logo
Published : 02/12/2021 03:01 IST

ప్రభుత్వ శిక్షణ కేంద్రం.. ప్రైవేటుపరం!

 అపారెల్‌ కేంద్రంలో తెరవెనుక యత్నాలు 

ఏటీడీసీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ధ్రువ కళాశాల బోర్డు

ఈనాడు, హైదరాబాద్‌ - న్యూస్‌టుడే, మాదాపూర్‌: హైటెక్‌ సిటీలోని సైబర్‌ టవర్స్‌కు కూతవేటు దూరంలో ప్రభుత్వ భూముల్లో విద్యా సంస్థ కోసం నిర్మించిన భవనాలను ఓ ప్రైవేటు కళాశాలకు అప్పగించేలా తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. మాదాపూర్‌లోని అపారెల్‌ ట్రైనింగ్‌, డిజైన్‌ సెంటర్‌ (ఏటీడీసీ)లో జరుగుతున్న తతంగమిది. కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో అపారెల్‌ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (ఏఈపీసీ) ఆధ్వర్యంలో మాదాపూర్‌లో 1995లో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అప్పట్లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 5 ఎకరాలను కేటాయించింది. ప్రస్తుతం రెండు డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో 110 మంది శిక్షణ పొందుతున్నారు. అలాంటి సంస్థను ప్రైవేటుకు అప్పగించే వ్యవహారానికి దిల్లీ స్థాయిలో చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. ఏఈపీసీ నుంచి నేరుగా ధ్రువ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ అండ్‌ విజువల్‌ ఆర్ట్స్‌కు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది.

భవనాలు నిర్మించి.. అపారెల్‌ ట్రైనింగ్‌, డిజైన్‌ సెంటర్‌కు కేటాయించిన స్థలంలో రెండేళ్ల కిందట 20 వేల చదరపు అడుగుల్లో సుమారు రూ.6 కోట్లు వెచ్చించి రెండు భవనాలు నిర్మించారు. ఇప్పుడు వీటన్నింటినీ ధ్రువ కళాశాల యాజమాన్యానికి అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. దాదాపు మూడెకరాల స్థలం కళాశాల ఆధీనంలోకి వెళ్లే అవకాశం ఉంది. చదరపు గజం కారుచౌకగా రూ.45 చొప్పున లీజుకిచ్చేలా ఒప్పందం చేసుకోనున్నట్లు సమాచారం. ఏటీడీసీ కేటాయించిన భూమి ఇప్పటికీ రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగానే ఉంది. ఏఈపీసీ అధికారులు భవనాలు నిర్మించి మరీ ప్రైవేటు కళాశాలను అనుమతించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  దీనిపై ఏటీడీసీ సంచాలకురాలు విజయలక్ష్మిని వివరణ కోరగా, ‘నేను రెండు నెలల కిందటే వచ్చాను. ధ్రువ కళాశాలకు అనుమతి ఇచ్చిన వ్యవహారం నాకు తెలీదు’ అని వివరించారు. ధ్రువ ఫ్యాషన్‌ టెక్నాలజీ కళాశాల పేరుతో ఏటీడీసీ భవనానికి ఎదురుగా ప్రధాన రహదారిలో భారీ బోర్డులు పెట్టారు. ఇందులో తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి అనుమతి, ఉస్మానియా వర్సిటీ నుంచి గుర్తింపు తీసుకున్నట్లు రాశారు. ఇంకా ఓయూ నుంచి అనుమతులు తీసుకోకుండానే గుర్తింపు వచ్చినట్లుగా బోర్డులు ఏర్పాటు చేయడం విశేషం.

త్వరలో ఒప్పందం: వెంకట్‌రెడ్డి, ధ్రువ కళాశాల ఛైర్మన్‌

త్వరలో ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుని కళాశాల ప్రారంభించాలనుకుంటున్నాం. ఓయూ నుంచి ఇంకా అనుమతి తీసుకోవాలి. మా పాత బోర్డులను చూసి పెయింటర్‌ గుర్తింపు ఉన్నట్లుగా రాశాడు అంతే.

Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని