logo

ప్రభుత్వ బడుల్లోకి అంగన్‌వాడీ కేంద్రాలు!

గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇవి చాలా చోట్ల అద్దె భవనాల్లో అరకొర వసతులతో  కొనసాగుతున్నాయి.

Published : 15 Jan 2022 00:52 IST

న్యూస్‌టుడే, వికారాబాద్‌: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహిస్తోంది. ఇవి చాలా చోట్ల అద్దె భవనాల్లో అరకొర వసతులతో  కొనసాగుతున్నాయి. ఇక ప్రతి నెలా అద్దె చెల్లించడం భారం కావడంతో వాటిని స్థానిక ప్రభుత్వ బడుల్లోకి మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

5 ప్రాజెక్టులు.. 1106 కేంద్రాలు..:  జిల్లాలో వికారాబాద్‌, మర్పల్లి, తాండూరు, పరిగి, కొడంగల్‌ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 1,106 కేంద్రాలను నిర్వహిస్తున్నారు. వీటిలో 468 కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా, 453 ప్రభుత్వ, ప్రైవేటు  భవనాల్లో కొనసాగుతుండగా, 185 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.

 సౌకర్యాలు లభించేనా?..

అద్దె నామమాత్రంగా ఉండటంతో కేంద్రాలు అసౌకర్యాల మధ్య నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ.750 నుంచి రూ.వెయ్యి చెల్లిస్తున్నారు. మండల కేంద్రాలు, పట్టణాల్లో వసతులను బట్టి రూ.వెయ్యి నుంచి గరిష్ఠంగా రూ.4 వేలు చెల్లిస్తున్నారు. అద్దె కేంద్రాల్లో మరుగుదొడ్లు లేకపోవడంతో గర్భిణులు, బాలింతలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి కేంద్రాలను మార్చిన అనంతరం సౌకర్యాలు అందుబాటులో ఉంటాయో లేదోనన్నది సందేహమే. ఇప్పటికే వాటిల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. సరిపడా గదులు లేక అవస్థలు పడుతుంటే, అంగన్‌వాడీ కేంద్రాలకు గదులను ఎలా కేటాయించాలని విద్యాశాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు.

ఆందోళనలో సిబ్బంది..: కేంద్రాలు పాఠశాలల్లోకి మార్చడం వల్ల దూరం పెరగనుంది. అలాగే అంగన్‌వాడీ వ్యవస్థను రద్దు చేయడంలో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల్లో విలీన ప్రక్రియను ముందుకు తెచ్చాయని అంగన్‌వాడీ టీచర్లు ఆరోపిస్తున్నారు. తరలింపు ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


ఆదేశాలు జారీ చేశాం..
- లలితకుమారి, జిల్లా స్త్రీ, శిశు సంక్షేమాధికారిణి, వికారాబాద్‌

జిల్లాలో 185 అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. వాటిని ఆయా మండల విద్యాశాఖ అధికారులతో సంప్రదించి సమీపంలోని ప్రభుత్వ పాఠశాల సముదాయంలోకి మార్చేలా చర్యలు తీసుకోవాలని సీడీపీఓ, సూపర్‌వైజర్‌లకు ఆదేశాలు జారీ చేశాం. అయితే చాలా చోట్ల పాఠశాలకు సరిపడా గదులే లేవని, కేంద్రానికి గదులు ఎక్కడి నుంచి కేటాయించేదంటూ ఉపాధ్యాయులు అభ్యంతరం తెలుపుతున్నట్లు తెలిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని