logo

నిబంధన.. పాటించకుంటే దండన

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) అమల్లోకి వచ్చింది. దీన్ని ఎన్నికల సంఘం చూస్తుంది. జిల్లాలో కలెక్టర్‌ పర్యవేక్షిస్తుంటారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఉద్యోగులు ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తారు.

Updated : 29 Mar 2024 05:11 IST

అమల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి
న్యూస్‌టుడే, నెహ్రూనగర్‌(గుంటూరు)

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌) అమల్లోకి వచ్చింది. దీన్ని ఎన్నికల సంఘం చూస్తుంది. జిల్లాలో కలెక్టర్‌ పర్యవేక్షిస్తుంటారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు, ఉద్యోగులు ప్రవర్తనా నియమావళి పరిధిలోకి వస్తారు. అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. తనిఖీల కోసం ప్రత్యేక బృందాలను నియమించారు. ప్రవర్తనా నియమావళి కింద ఎవరెవరు ఏం చేయవచ్చు? ఏం చేయకూడదు? ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి తదితర అంశాలపై ‘న్యూస్‌టుడే’ కథనం.

చేయకూడనివి..

  • కులం, మతం, ప్రాంతం, వర్గ, జాతి భేదాలు వంటి సున్నితమైన అంశాలతో ప్రచారం చేయకూడదు.
  • మతపరమైన ప్రార్థనా మందిరాల్లో ప్రచారం చేయరాదు.
  • ప్రజా జీవితానికి ఇబ్బంది కలిగేంచేలా ఊరేగింపుతో వెళ్లరాదు.
  • అనుమతి ఉన్న వాహనాల్లో మాత్రమే ప్రచారం చేయాలి. ఇందులో అయిదుగురు కంటే ఎక్కువ మంది ప్రయాణించరాదు.
  • ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రచారం చేయరాదు. ప్రభుత్వ మైదానాల్లో అనుమతి లేకుండా ప్రచారం చేయకూడదు.
  • నామినేషన్‌ సమయంలో 3 వాహనాల్లో మాత్రమే రావాలి. రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల లోపుగా వాహనాల్లో రావచ్చు..
  • నామినేషన్‌ సమయంలో అయిదుగురికి మాత్రమే అనుమతిస్తారు.
  • ప్రైవేటు భవనాలపై, మైదానంలో ప్రచారం చేసేందుకు ఇంటి, స్థల యజమాని, ఎన్నికల అధికారి అనుమతి ఉండాలి.
  • అభ్యర్థి ప్రచారానికి టోపీలు, మాస్క్‌లు వగైరా ఇవ్వొచ్చు.
  • ప్రచారంలో మద్యం పంపిణీ నిషేధం.
  • సభలు, సమావేశాలు, ప్రదర్శనలు పోలీసులు/ఆర్‌వో అనుమతి తీసుకోవాలి.
  • పోలింగ్‌ రోజున ఓటర్ల రవాణాకు ఎలాంటి వాహనాలను ఉపయోగించరాదు.
  • ఎన్నికల ఫలితాలపై సర్వేలు, ఎగ్జిట్‌ పోల్స్‌ వంటివి నిషేధం.
  • పోలింగ్‌ స్టేషన్లలోకి అభ్యర్థికి, ఎన్నికల ఏజెంటుకు, పోలింగ్‌ ఏజెంట్లకు మాత్రమే అనుమతి ఉంది. క్రమ శిక్షణ లేకుండా ప్రవర్తించరాదు.
  • ఓటు కోసం లంచం ఇవ్వడం, ప్రలోభపెట్టడం చేయరాదు.
  • ఎన్నికల సంఘం నిర్ణయించిన దాని కన్నా ఎన్నికల వ్యయం ఉండకూడదు.
  • పోలింగ్‌ స్టేషన్‌లోకి అక్రమంగా ప్రవేశించడం, ఈవీఎం ఇతర రికార్డులను తొలగించటం చేయరాదు.
  • రహస్య ఓటింగ్‌ పద్ధతికి భంగం కలిగించరాదు.
  • ఎన్నికల ప్రచారంలో ప్రజల మధ్య శత్రుత్వం పెరిగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదు.
  • ఇతరుల సభలు, సమావేశాలకు భంగం కలిగించరాదు.
  • కరపత్రాలు, పోస్టర్లు వంటి వాటిపై నియంత్రణ ఉండాలి.
  • ఎన్నికలకు సంబంధించి తప్పుడు ప్రకటనలు ఇవ్వకూడదు.
  • నిషేధిత ప్రాంతాల్లో సభలు, సమావేశాలు పెట్టకూడదు.
  • ప్రదర్శనలతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించకూడదు.
  • పెయిడ్‌ న్యూస్‌కు అనుమతి లేదు.
  • తాత్కాలిక, శాశ్వత ఉద్యోగ నియామకాలు చేయరాదు.
  • ఎంసీసీ అమలులో ఉన్నపుడు అధికారులను సమీక్షలకు, సమావేశాలకు ప్రజాప్రతినిధులు పిలవకూడదు.
  • పోలింగ్‌ రోజున ప్రజాప్రతినిధులు పోలింగ్‌ ఏజెంట్లుగా ఉండకూడదు.

  • పోలింగ్‌ ముగింపునకు 48 గంటల ముందుగా అన్ని రకాల ప్రచారాలు ఆపివేయాలి.
  • రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు లౌడ్‌ స్పీకర్లు వినియోగించరాదు.

ఇవి చేయవచ్చు...

  • కరవు నివారణ పనులు చేపట్టవచ్చు. కరవు ప్రాంతాలకు ఆహారం, గడ్డి సరఫరా చేయవచ్చు.
  • కోర్టు ఆర్డరు ఉన్న ఉద్యోగ నియామకాలు చేయవచ్చు.
  • కేంద్ర ఎన్నికల సంఘం అనుమతితో మంచినీటి సరఫరా చేయవచ్చు.
  • ఖైదీల విడుదల, గిట్టుబాటు ధరల నిర్ణయం ఈసీ అనుమతితో చేయవచ్చు.
  • పబ్లిక్‌ మైదానాలను సభలు, సమావేశాలకు ప్రభుత్వ అనుమతితో వినియోగించుకోవచ్చు. మొదట వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వాలి.
  • ప్రత్యర్థి పార్టీ విధి, విధానాలను విమర్శించుకోవచ్చు.
  • ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా ముందస్తు అనుమతితో ఊరేగింపులు, ర్యాలీలు చేయవచ్చు.

విస్తృత తనిఖీలకు అధికారం..

న్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో అధికారులకు తనిఖీలు చేసే విస్తృతమైన అధికారం ఉంది. వాహనాలను నిలిపి పూర్తిగా తనిఖీ చేయచ్చు. దీనికి అభ్యంతరం పెట్టే అధికారం ఎవరికీ లేదు. వాహనాల్లో నిషేధిత వస్తువులు ఉంటే.. స్వాధీనం చేసుకుంటారు. పరిమితికి మించి.. లెక్కలు చెప్పని డబ్బు, మద్యం ఉంటే వాహనంతో సహా సీజ్‌ చేస్తారు. సంబంధిత వ్యక్తులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని