logo

సరి చేశామంటున్న తప్పులే!

బదిలీల్లో ఉపాధ్యాయులకు అసౌకర్యం తప్పడం లేదు. ప్రక్రియ నిర్వహణకు సరిపడా సమయం ఇవ్వకపోవడం, మరోవైపు ఖాళీల వివరాలు తప్పుల తడకగా విద్యాశాఖ విడుదల చేయటంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

Published : 07 Jun 2023 04:32 IST

మరికొంత సమయం ఇవ్వాలని వినతి
ఆందోళనలో ఉపాధ్యాయులు
వెబ్‌ ఐచ్ఛికాలకు సైట్‌ కలవక సతమతం
ఈనాడు, అమరావతి

గుంటూరులో వెబ్‌ ఐచ్ఛికాలు నమోదు చేసుకుంటున్న ఉపాధ్యాయులు

బదిలీల్లో ఉపాధ్యాయులకు అసౌకర్యం తప్పడం లేదు. ప్రక్రియ నిర్వహణకు సరిపడా సమయం ఇవ్వకపోవడం, మరోవైపు ఖాళీల వివరాలు తప్పుల తడకగా విద్యాశాఖ విడుదల చేయటంతో ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పాఠశాలల పునఃప్రారంభం నాటికే బదిలీల క్రతువు ముగించాలని ప్రభుత్వం హడావిడి చేస్తోంది. సాంకేతిక అంశాలతో ముడిపడిన వ్యవహారాలు కావటంతో సర్వర్‌ కలవక, సకాలంలో వెబ్‌ ఐచ్ఛికాలు ఇచ్చుకోవటానికి సైట్‌ తెరుచుకోక నానా అవస్థలు పడుతున్నారు. తప్పనిసరిగా బదిలీ అయ్యే స్కూల్‌ అసిస్టెంట్లు, సెకండరీ గ్రేడ్‌ టీచర్లు వారి ర్యాంకు వచ్చే దాకా కొన్ని వేల ఐచ్ఛికాలు ఇచ్చుకోవాల్సి ఉంది. వీటి నమోదులో ఏమైనా విద్యుత్తు అంతరాయం కలిగినా, సాంకేతిక సమస్యలు వచ్చినా అప్పటి వరకు నమోదు చేసిన సమాచారం సేవ్‌ కాకపోవడం ప్రతికూలమవుతుందని వాపోతున్నారు. ప్రధానోపాధ్యాయులకు సోమ, మంగళవారం మాత్రమే ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించారు. సోమవారం సాయంత్రం నుంచే సైట్‌ ఓపెన్‌ అయింది. అంటే వారికి మిగిలింది కేవలం ఒక రోజు మాత్రమే. ఆ వ్యవధిలో ఎలా ఆప్షన్లు ఇచ్చుకోగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం రాత్రితో ఐచ్ఛికాల గడువు ముగిసింది. నిర్దేశిత సమయంలోపు ఆప్షన్లు ఇచ్చుకోవటానికి సర్వర్‌పై బాగా రద్దీ పడి చాలా సమయం తీసుకుందని చెప్పారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల పరిధిలో సుమారు ఆరేడు వేల మంది ఉపాధ్యాయులు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో కచ్చితంగా తప్పనిసరి బదిలీలు అయ్యేవారు సుమారు 2 వేల వరకు ఉంటారని అంచనా.

స్కూల్‌ అసిస్టెంట్ల ఖాళీల్లో..

స్కూల్‌ అసిస్టెంట్లకు మంగళవారం నుంచి ఐచ్ఛికాలు ఇచ్చుకోవాలి. ఆ ప్రక్రియలో భాగంగా కొందరు ఉపాధ్యాయులు సైట్‌ ఓపెన్‌ చేస్తే స్కూల్‌ అసిస్టెంట్ల ఖాళీల్లో ఎస్‌జీటీ ఖాళీలు కనిపించటంతో కంగుతిన్నారు. ఈ తప్పిదాన్ని సంఘాలు గుర్తించి డీఈవో, ఇతర అధికారుల దృష్టికి తీసుకెళ్తే సరిచేస్తామని చెప్పారు తప్ప వాటిని ఉన్నతాధికారుల అనుమతి తీసుకుని సాయంత్రం వరకు వేచి చూసినా తొలగించలేదని ఉపాధ్యాయులు వాపోయారు. ఒకవైపు తాము ఐచ్ఛికాలే ఇచ్చుకోవాలా? జాబితాలో తప్పులు సరిచేయాలని వినతులే ఇచ్చుకోవాలా అర్థం కాకుండా ఉన్నామంటున్నారు. ఉమ్మడి గుంటూరు వ్యాప్తంగా పలు పాఠశాలల ఖాళీ పోస్టుల వివరాల్లో తప్పులు దొర్లాయని కొన్నిచోట్ల పోస్టులు హెచ్‌ఎంలకు తెలియకుండానే బ్లాక్‌ చేశారని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. స్కూల్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లోనూ బ్లాక్‌ చేసినట్లు వస్తోంది. సత్తెనపల్లి మండలం రెంటపాళ్ల, శావల్యాపురం జడ్పీ ఉన్నత పాఠశాలల్లో బ్లాక్‌ చేసినట్లు గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఇలా అనేక స్కూళ్లల్లో బ్లాక్‌ చేయటంపై టీచర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది.

తప్పిదాలు  ఇలా..

* కొందరు ఎల్‌ఎఫ్‌ఎల్‌ హెచ్‌ఎంలు సబ్జెక్టు కన్వర్షన్‌ ఇచ్చారు. అయితే వారు తప్పనిసరి బదిలీలు పెట్టుకోవాల్సి ఉన్నా రిక్వెస్టు బదిలీలు పెట్టారు. వాటిని డీఈవో యంత్రాంగం గుర్తించలేదు. యధావిధిగానే జాబితాలు వదిలేయటంతో ప్రస్తుతం వారు గతంలో చేసిన పాఠశాలల్లో ఖాళీలు డిస్‌ప్లే అవుతున్నాయి. వాటిని తొలగించాలని సూచించారు.
* కేటగిరి 1, 2లో ఎక్కువ బ్లాక్‌ చేస్తున్నారు. అలా కాకుండా 3, 4 కేటగిరీల్లోనూ బ్లాక్‌ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది. ఇది సరిచేయాలని కోరుతున్నారు. గత ఐదేళ్ల నుంచి సత్తెనపల్లి మండలంలోని ఓ పాఠశాలలో ఇంగ్లిషు-2వ పోస్టు బ్లాక్‌ చేసి ఉంచుతున్నారు. ఆ పోస్టు ఎప్పటికీ భర్తీ కాదని హెచ్‌ఎం తెలిపారు.
* సరిచేసి ఖాళీల జాబితా పెడుతున్నామని చెబుతున్నా పాత తప్పిదాలే పునరావృతమవుతున్నాయని కమిషనర్‌ సైట్లో ఒకలా డీఈవో కార్యాలయం సైట్లో మరోలా ఖాళీల జాబితా ఉంటోందని గుర్తు చేశారు.
* తప్పనిసరి బదిలీ అయ్యేవారు ఎస్‌జీటీలో సుమారు 3 వేలకు పైగా ఆప్షన్లు ఇచ్చుకోవాలి. ఈ దృష్ట్యా ఒక రోజు గడువు పెంచాలని కోరుతున్నారు.
* స్కూల్‌ అసిస్టెంట్లు తప్పనిసరి బదిలీ అయ్యేవారు 300, 400 వరకు రిక్వెస్టులు అయితే వంద వరకు ఐచ్ఛికాలు ఇచ్చుకోవాల్సి ఉన్న దృష్ట్యా వీరు సమయం పెంచాలని కోరుతున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు