logo

అంతర్‌ జిల్లాల బ్యాలట్లు గల్లంతు

పోస్టల్‌ బ్యాలట్‌ మొదలైనప్పటి నుంచి అంతర్‌ జిల్లాల ఉద్యోగుల విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. తొలి రోజు నుంచి బ్యాలట్ల కొరత ఉందని చెబుతూనే..

Published : 10 May 2024 05:19 IST

తామేమి చేయలేమన్న ఆర్‌వోలు
ఓటు వేయకుండానే వెనుదిరిగిన ఉద్యోగులు

గుంటూరు మహిళా కళాశాలలోని ఫెసిలిటేషన్‌ కేంద్రం వద్ద జాబితాలో పేర్లు చూసుకొంటున్న ఉద్యోగులు

కలెక్టరేట్‌(గుంటూరు), న్యూస్‌టుడే: పోస్టల్‌ బ్యాలట్‌ మొదలైనప్పటి నుంచి అంతర్‌ జిల్లాల ఉద్యోగుల విషయంలో గందరగోళం కొనసాగుతూనే ఉంది. తొలి రోజు నుంచి బ్యాలట్ల కొరత ఉందని చెబుతూనే.. సొంత నియోజకవర్గాలకు వెళ్లి  ఓట్లు వేసుకోవాలని చెప్పి తప్పించుకుంటున్నారు ఎన్నికల అధికారులు. దూరాభారంతో ఒక్కరోజు సెలవుతో వెళ్లి ఓటు వేసి రాలేక ఇక్కడి నుంచి పోస్టల్‌ బ్యాలట్‌కు దరఖాస్తు చేసుకున్నామని, సెలవు పెట్టుకుని ఓటు వేసేందుకు వచ్చామని తీరా ఇప్పుడు సొంత నియోజకవర్గాలకు వెళ్లమంటే ఎలాగని ఉద్యోగులు ప్రశ్నించినా ఫలితం లేకపోయింది.

  • గుంటూరు పశ్చిమలో ఓటు ఉన్న ఉద్యోగి పల్నాడు జిల్లా నరసరావుపేటలో పని చేస్తున్నారు. గురువారం పోస్టల్‌ బ్యాలట్‌ ఓటు వేసేందుకు నరసరావుపేటలోని ఫెసిలిటేషన్‌ కేంద్రానికి వెళ్లారు. వారు బ్యాలట్‌ రాలేదని.. గుంటూరు పశ్చిమకు వెళ్లి ఓటు వేయాలని సూచించారు.  ఇక్కడికి  వచ్చేసరికి బ్యాలట్‌ నరసరావుపేటకు పంపామని  జవాబిచ్చారు. దీంతో సమయం ముగిసిపోయింది.
  • రైల్వేలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు ప్రభుత్వ మహిళా కళాశాలకు ఓటు వేసేందుకు వెళ్లారు. అక్కడ బ్యాలట్‌లు అందుబాటులో లేవని చెప్పి సొంత నియోజకవర్గాలకు వెళ్లి ఓటు వేసుకోవాలన్నారు. రాజమండ్రి, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు, కృష్ణా జిల్లాలకు చెందిన ఉద్యోగినులు కావడంతో వారు వెళ్లి ఓటు వేసేందుకు సమయం సరిపోదు.
  • గుంటూరులో పనిచేస్తున్న ఉద్యోగికి ఉత్తరాంధ్ర జిల్లాలో ఓటుంది. బుధవారం గుంటూరు పశ్చిమలోని ఫెసిలిటేషన్‌ కేంద్రానికి వెళ్తే బ్యాలెట్‌ అయిపోయిందన్నారు.  ఎన్నికల అధికారుల నుంచి ధ్రువపత్రం తీసుకుని ఉత్తరాంధ్రకు వెళ్లారు. గురువారం ఉదయం ఓటు వేసేందుకు వెళ్లగా ఓపీవోలు బ్యాలట్‌ వేసేందుకు సమయం బుధవారంతో ముగిసిందన్నారు.

ఆంగ్రూలో ఉద్యోగులు.. ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో సుమారు 30 మంది ఉద్యోగులు ఓటుకు దూరమైనట్లు తెలిసింది. ఆంగ్రూలో ఉద్యోగులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారే.  పోస్టల్‌ బ్యాలట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆయా జిల్లాల నుంచి పోస్టల్‌ బ్యాలట్లు రాకపోవడంతో వారంతా ఓటువేసే అవకాశాన్ని కోల్పోయారు.

  • జిల్లాలోని ఓ ఉన్నతాధికారి సైతం పోస్టల్‌ బ్యాలట్‌ ఓటును కృష్ణా జిల్లాలోని నియోజకవర్గానికి వెళ్లి ఓటు వేసి వచ్చారు. సదరు అధికారి ముందుగా పోస్టల్‌ బ్యాలట్‌ అందుబాటులో లేదని తెలుసుకుని నేరుగా కృష్ణా జిల్లాకు వెళ్లినట్లుగా తెలిసింది. జిల్లా స్థాయి అధికారికి కూడా లేకపోతే ఆమె సొంత జిల్లాకు వెళ్లి ఓటు వేసి వచ్చారు.   గురువారం సమయం ముగిసిపోవడంతో ఓటు వేయాలని ఫెసిలిటేషన్‌ కేంద్రాలకు వచ్చిన ఉద్యోగులు బ్యాలట్‌ ఓటేయకుండానే వెనుదిరిగారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు