logo

తెదేపా నేత కారుకు నిప్పు

ఈపూరు మండలం ముప్పాళ్ల మాజీ సర్పంచి, తెదేపా నేత మోదుగుల నరసింహారావు కారును గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం వేకువన తగులబెట్టారు. గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం నరసరావుపేట వెళ్లి వచ్చి ఖాళీ ప్రదేశంలో కారు నిలిపి ఇంట్లో నిద్రపోయారు.

Published : 08 May 2024 06:11 IST

మంటల్లో కారు

ఈపూరు, న్యూస్‌టుడే : ఈపూరు మండలం ముప్పాళ్ల మాజీ సర్పంచి, తెదేపా నేత మోదుగుల నరసింహారావు కారును గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం వేకువన తగులబెట్టారు. గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన అనంతరం నరసరావుపేట వెళ్లి వచ్చి ఖాళీ ప్రదేశంలో కారు నిలిపి ఇంట్లో నిద్రపోయారు. గుర్తుతెలియని వ్యక్తులు కారు డిక్కీ పైకి లేపి పెట్రోలు పోసి నిప్పంటించి వెళ్లిపోయారు. పెద్ద మంటలు రేగుతుండటంతో చుట్టుపక్కల ఇళ్లల్లో జనం బయటకు వచ్చి చూశారు. అందిన సమాచారం మేరకు వెంటనే అగ్నిమాపకశాఖ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పారు. వినుకొండ గ్రామీణ సీఐ సుధాకర్‌రావు, ఎస్సై మహమ్మద్‌ ఫిరోజ్‌ సిబ్బందితో వచ్చి కాలిపోయిన కారును పరిశీలించి వివరాలు నమోదు చేశారు. క్లూస్‌టీంను రప్పించారు. సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ టీవీ పుటేజీని సేకరించి పరిశీలించగా అందులో ఇద్దరు వ్యక్తులు అనుమానంగా సంచరించడాన్ని గుర్తించారు. అనుమానితుల్లో ఒకరు హెల్మెట్‌ ధరించి చేతిలో బాటిల్‌ పట్టుకుని కనిపించాడు. వీళ్లే కారును తగులబెట్టి ఉంటారని నిర్ధారణకు వచ్చారు. అయితే సీసీ కెమెరా దృశ్యాలు బ్లర్‌గా ఉండటంతో నిందితులను సరిగా గుర్తించలేకపోయారు. కొద్దిరోజుల్లో కేసు చేధిస్తామని సీఐ సుధాకరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఓ యువకుడిని ఈపూరు  స్టేషన్‌కు తరలించగా వైకాపా నేతలు వచ్చి ఆధారాలు లేకుండా ఎలా తీసుకెళతారని సీఐ సుధాకర్‌రావును ప్రశ్నించారు. పట్టుబట్టి యువకుణ్ని తీసుకెళ్లారు. ఈ సందర్భంగా స్టేషన్‌వద్ద తెదేపా, వైకాపా వర్గాల మధ్య వాగ్వాదం జరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు