logo

KIMS Cuddles: ఆలౌట్‌ తాగిన చిన్నారి.. అరుదైన చికిత్సా పద్ధతితో కాపాడిన కిమ్స్‌ కడల్స్‌ వైద్యులు

ఆలౌట్‌ తాగిన 18 నెలల పాపను హైదరాబాద్‌లోని కిమ్స్‌ కడల్స్‌ వైద్యులు అరుదైన చికిత్సా పద్ధతిలో కాపాడారు. ఛత్తీస్‌గఢ్‌ భిలాయ్‌ ప్రాంతానికి చెందిన పాప ప్రమాదవశాత్తూ ఆలౌట్‌ లిక్విడ్‌ తాగేసింది.

Published : 25 May 2024 17:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఆలౌట్‌ తాగిన 18 నెలల పాపను హైదరాబాద్‌లోని కిమ్స్‌ కడల్స్‌ వైద్యులు అరుదైన చికిత్సా పద్ధతిలో కాపాడారు. ఛత్తీస్‌గఢ్‌ భిలాయ్‌ ప్రాంతానికి చెందిన పాప ప్రమాదవశాత్తూ ఆలౌట్‌ లిక్విడ్‌ తాగేసింది. దీంతో ఊపిరి అందక ఇబ్బంది పడుతుండటంతో గమనించిన తల్లిదండ్రులు స్థానిక ఆస్పత్రి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం రాయ్‌పూర్‌ తీసుకెళ్లారు. ఈ క్రమంలో పాప ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకీ క్షీణిస్తుండటంతో రాయ్‌పూర్‌ ఆస్పత్రి వర్గాలు హైదరాబాద్‌ కొండాపూర్‌లోని కిమ్స్‌ కడల్స్‌ ఆస్పత్రిని సంప్రదించాయి. అక్కడకు వెళ్లిన వైద్య బృందం పాప పరిస్థితిని సమీక్షించి ఎక్మో ద్వారా సాధారణ స్థితికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పాప బరువు 10 కిలోల కన్నా తక్కువ ఉండటంతో ఎక్మోను మెడ వద్ద అమర్చారు. ఇలా చేయడం ద్వారా ఊపిరితిత్తులు, గుండె రెండింటినీ బైపాస్‌ చేయవచ్చు. ఈ విధానం ద్వారా వైద్యం చేయడం చాలా అరుదు. ఎయిర్‌ అంబులెన్స్‌ ద్వారా రాయ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు తీసుకొచ్చి, ప్రత్యేక పర్యవేక్షణలో ఉంచి చికిత్స అందించడం ద్వారా చిన్నారి 18 రోజుల్లోనే కోలుకుంది. అన్ని రకాలుగా పరీక్షలు చేసి, చిన్నారి కోలుకుందని నిర్ధారించుకున్న తర్వాత ఆమెను డిశ్చార్జి చేశారు.

ఈ సందర్భంగా కొండాపూర్‌లోని కిమ్స్ కడల్స్ ఆస్పత్రి పీడియాట్రిక్స్ విభాగం క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ పరాగ్ శంకర్రావు డెకాటే మాట్లాడుతూ ‘కిమ్స్ కడల్స్ ఆస్పత్రిలో ఉన్న అత్యాధునిక సదుపాయాలు, అత్యున్నత నైపుణ్యం కలిగిన వైద్యబృందం వల్ల పాపను కాపాడగలిగాం. ఇక్కడ అందుబాటు ధరల్లోనే ఎక్మో సేవలు అందుతాయి. లిటిల్‌వన్ ఫౌండేషన్ ద్వారా పేద రోగులకు ఆర్థిక సాయం కూడా అందిస్తాం’ అని అన్నారు. పాపకు చికిత్స అందించిన వైద్య బృందంలో పీఐసీయూ అధినేత డాక్టర్ పరాగ్ డెకాటే, పీడియాట్రిక్ ఇంటెన్సివిస్టులు డాక్టర్ కళ్యాణ్, డాక్టర్ అవినాష్ రెడ్డి, కార్డియాక్ సర్జన్ డాక్టర్ సందీప్ జనార్థన్‌, పెర్ఫ్యూజనిస్టు దయాకర్, మేల్ నర్సు దీపుమోనే, సర్జికల్ సిస్టర్ నాగశిరీష ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని