logo

జనం భూములపై జగన్‌ కుతంత్రం

ఏపీ భూ హక్కు చట్టంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సామాన్యుల ఆస్తులు దర్జాగా లాక్కునేందుకు జగన్‌ కుట్ర పన్నుతున్నారని, అందుకు మార్గంగా భూ హక్కు చట్టాన్ని ఎంచుకున్నారని గగ్గోలు పెడుతున్నారు. అధికారికంగానే ప్రజల భూములను ఆక్రమించేందుకు జగన్‌ ఈ చట్టాన్ని తీసుకొచ్చారంటున్నారు.

Updated : 08 May 2024 07:23 IST

భూ హక్కు చట్టంతో సామాన్యులకు అవస్థలే
న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(గుంటూరు)

ఏపీ భూ హక్కు చట్టంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సామాన్యుల ఆస్తులు దర్జాగా లాక్కునేందుకు జగన్‌ కుట్ర పన్నుతున్నారని, అందుకు మార్గంగా భూ హక్కు చట్టాన్ని ఎంచుకున్నారని గగ్గోలు పెడుతున్నారు. అధికారికంగానే ప్రజల భూములను ఆక్రమించేందుకు జగన్‌ ఈ చట్టాన్ని తీసుకొచ్చారంటున్నారు. ఇది అమలైతే ప్రభుత్వ, ప్రైవేటు, దేవాదాయ శాఖ ఆస్తులే కాదు... పేదలు, పెద్దలు అనే తేడా లేకుండా ఎవరి ఆస్తినైనా రాజకీయ ప్రమేయంతో అధికారికంగానే దోచేయొచ్చు. ఇప్పటి వరకు ఏదైనా భూమి సమస్య వస్తే అధికార యంత్రాంగం వద్ద పరిష్కారం కాకుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశముంది. జగన్‌ తెచ్చిన కొత్త చట్టంలో న్యాయాధికారాలు సైతం కార్యనిర్వాహక శాఖకు అప్పగించడంతో రెవెన్యూలోని అధికారులే ఆ అధికారాలతో భూమి ఎవరిదనేది నిర్ణయిస్తారు. రాజకీయ ప్రలోభంతో ఎవరైనా ఈ చట్టం ద్వారా నచ్చిన ఆస్తిని తేలిగ్గా కబ్జా చేసేయొచ్చు. చట్టంలో లొసుగులను గుర్తించిన న్యాయవాదులు రెండున్నర నెలల పాటు నిర్విరామంగా ఉద్యమాలు చేస్తూ నిరసన తెలుపుతూనే.. ప్రజలను చైతన్యవంతుల్ని చేసే కార్యక్రమాలు రూపొందించారు. ప్రజలకు భూ హక్కు చట్టం గురించి తెలియజేయాలని న్యాయవాదులంతా ఐక్యంగా పోరాటం చేశారు. దీనిపై న్యాయజిల్లా కోర్టు వద్ద ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న న్యాయవాదులు (పాతచిత్రం)వాదులు ఏమంటున్నారంటే..


రాజ్యాంగ వ్యతిరేక చట్టం

ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు (భూ హక్కు చట్టం) రాజ్యాంగ వ్యతిరేకమైంది. సామాన్యులకు ప్రమాదకరం. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆచరణలోకి రాకూడదు. సెక్షన్‌ 8 ద్వారా ఈ చట్టం వస్తే భూ వివాదం పరిష్కరించే అవకాశం జిల్లా కోర్టు స్థాయిలో తొలగించారు. లోపాలు, హక్కులు ఎవరూ ప్రశ్నించరాదని చట్టంలో ఉంది. దీనిని ఆచరణలోకి రాకుండా ఎన్నికల అనంతరం ఏర్పడిన ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. లేకుంటే చిన్నకమతాలు, రైతులు, రైతు కూలీలకు తీవ్రమైన నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

చిగురుపాటి రవీంద్రబాబు, బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు


సమాజంలో అలజడులు పెరుగుతాయి

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టు వల్ల చిన్నకమతాలు చేసేవారి మధ్య సివిల్‌ కేసులుగా మొదలై పెద్ద తగాదాలుగా మారి క్రిమినల్‌ కేసులవుతాయి. సమాజంలో అలజడులు ఎక్కువవుతాయి. పేదల ఆస్తులను కొందరు అధికార బలంతో స్వాధీనం చేసుకునే అవకాశాలున్నాయి. ఎటువంటి అర్హతలు లేని వారిని ఎంపిక చేసి వారితో తీర్పులు ఇప్పించుకుంటారు. దేశంలో ఎక్కడా చట్టం అమలులోకి రాలేదు. మన రాష్ట్రంలోనే తీసుకొస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆస్తులను టీఆర్‌వో ద్వారా చేజిక్కించుకునే పరిస్థితులున్నాయి. తద్వారా అక్రమాలు మరింతగా పెరిగిపోతాయి.

లావు అంకమ్మచౌదరి, బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు


సామాన్యులకు గడ్డు పరిస్థితి

చిన్నపాటి భూమి ఉన్న వారు.. దానిని కాపాడుకునేందుకు చాలా ఇబ్బందులకు గురయ్యే పరిస్థితి వస్తుంది. రాజకీయ పలుకుబడితో రెవెన్యూ వారిని లొంగదీసుకుని భూములను ఆక్రమించేందుకు అవకాశముంది. టీఆర్‌వోదే తుది నిర్ణయం కావడం, కోర్టుల్లోనూ చర్చించేందుకు అవకాశాలు తొలగించడంతో సామాన్యులు తమకున్న కాస్త భూములను కూడా రాజకీయ నాయకులకు కోల్పోయే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రజలు ఈ చట్టంపై అప్రమత్తంగా ఉండాలి.

ధర్మేంద్ర, న్యాయవాది


రెండు నెలలకు పైగా ఉద్యమించాం

భూ హక్కు చట్టాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు రెండు నెలలకు పైగా ఉద్యమించాం. దీనివల్ల సామాన్యులకు కలిగే నష్టాలు వివరించాం. న్యాయస్థాన అధికారాలు తొలగించి రెవెన్యూకు అప్పగించారు. సర్వే చేస్తే.. ఎవరో ఒకరికి భూమి తక్కువ వస్తుందని కోర్టులను ఆశ్రయిస్తారు. ఇక్కడ కాస్త సమయం పట్టినా పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత సరైన తీర్పు వస్తుంది. కొత్త చట్టం అమల్లోకి వస్తే కనిష్ఠంగా ఏడు రోజులు, గరిష్ఠంగా రెండేళ్ల లోపు వివాదంలో ఉన్న భూమి తమదని ఆస్తిదారుడు నిరూపించుకోవాలి. నిరూపించుకోకపోయినా, రెండేళ్ల లోపు భూమి మాదేనని సంబంధిత వ్యక్తి టీఆర్‌వోకు తెలపకపోయినా అది ప్రభుత్వం కిందకు వెళ్లిపోతుంది.

గురజాల అనురాధ, బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి


న్యాయస్థానానికి  అధికారాలు లేకుండా చేశారు

భూ వివాదాలపై లోవర్‌ కోర్టులకు అధికారాలు లేకుండా చూశారు. ఉన్నత స్థాయిలో ఉన్నవారికే ఈ చట్టం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి. చిన్న చిన్న స్థలాలు, కొద్దిపాటి పొలం ఉన్న సామాన్యులకైతే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. అన్యాయం జరిగాక కోర్టులను ఆశ్రయించినా అధికారాలను రెవెన్యూకు అప్పగించారు. వాటిపై లోవర్‌ కోర్టులకు ఎటువంటి అధికారాలు లేకుండా చేయడం ద్వారా తమకు ఇష్టమైన వారికి భూమిని ఇచ్చేసే దారుణ పరిస్థితులు వస్తాయి.-

కె.అంబిక, న్యాయవాది

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు