్రశేఖర్‌రెడ్డి, ఏసీ మహేశ్వరరెడ్డి, తహసీల్దార్‌ సీతామహాలక్ష్మి

నెహ్రూనగర్‌(గుంటూరు), న్యూస్‌టుడే: దేవాదాయ శాఖకు చెందిన ఆలయాల ఆస్తులను పరిరక్షించాలని ఆ శాఖ అదనపు కమిషనర్‌ (ఏడీసీ) రామచంద్రమోహన్‌ అన్నారు. సోమవారం కొత్తపేట కార్యాలయంలో గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన అధికారులతో భూముల పరిరక్షణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏడీసీ రామచంద్రమోహన్‌ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియలో భాగంగా దేవాదాయ శాఖకు చెందిన భూములను ఆలయాల అధికారులు సర్వే చేయించాలన్నారు. ఇప్పటికే ప్రతి మండలానికి ఒక పర్యవేక్షణాధికారిని నిర్వహింమించినట్లు తెలిపారు. తమ మండలంలో ఆలయాలకు చెందిన భూముల జాబితాను ముందుగానే సిద్ధం చేసి సంబంధిత తహసీల్దార్‌కు అందించాలన్నారు. సర్వే సమయంలో ఆర్‌ఎస్‌ఆర్‌ ప్రకారం ప్రాపర్టీ దస్త్రాలతో సరిచూసి భూములను గుర్తించి కాపాడాలన్నారు. ప్రాంతీయ సంయుక్త కమిషనర్‌ (ఆర్జేసీ) చంద్రశేఖర్‌ ఆజాద్‌ మాట్లాడుతూ తహసీల్దార్‌ సర్వేకు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఆలయాల అధికారులు క్షేత్ర స్థాయిలో హాజరై ఆయా భూముల కొలతలు దగ్గరుండి పరిశీలించాలన్నారు. కొలతలు ముగిసిన తర్వాత హద్దురాళ్లు ఏర్పాటు చేయాలన్నారు. దేవాదాయ శాఖకు చెందిన ఒక్క గజం భూమి కూడా ఆక్రమణకు గురికాకుండా కాపాడాలని ఆదేశించారు. ఆలయాల్లో దర్శనం, పూజలు, అర్చనలు తదితర టిక్కెట్లు అన్నీ ఆన్‌లైన్‌లోనే ఇవ్వాలని, మ్యాన్యువల్‌గా వినియోగించ కూడదని స్పష్టం చేశారు. శివరాత్రి పర్వదినం సమీపిస్తుండటంతో భక్తులకు అసౌకర్యం కలకుండా వసతుల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో తహసీల్దార్‌ సీతామహాలక్ష్మి, గుంటూరు జోన్‌ ఉపకమిషనర్‌(డీసీ) ఈమని చంద్రశేఖర్‌రెడ్డి, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సహాయ కమిషనర్లు(ఏసీ) మహేశ్వరెడ్డి, సత్యనారాయణరెడ్డి, పానకాలరావు, మాధవి, శ్రీనివాసరెడ్డి, మాలకొండ ఏసీ కేబీ శ్రీనివాస్‌, గుంటూరు లాలాపేట వెంకటేశ్వరస్వామి ఆలయ ఏసీ శ్రీనివాస్‌, ఐదు జిల్లాల ఇన్‌స్పెక్టర్లు, కార్యనిర్వహణాధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని