logo

నైపుణ్యం చిదిమేశావు.. నైరాశ్యం నింపేశావు!

ప్రపంచం మెచ్చే ప్రతిభా, పాటవాలు కలిగిన యువతను వైకాపా ఆధ్వర్యంలోని జగన్‌ ప్రభుత్వం గుర్తించలేదు. వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేదు. వారికి సరైన ఉద్యోగావకాశాలు కల్పించకుండా ఐదేళ్ల పాలనలో యువశక్తిని నిర్వీర్యం చేసిందనే అపవాదును జగన్‌ సర్కారు మూటగట్టుకుంది.

Updated : 08 May 2024 07:21 IST

మంగళగిరిలో ఐటీ కేంద్రాలకు జగన్‌ పొగ
డెలివరీ బాయ్స్‌గా ఉన్నత విద్యావంతులు
బయట రాష్ట్రాలకు మేధో వలస
ఈనాడు, అమరావతి, న్యూస్‌టుడే, పెదకాకాని, ఎస్వీఎన్‌కాలనీ(గుంటూరు)

ప్రభుత్వ బడుల్లోని విద్యార్థులకు జీఆర్‌ఈ, టోఫెల్‌పై శిక్షణ ఇస్తున్నాం. మన పిల్లలు దేశ, విదేశాల్లో చదివి అక్కడే స్థిరపడతారు.

ఇదీ సీఎం జగన్‌ తరచూ చెప్పే మాటలు.

పాఠశాల విద్య స్థాయిలో జీఆర్‌ఈ, టోఫెల్‌ ఏమిటంటూ విద్యావేత్తలు ముక్కున వేలేసుకుంటున్నారు. కీలకమైన డిగ్రీ, బీటెక్‌ విద్యార్థులు జగన్‌ నిర్వాకం వల్ల నైపుణ్యాలు కొరవడి ఉన్నత ఉద్యోగాలకు దూరమయ్యారు.

నైపుణ్యాభివృద్ధి శిక్షణ లేక అవస్థలు: జరీన, బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థిని, పెదకాకాని

ప్రపంచం మెచ్చే ప్రతిభా, పాటవాలు కలిగిన యువతను వైకాపా ఆధ్వర్యంలోని జగన్‌ ప్రభుత్వం గుర్తించలేదు. వారిలో ఉన్న శక్తి సామర్థ్యాలు తెలుసుకోలేదు. వారికి సరైన ఉద్యోగావకాశాలు కల్పించకుండా ఐదేళ్ల పాలనలో యువశక్తిని నిర్వీర్యం చేసిందనే అపవాదును జగన్‌ సర్కారు మూటగట్టుకుంది. యువత ఉపాధి కల్పనకు కీలకమైన పరిశ్రమలను రాష్ట్రం నుంచి తరిమేశారు. కొత్తవి తీసుకురాలేదు. కొత్త ఉద్యోగావకాశాలను సృష్టించడం చేతకాని సీఎం.. ఉన్నవాటిని ధ్వంసం చేయడంలో రికార్డులకెక్కారు. మొత్తంగా యువత బంగారు కలలను చిదిమేశారు. లక్షల మంది తల్లిదండ్రులకు ఆవేదన మిగిల్చారు. డిగ్రీలు, పీజీలు చదివిన యువకులు స్థానికంగా కొలువులు లేక డెలివరీ బాయ్స్‌గా పనిచేస్తున్నారు. యువతులు సూపర్‌మార్కెట్లు, మెడికల్‌ షాపుల్లో పని చేస్తున్న ఉదంతాలు ఇందుకు నిదర్శనం.

చంద్రమౌళిగనగర్‌కు చెందిన శ్రీనివాసరావు ఎంబీఏ చదివారు. సరైన ఉద్యోగం లభించకపోవడంతో జొమాటో డెలివరీ బాయ్‌గా రెండేళ్ల నుంచి పని చేస్తున్నారు. రోజుకు 10 గంటలు పని చేసినా రూ.600 కూడా రావడం లేదు. పెట్రోల్‌ ధరలు పెరగడంతో రోజుకు రూ.200 మాత్రమే మిగులుతున్నాయి. నెల మొత్తం కష్టపడి చేసినా రూ.6వేలు దాటడం లదని ఆయన వాపోయారు. ‘జగన్‌ ప్రభుత్వ నిబంధనలతో బహుళజాతి సంస్థలు రావడం లేదు. తెదేపా హయాంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు వచ్చాయి. ఈ అయిదేళ్లూ చంద్రబాబు ప్రభుత్వం ఉండుంటే మరో సైబరాబాద్‌లా మారేదని’ పేర్కొన్నారు.

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ తరఫున శిక్షణ లేకపోవడంతో ఉద్యోగం తెచ్చుకోవడానికి కష్టపడాల్సి వస్తోంది. చంద్రబాబు హయాంలో శిక్షణ తీసుకున్న విద్యార్థులు వెంటనే ఉద్యోగాలు సాధించారు. ప్రస్తుతం వైకాపా ప్రభుత్వం రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థను నిర్వీర్యం చేసింది. ఫలితంగా బయటి ప్రాంతాల్లో శిక్షణ తీసుకొనే పరిస్థితి ఏర్పడింది.


మంగళగిరిలో వెళ్లగొట్టి...

జగన్‌ ఐదేళ్ల పాలన తలచుకుని కోపంతో యువత రగిలిపోతోంది. ఐదేళ్లలో నిరుద్యోగం బాగా పెరిగిపోయింది. ఉద్యోగాలు, స్వయం ఉపాధిపై కోటి ఆశలతో చదువులు పూర్తి చేసి విద్యాలయాల నుంచి బయటకు రావడమే తప్ప కొలువులు దక్కించుకున్నవారు అరుదనే చెప్పాలి. తన ఐదేళ్ల కాలంలో జగన్‌ ఒక్క కొత్త పరిశ్రమను తేలేదు. ఉమ్మడి గుంటూరులో పరిశీలిస్తే మంగళగిరిని గత తెదేపా ప్రభుత్వం ఐటీకి చిరునామాగా మార్చింది. దేశ, విదేశాలకు చెందిన ఎన్నో ఐటీ కంపెనీలను ఇక్కడకు తీసుకొచ్చింది. వారికి పనిచేసుకునే చక్కటి వాతావరణాన్ని కల్పించింది. కంపెనీల స్థాపనకు అవసరమైన ప్రోత్సాహకాలను అందించింది. దీంతో ఓ స్థాయి కలిగిన ఐటీ కంపెనీలు 20 వరకు అప్పట్లో పనిచేశాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్‌ ఆ కంపెనీలకు ప్రోత్సాహకాలివ్వకపోగా కనీసం నీటి వసతి కల్పనకు ఇబ్బంది పెట్టింది. దీంతో చాలా వరకు ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయాయి. 2.3లక్షల ఉద్యోగాలిచ్చానని సభల్లో జగన్‌ గొప్పలకు పోతారు. ఆయన దృష్టిలో ఉద్యోగాలు అంటే గ్రామ వాలంటీర్లు, సచివాయల కార్యదర్శులనేలా మారింది.

జగన్‌ హయాంలో ఉద్యోగ మేళాలు లేవు. కొలువులూ లేవు. వైఎస్సార్‌ ఉద్యోగ మేళాల పేరుతో చిన్నాచితక సేల్స్‌మెన్‌ ఉద్యోగాలు, మెడికల్‌ రిప్‌లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు వంటివి కొందరికి దక్కాయి. వారికి అత్తెసరు జీతాలిచ్చారు.


తెదేపా హయాంలో ఇలా...

తెదేపా హయాంలో యువత ఉపాధి కల్పనకు అప్పటి సీఎం చంద్రబాబు ఎంతో చొరవ తీసుకున్నారు. ప్రతిభ ఉన్న యువతను గుర్తించి వారికి శిక్షణిస్తే అద్భుతాలు చేస్తారని ప్రభుత్వమే నైపుణ్య శిక్షణ కేంద్రాలు ప్రారంభించింది. నాడు జిల్లాలో 20 నైపుణ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆ శిక్షణ ఓ ఉద్యమంలా సాగింది. కళాశాలలు, పరిశ్రమలకు ఒప్పందాలు ఉండేవి. పరిశ్రమల అవసరాలేమిటో ముందుగానే కళాశాలలు, నైపుణ్య కేంద్రాల నిర్వాహకులు తెలుసుకుని అందుకు అనుగుణంగా శిక్షణ ఇచ్చేవారు. డిగ్రీ, ఇంజినీరింగ్‌, ఇతర నైపుణ్య విద్యనభ్యసించిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగాలు చేయడానికి సరిపడా మెలకువలు నేర్పించి వారు ఉద్యోగాల్లో స్థిరపడేలా తర్ఫీదు ఇప్పించారు. దీంతో జిల్లాలో ఏటా ఐదారు వేల మంది శిక్షణ పూర్తి చేసుకుని వెళ్లేవారు. ఐదేళ్లలో కలిపి 20 వేల మందికి పైగా కొలువులు దక్కాయి.

శిక్షణా కేంద్రాల్లో కల్పించిన సౌకార్యాలివే...

  • ప్రతి కేంద్రంలో కంప్యూటర్లు
  • విద్యార్థులకు ఆన్‌లైన్‌లో ఉచిత శిక్షణ
  • ఏడాది మొత్తం సిబ్బంది అందుబాటులో ఉండి నిరుద్యోగులకు శిక్షణ ఇచ్చేవారు
  • 2014-19లో 25వేల మందికి పైగా శిక్షణ పొంది 20వేలకు పైగా కొలువులు సాధించారు.
  • యువనేస్తం ద్వారా నిరుద్యోగులకు భృతి
  • ముఖ్యమంత్రి యువనేస్తం ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం
  • ప్రతి కేంద్రంలో 120 మందికి శిక్షణ
  • రెండు వారాల సమయంలో 40 గంటల శిక్షణ ఇచ్చారు
  • కోర్సులు పూర్తికాగానే ఉద్యోగ మేళాల ద్వారా కొలువులు దక్కేలా చేశారు.

నాటి శిక్షణతో ఎంఎన్‌సీలో ఉద్యోగం

- చందన, వీవీఐటీ పూర్వ విద్యార్థిని

తెదేపా హయాంలో వీవీఐటీలో ఏపీఎస్‌డీసీ ఏర్పాటు చేసిన సీమెన్స్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌తో ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌, మెషిన్‌ లెర్నింగ్‌, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీస్‌ నేర్చుకున్నా. ఇది చివరి ఏడాది ప్రాజెక్టు చేయడానికి తోడ్పడింది. ఐయూసీ అనే నేషనల్‌ సంస్థ నిర్వహించిన పోటీల్లో ‘బ్లాక్‌ చైన్‌ మ్యాపింగ్‌ ఆఫ్‌ మిల్క్‌ ప్రొడక్ట్స్‌’ ప్రాజెక్టు చేసినందుకు గ్రేడ్‌-ఎ తో పాటు బెస్ట్‌ అవార్డు వచ్చింది. రోబోటిక్‌ ప్రాసెస్‌ ఆటోమెషిన్‌, సైబర్‌ సెక్యూరిటీ లేటెస్ట్‌ టెక్నాలజీస్‌ నా లాంటి విద్యార్థులకు ఉపయోగ పడింది. ఓ బహుళ జాతీయ సంస్థలో రూ.5.5లక్షల వార్షిక వేతనంతో ఎంపికయ్యా.  


డబ్బులు కేటాయించకే..

- డాక్టర్‌ వై.సురేష్‌బాబు, ప్రాంగణ ఎంపికల నిపుణులు

తెదేపా హయాంలో బహుళజాతి సంస్థలకు కావాల్సిన నైపుణ్యాలు ముందే గ్రహించి శిక్షణ ఇప్పించి ఉపాధి అవకాశాలు అందేలా చేశారు. గత ఐదేళ్లలో నైపుణ్యాభివృద్ధి సంస్థలు మరుగునపడ్డాయి. డబ్బులు కేటాయించకపోవడంతో వాటి ప్రయోజనం నెరవేరలేదు. ఉద్యోగులను తగ్గించారు. ఫలితంగా ఉపాధి అవకాశాలు తగ్గాయి. ఇంటర్న్‌షిప్‌ వ్యవస్థ తూతూమంత్రంగా నడుస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు