logo
Published : 05/12/2021 01:50 IST

రెంచి పడతాం.. రక్షణ కల్పిస్తాం

రాచకొండ కమిషనరేట్‌లో మహిళా సిబ్బందికి వాహనం నడపడం, మరమ్మతులపై శిక్షణ

మహిళా కానిస్టేబుళ్లకు శిక్షణ ఇస్తున్న పోలీసు అధికారి

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: శాంతి భద్రతలు, ట్రాఫిక్‌ బాధ్యతలు, సైబర్‌ క్రైం కేసుల ఛేదన ఇలా ఏ విషయంలోనైనా రాష్ట్రంలోని మహిళా పోలీసులు పురుషులతో సమానంగా విధులు నిర్వహిస్తూ శేభాష్‌ అనిపించుకుంటున్నారు. తాజాగా రాత్రి వేళల్లో సైతం గస్తీ నిర్వహించడం, విధి నిర్వహణలో వాహనం మొరాయిస్తే మరమ్మతులు చేయడం వంటి క్లిష్టతర అంశాల్లో శిక్షణ తీసుకుని మెరికల్లా తయారవుతున్నారు రాచకొండ కమిషనరేట్‌లోని మహిళా పోలీసులు.

49 రోజులపాటు తర్ఫీదు..

నేరస్థులను పట్టుకునేందుకు.. నేరాలను నియంత్రించేందుకు అధునాతన వాహనాలను పోలీసులకు ప్రభుత్వం సమకూర్చింది. వీటిని ఇప్పటివరకూ పురుషులే నడుపుతున్నారు. ఉమెన్‌ సేఫ్టీవింగ్‌లో భాగంగా మహిళా సిబ్బందిని సైతం ఇందుకు సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 16మంది ఏఆర్‌ మహిళా పోలీసులు ముందుకు వచ్చారు. వీరిలో ఐదుగురు ఏఎస్సైలు, ఇద్దరు హెడ్‌ కానిస్టేబుళ్లు, 9మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరికి నాలుగు చక్రాల వాహనాలు నడపటం, మరమ్మతులు చేయడం వంటి అంశాలపై 49రోజులపాటు కఠోర శిక్షణ అందించారు. పాతబస్తీ పేట్లబురుజులోని పోలీస్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్యాలయంలో ఎస్పీ ఆధ్వర్యంలో ఓ పీటీవో అధికారి శిక్షణ ఇచ్చారు. అసలు వాహనం గురించే అవగాహన లేని వీరికి మొదటి సిమ్యులేటర్‌పై శిక్షణ అందించారు. తర్వాత ట్రాఫిక్‌లో చాకచక్యంగా నడిపేలా తర్ఫీదునిచ్చి లైసెన్స్‌లు అందించారు. ఏదైనా సమస్యతో వాహనం మొరాయిస్తే వెంటనే తెలుసుకుని బాగుచేయడం గురించి వివరించారు. టైర్‌ మార్చడం, ప్రతికూల పరిస్థితుల్లో వాహనాన్ని నడపడం, పెట్రోలింగ్‌ నిర్వహించడం, ప్రమాదాలు నియంత్రించడం, బ్రేకులు ఫెయిల్‌ అయినప్పుడు సమయస్ఫూర్తితో వ్యవహరించడం, ఆగిపోయినా సరే వాహనాన్ని స్టార్ట్‌ చేయడం వంటి అంశాల్లో శిక్షణ కొనసాగింది.

వారే ఉంటే బాగుంటుందని..

మహిళల ఫిర్యాదులపై పోలీసులు ఘటనాస్థలానికి వెళ్తే సమస్య వినేందుకు పురుషులు కంటే మహిళా పెట్రోలింగ్‌ పోలీసులు ఉంటే బాగుంటుందని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ భావించారు. ఇందుకోసం కమిషనరేట్‌ పరిధిలో ఉన్న పోలీసు స్టేషన్లలో డ్రైవింగ్‌ చేసే మహిళా సిబ్బంది ఉండాలని వీరికి శిక్షణ అందించారు. ప్రస్తుతం శిక్షణ తీసుకున్న మొదటి బ్యాచ్‌ను పరిశీలించిన రాచకొండ సీపీ, ఉన్నతాధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి బ్యాచ్‌కు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారని ప్రస్తుతం రెండో బ్యాచ్‌లో మరో 16 మందికి శిక్షణ కొనసాగుతుందని మోటార్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అధికారి ఏసీపీ భాస్కర్‌ తెలిపారు. రాష్ట్రంలోనే తొలిసారి రాచకొండ కమిషనరేట్‌లో ఈ తరహా శిక్షణ ఇవ్వడం గర్వంగా ఉందన్నారు.


గర్వంగా ఉంది

రాణి, ఏఆర్‌ కానిస్టేబుల్‌

ఎలాంటి వాహనం ఇచ్చినా నడపగలను. ట్రాఫిక్‌, లా అండ్‌ ఆర్డర్‌, సైబర్‌ క్రైంలో పని చేశాను. వాహనం నడపడం, మరమ్మతులు ఎందుకు చేయలేము అని ప్రయత్నించాను. ఇప్పుడు గర్వంగా భావిస్తున్నాను. వ్యక్తిగత జీవింతంలో కూడా ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుంది.


ఎన్నో అవకాశాలు ఉంటాయి

శ్వేత, ఏఆర్‌ కానిస్టేబుల్‌

నాకు ద్విచక్ర వాహనమే రాదు. అలాంటిది కారు నడపడం అంటే మొదట భయపడ్డాను. శిక్షణలో భాగంగా చాలా విషయాలు నేర్చుకున్నాను. యువతులు పోలీసులు ఉద్యోగాల్లోకి రావడానికి ఎలాంటి భయాలు పెట్టుకోవద్ధు ఇక్కడ మనని మనం నిరూపించుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉంటాయి.


Read latest Hyderabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని