logo

ఇదేమి చోద్యం జగన్‌!

విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు

Published : 24 Apr 2024 07:01 IST

బైపాస్‌ను నేరుగా హైవేలో కలిపేస్తారా?
విజయవాడ-గుంటూరు నడుమ రాకపోకల్లో గందరగోళం
2025 నుంచి సర్వీస్‌ రోడ్లు, సందుల్లోంచి వెళ్లాల్సిందే
ట్రంపెట్‌ ఇంటర్‌ ఛేంజ్‌ నిర్మాణం చేపట్టని ఎన్‌హెచ్‌ఏఐ 
     

ఈనాడు - అమరావతి: విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు శివారు ప్రాంతాలను కలిపితే జనాభా 30 లక్షలకుపైనే. ఈ రెండు నగరాల మధ్య జాతీయ రహదారి మీదుగా నిత్యం కొన్ని వేల వాహనాలు సులువుగా రాకపోకలు సాగిస్తున్నాయి. కానీ సరిగ్గా ఏడాది తర్వాత నుంచి వాహనదారులకు కష్టాలు మొదలు కానున్నాయి. కారణం కొత్తగా నిర్మిస్తున్న విజయవాడ బైపాస్‌ రహదారిని చెన్నై - కోల్‌కతా హైవేకు నేరుగా కలిపేస్తుండడమే. వాహనాలు ఏ దిశలోనైనా సులువుగా వెళ్లేలా ‘ట్రంపెట్‌ ఇంటర్‌ ఛేంజ్‌’ను నిర్మించకపోవడమే.
జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) కాజ నుంచి చినఆవుటపల్లి వరకు నిర్మిస్తున్న విజయవాడ బైపాస్‌ రహదారి.. చెన్నై-కోల్‌కతా హైవే (ఎన్‌హెచ్‌-16)లోని కాజ టోల్‌ప్లాజా దాటాక మొదలవుతోంది. ఆ రెండు రహదారులు కలిసేచోట వాహనదారులు సులువుగా ఏ దిశలోనైనా వెళ్లేలా ‘ట్రంపెట్‌ ఇంటర్‌ ఛేంజ్‌’ నిర్మించాల్సి ఉంది. కానీ, బైపాస్‌ రోడ్డును ప్రస్తుత హైవేలో నేరుగా కలిపేస్తుండడం గమనార్హం.

కోల్‌కతా-చెన్నై హైవేలో కొత్తగా నిర్మిస్తున్న విజయవాడ రోడ్‌ కలిసేది ఇక్కడే

ఎర్ర గీత:

గుంటూరు నుంచి విజయవాడకు వెళ్లాలంటే కాజా టోల్‌ప్లాజా దాటాక మొదలయ్యే సర్వీస్‌రోడ్‌లో 2 కి.మీ. ప్రయాణించి, కొత్తగా నిర్మించే విజయవాడ బైపాస్‌ పక్క నుంచి స్లిప్‌ రోడ్‌లోకి మారాలి. 0.5 కి.మీ. ప్రయాణించి హాయ్‌ల్యాండ్‌ రోడ్‌లోకి వెళ్లాలి. అక్కడ ఆర్వోబీ వద్ద కుడివైపునకు తిరిగి 200 మీటర్లు ప్రయాణించి, మళ్లీ విజయవాడ వైపు సర్వీసు రోడ్‌లో 1.6 కి.మీలు ముందుకెళ్తే హైవే ఎక్కగలరు.

నీలం గీత:

విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేవారు జనసేన పార్టీ కార్యాలయం సమీపంలో సర్వీస్‌ రోడ్‌లోకి వెళ్లి 3.3 కి.మీ. ప్రయాణించి, కాజా టోల్‌ప్లాజాకు కి.మీ. ముందు హైవేలో కలవాలి.

ఆకుపచ్చ గీత:

తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల వారు కొత్తగా నిర్మించే విజయవాడ బైపాస్‌లోకి వెళ్లాలంటే జనసేన కార్యాలయం సమీపంలో సర్వీస్‌ రోడ్‌లోకి వెళ్లి 2.8 కి.మీ. ప్రయాణించి, వెంకటరెడ్డిపాలెం వద్ద అండర్‌పాస్‌లో యూటర్న్‌ తీసుకోవాలి. మళ్లీ అటువైపు సర్వీసు రోడ్‌లో 600 మీటర్లు ప్రయాణించాక హైవేలోకి చేరుకోవాలి.


రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు పట్టదు?

  •  విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు తాడేపల్లి నుంచి ఏఎన్‌యూ వరకు హైవేకిరువైపులా జనావాసాలు వృద్ధి చెందుతున్నాయి. జగన్‌ ప్రభుత్వం రాజధాని పనులు అడ్డుకోకపోయి ఉంటే వృద్ధి గణనీయంగా ఉండేది.
  • చెన్నై-కోల్‌కతా హైవేతో విజయవాడ బైపాస్‌ రోడ్డు కలిసే కూడలి అత్యంత కీలక ప్రాంతంలో ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్‌హెచ్‌ఏఐకి విన్నవించి ఇక్కడ ట్రంపెట్‌ ఇంటర్‌ ఛేంజ్‌కు నిధులు రాబట్టడం కష్టమేమీ కాదు. ఇక్కడికి సమీపంలోనే క్యాంప్‌ కార్యాలయంలో సీఎం జగన్‌, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాల్లో పలువురు మంత్రులు నివాసముంటున్నారు. వారెవరికీ ఈ సమస్యపై అవగాహన ఉన్నట్టు లేదు.

ఏనాడైనా మంత్రి సమీక్షించారా?

  • ఆర్‌అండ్‌బీ మంత్రి దాడిశెట్టి రాజా ఏనాడూ జాతీయ రహదారులపై ప్రాజెక్టుల వారీగా సమీక్షించిన దాఖలా లేదు. ఆ శాఖ కార్యదర్శికీ సమస్య పట్టినట్టు లేదు. చెన్నై-కోల్‌కతా హైవేను రెండు దశాబ్దాల కిందట విస్తరించినప్పుడు విజయవాడ-గుంటూరు మధ్య అనేక గ్రామాలు, ముఖ్య కూడళ్ల వద్ద ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించారు. నాటి శ్రద్ధ నేడు లోపించింది. అమరావతిపై కోపంతో జగన్‌ దాన్ని సర్వనాశనం చేస్తుంటే.. ఇందుకు వంత పాడినట్లుగా ఉంది ఎన్‌హెచ్‌ఏఐ తీరు.
  • ఇప్పటికే అమరావతి-అనంతపురం హైవేకు టెండర్లు పిలిచాక, రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందంటూ ఎన్‌హెచ్‌ఏఐ దాన్ని పక్కన పడేసింది. బదులుగా కొడికొండ చెక్‌పోస్టు నుంచి పులివెందుల నియోజకవర్గం మీదుగా మేదరమెట్ల దాటాక ముప్పవరం వరకు నిర్మాణం చేపడుతోంది. దాన్నే బెంగళూరు-విజయవాడ హైవేగా భ్రమింపజేస్తోంది.

అంతా గందరగోళం..

గుంటూరు నుంచి విజయవాడ వెళ్లే వాహనాలు బైపాస్‌ ఆనుకుని ఉండే ఈ స్లిప్‌ రోడ్‌లోకే వెళ్లాల్సి ఉంటుంది..

గుంటూరు నుంచి విజయవాడ వెళ్లాలంటే.. కాజ టోల్‌ప్లాజా దాటాక ప్రస్తుత హైవేపై నేరుగా సాధ్యం కాదు. నిత్యం వందల వాహనాలు దాదాపు 3.6 కి.మీ. సర్వీస్‌ రోడ్‌లో, 700 మీటర్ల దూరం ఇరుకు స్లిప్‌ రోడ్డు, హాయ్‌ల్యాండ్‌ రోడ్డులో ప్రయాణించి హైవే ఎక్కాలి. మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాలకు చెందినవారు.. విజయవాడ బైపాస్‌ రోడ్డులోకి వెళ్లాలన్నా సందుల్లోంచి తిరగాల్సిందే. పెరిగిన జనాభాతో హాయ్‌ల్యాండ్‌ మార్గం రద్దీగా మారింది. ఇకపై ఆ మార్గంలో రోజూ వేల వాహనాలు తిరుగుతుంటే స్థానికులకూ ఇబ్బంది తప్పదు. ఎక్కడైనా కొత్తగా రోడ్డు వేస్తుంటే ప్రయాణం సులువు కావాలి. కానీ, మరింత సంక్లిష్టం చేయడమేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి.

  • ఎన్‌హెచ్‌ఏఐ నిర్వాకం వల్ల కోల్‌కతా-చెన్నై హైవేలో, విజయవాడ బైపాస్‌ కలిసేచోట ఇప్పుడున్న సర్వీసు రోడ్లు, వివిధ మార్గాలను బట్టి వాహనదారులు గందరగోళానికి గురయ్యే ఆస్కారముంది.

ఇలా చేయొచ్చు..

  • ఖర్చు తగ్గించుకోవడానికే ట్రంపెట్‌ ఇంటర్‌ ఛేంజ్‌ నిర్మించడం లేదన్నది ఎన్‌హెచ్‌ఏఐ వర్గాల వాదన. అలాంటప్పుడు బైపాస్‌ రోడ్డుకు కొనసాగింపుగా ఫ్లైఓవర్‌ నిర్మించి హైవేకు కలపొచ్చు. దీంతో బైపాస్‌ రోడ్డులోకి వెళ్లేవారు దానిమీదుగా, విజయవాడ-గుంటూరు మధ్య ప్రయాణించేవారు ఫ్లైఓవర్‌ కింది నుంచి వెళ్లొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని