logo

రోశయ్య, ఆళ్ల మాట తప్పారు

పెదకాకాని హజరత్‌ సయ్యద్‌ బాజిషహీద్‌ అవులియా బాబా దర్గా నిర్వహణ బాధ్యతల విషయంలో ఎమ్మెల్యేలు రోశయ్య, ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట తప్పారు. ఈ కారణంగా ముత్తవల్లీ, ముజావర్ల వంశాలకు చెందిన 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

Published : 10 May 2024 05:11 IST

రెండు వందల కుటుంబాలు రోడ్డున పడ్డాయ్‌..

పెదకాకాని బాజిబాబా దర్గా

పెదకాకాని, నూస్‌టుడే: పెదకాకాని హజరత్‌ సయ్యద్‌ బాజిషహీద్‌ అవులియా బాబా దర్గా నిర్వహణ బాధ్యతల విషయంలో ఎమ్మెల్యేలు రోశయ్య, ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట తప్పారు. ఈ కారణంగా ముత్తవల్లీ, ముజావర్ల వంశాలకు చెందిన 200 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆనవాయితీ ప్రకారం.. ముత్తవల్లీలు దర్గా నిర్వహణ బాధ్యతలను చూస్తుంటారు. ముజావర్లు బాజి బాబావారికి సేవలు చేస్తుంటారు. అంత్రాలు, చాదర్‌, హుండీల ద్వారా వచ్చే ఆదాయంతో వారి కుటుంబాలు జీవనోపాధి సాగించేవి. ముత్తవల్లీల్లో ఏర్పడిన గ్రూపు తగాదాల కారణంగా పదేళ్ల క్రితం దర్గాను వక్ఫ్‌బోర్డు తన అధీనంలోకి తీసుకుంది. అప్పట్నుంచి దర్గాపై ఆధారపడ్డ కుటుంబాలకు జీవనోపాధి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దర్గా నిర్వహణ బాధ్యతను ముత్తవల్లీ, ముజావర్లకు ఇప్పిస్తామంటూ గత ఎన్నికల సమయంలో రోశయ్య, పంచాయతీ ఎన్నికల సమయంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు. ఇప్పటికీ నెరవేర్చలేదు. నాటి నుంచి వారిద్దరి చుట్టూ తిరుగుతూనే ఉన్నా కనికరించలేదు. ఎన్నికల సమయంలో ఓట్ల కోసమే ఉత్తుత్తి హామీలిచ్చారంటూ వారు మండిపడుతున్నారు.


వైకాపా నేతలు మోసం చేశారు
- షేక్‌.బాజీ, ముజావర్ల కుటుంబ సభ్యుడు

దర్గా నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని విజయవాడలోని రాష్ట్ర వక్ఫ్‌బోర్డు కార్యాలయం ఎదుట ముత్తవల్లీ, ముజావర్ల కుటుంబాలకు చెందిన ఐదు వందలమంది ధర్నా చేశాం. న్యాయం చేస్తామని వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ ఖాదర్‌బాషా హామీ ఇచ్చి మోసం చేశారు. దర్గా ప్రహరీ, సీసీ రోడ్డు నిర్మాణ శంకుస్థాపన కోసం ఎమ్మెల్యే రోశయ్య, వక్ఫ్‌బోర్డు ఛైర్మన్‌ ఖాదర్‌బాషా వచ్చినప్పుడు స్థానికులు నిలదీయగా దర్గా బాధ్యతలను కచ్చితంగా ఇప్పిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు నెరవేర్చలేదు. వైకాపా నేతలు అధికార పీఠం ఎక్కేందుకు మమ్మల్ని వాడుకుని మోసం చేశారు.


పట్టించుకొనే నాథుడేడి?
- సలీం, ముజావర్ల కటుంబ సభ్యుడు

మా తాతల కాలం నుంచి దర్గాలో సేవలు చేసి జీవిస్తున్నాం. ముత్తవల్లీ, ముజావర్లకు దర్గా బాధ్యతలను అప్పగించేందుకు ఎలాంటి అడ్డంకులు లేకపోయినా కావాలనే వక్ఫ్‌బోర్డు తాత్సారం చేస్తోంది. ప్రాంగణంలో ఏర్పాటు చేసుకున్న కొబ్బరికాయలు, బొమ్మల దుకాణాలతో బతుకుతున్నాం. ఆదాయం సరిపోక కుటుంబాల పోషణ కష్టంగా మారింది. ఎమ్మెల్యేలు రోశయ్య, ఆళ్ల రామకృష్ణారెడ్డి మమ్మల్ని పట్టించుకోవటం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు