logo

కోతలే... కోతలు...

ఉమ్మడి గుంటూరు జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. దీనికితోడు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వేడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు శీతల యంత్రాలు (ఏసీలు) విరివిగా వినియోగిస్తున్నారు.

Published : 10 Jun 2023 05:19 IST

గురువారం రాత్రి 10 గంటల సమయంలో విద్యుత్తు అంతరాయాలకు నిరసనగా వేమూరు ఉపకేంద్రం ఎదురుగా ఆర్‌అండ్‌బీ రోడ్డుపై స్థానికుల రాస్తారోకో

ఈనాడు-గుంటూరు:ఉమ్మడి గుంటూరు జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 44 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. దీనికితోడు వడగాల్పుల తీవ్రత ఎక్కువగా ఉండటంతో వేడి నుంచి ఉపశమనం పొందడానికి ప్రజలు శీతల యంత్రాలు (ఏసీలు) విరివిగా వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్తు వినియోగం గణనీయంగా పెరిగింది. గురువారం రికార్డుస్థాయిలో 1087 మెగావాట్లకు డిమాండ్‌ చేరింది. విద్యుత్తు వినియోగం పెరిగేకొద్దీ ఆయా నియంత్రికలు(ట్రాన్స్‌ఫార్మర్లు), కండక్టర్‌(తీగలు)పై ఒత్తిడి పెరిగి సెక్షన్ల పరిధిలో ఫ్యూజులు పోతున్నాయి. వీటివల్ల విద్యుత్తు సరఫరాలో అంతరాయాలు పెరుగుతున్నాయి. సాధారణంగా 15 నుంచి 16 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు వినియోగంతో 750 మెగావాట్ల డిమాండ్‌ ఉంటుంది. ఎండలు పెరగడంతో ఏప్రిల్‌ నెలలో 930 మెగావాట్ల వినియోగం ఉండగా మే నెలలో గరిష్ఠంగా 1004 మెగావాట్లకు చేరింది. జూన్‌ నెలలో గురువారం 1087 మెగావాట్ల వినియోగం రికార్డయింది. ఇప్పటివరకు ఇదే జిల్లాలో అత్యధిక వినియోగం. 

రోజుకు 2.10 కోట్ల యూనిట్లు

ఉమ్మడి జిల్లాలో విద్యుత్తు వినియోగం ఎంత పెరిగినా 1.90 కోట్ల యూనిట్ల వరకు వినియోగం ఉండేది. ఈ వేసవిలో రికార్డు స్థాయిలో రోజుకు 2.10 కోట్ల యూనిట్ల విద్యుత్తును వినియోగదారులు వాడుకుంటున్నారు. మండుతున్న ఎండలు, వేడిగాలుల తీవ్రత నుంచి   ఉపశమనం కోసం ప్రజలు విద్యుత్తు ఛార్జీలను సైతం లెక్కచేయకుండా వాడుతున్నారు. దీంతో విద్యుత్తు నియంత్రికలు, డిస్ట్రిబ్యూషన్‌ బాక్సులు వద్ద సాంకేతిక సమస్యలతో ఫ్యూజులు పోతున్నాయి. సాధారణ రోజులతో పోల్చితే అధికంగా ఫ్యూజులు పోతున్నాయి. గుంటూరు నగరంలో రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున రెండు గంటల వరకు ఫ్యూజులు పోయి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. అంతరాయం కలిగితే సిబ్బంది అక్కడికి వెళ్లి సరఫరా పునరుద్ధరించడానికి ఉపకేంద్రం(సెక్షన్‌) నుంచి దూరాన్ని బట్టి 10 నిమిషాల నుంచి 30 నిమిషాల సమయం పడుతోంది. సరఫరా ఆగిపోతే శీతల యంత్రాలు పని చేయనందున ప్రజలు రాత్రివేళ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంటూరు నగరం పరిధిలో 14, గ్రామీణ సెక్షన్‌ కలిపితే 15 సెక్షన్లు ఉన్నాయి. వీటి పరిధిలో రాత్రివేళ రోజు 300లకు పైగా ఫ్యూజులు పోతున్నాయి. ఇందులోనూ శివారు కాలనీలు, పాతగుంటూరు, ఏటీ అగ్రహారం, గోరంట్ల, అంతర వలయ రహదారి, ఏటుకూరురోడ్డు తదితర ప్రాంతాల్లో ఎక్కువగా సమస్యలు వస్తున్నాయి. 100కేవీ సామర్థ్యం ఉన్న నియంత్రిక పరిధిలో 80 కేవీ వరకు వినియోగం ఉండాల్సి ఉండగా అది 120 కేవీ వరకు పెరగడంతో ఇబ్బందులు వస్తున్నాయని ఆశాఖ సిబ్బంది చెబుతున్నారు. వారం రోజుల వ్యవధిలో నగరంలో 100 కేవీలు అదనంగా 18 అమర్చగా మరో 15 అమర్చేందుకు సిద్ధమయ్యారు. జిల్లా వ్యాప్తంగా రాత్రివేళ 1700లకుపైగా ఫిర్యాదులు ఆయా కార్యాలయాలకు వస్తున్నాయి.

గ్రామాల్లో గంటల పాటు అంతరాయం

ఈదురుగాలులతో కూడిన జల్లులు పడుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో వృక్షాలు కూలి విద్యుత్తు తీగలపై పడుతున్నాయి. 33కేవీ తీగలపై చెట్లు పడి సరఫరాకు అంతరాయం కలిగితే పునరుద్ధరించడానికి 20గంటలకుపైగా సమయం పడుతోంది. ఒకే ప్రాంతంలో పెద్దఎత్తున చెట్లు పడి స్తంభాలు పడిపోగా కొన్నిచోట్ల విరిగిపోతున్నాయి. వినుకొండ నియోజకవర్గంలో సుడిగాలులు రావడంతో విద్యుత్తు వ్యవస్థకు నష్టం వాటిల్లింది. ఇక్కడ సరఫరా పునరుద్ధరించడానికి ఎక్కువ సమయం పట్టింది. అదేవిధంగా వేమూరు మండలంలో సరఫరా వెంటనే పునరుద్ధరించకపోవడంతో స్థానికులు ఆందోళన చేశారు. వారం రోజుల వ్యవధిలో ఉమ్మడి జిల్లాలో 160 స్తంభాలు గాలులకు దెబ్బతిన్నాయి. రాత్రివేళ చెట్లు పడిపోతే ఉదయం వరకు సరఫరా పునరుద్ధరించలేని పరిస్థితి. రాత్రివేళ విద్యుత్తు లేకుంటే ఇంట్లో ఉంటే ఉక్కపోత.. ఆరుబయట దోమల మోతతో అల్లాడిపోతున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినా గంటల తరబడి సరఫరాకు అంతరాయం కలిగితే ఎలా అని వారు సిబ్బందిని నిలదీస్తున్నారు.

ఐటీ ఇంజినీర్లకు ఇబ్బందులు

ఉమ్మడి జిల్లాలో ఐటీ ఇంజినీర్లు ఇంటి నుంచి పని చేస్తున్నారు. మారుమూల గ్రామాలకు సైతం అంతర్జాలం అందుబాటులోకి రావడంతో పల్లెల్లోనే కొందరు పని చేస్తున్నారు. ఈక్రమంలో రాత్రివేళ విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగితే వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా కార్యాలయాలకు ఫోన్లు చేసి సరఫరా పునరుద్ధరణకు ఎంత సమయం పడుతుందని ఆరా తీస్తున్నారు. ఇంటి నుంచి పనిచేసే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడి విద్యుత్తు అంతరాయాలతో సమస్యలు వస్తున్నాయని వారు చెబుతున్నారు. అధికారికంగా కోతలు తెలియజేయకుండా గంటల తరబడి అంతరాయం కలగడం వారికి ఇబ్బందికరంగా మారింది. ఈ విషయమై గుంటూరు పర్యవేక్షక ఇంజినీరు మురళీకృష్ణయాదవ్‌ మాట్లాడుతూ డిమాండ్‌కు సరిపడా సరఫరా ఉన్నందున కోతలు అమలుచేయలేదన్నారు. సాంకేతిక సమస్యలతో సరఫరాలో ఇబ్బందులు ఉన్నాయని, వీలైనంత తొందరగా సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని